నా యెరుక
నా యెరుక (నా యెఱుక) హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు రాసిన ఆత్మకథ.
నా యెరుక(నా యెఱుక) | |
కృతికర్త: | ఆదిభట్ల నారాయణదాసు |
---|---|
సంపాదకులు: | యస్వీ. జోగారావు (1976లో తొలిముద్రణకు), మోదుగుల రవికృష్ణ (2012లో మలిముద్రణకు) |
ముఖచిత్ర కళాకారుడు: | రాయన గిరిధర్ గౌడ్ |
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఆత్మకథలు |
ప్రచురణ: | కర్రా ఈశ్వరరావు (తొలి ప్రచురణ), మిత్రమండలి ప్రచురణలు (మలి ప్రచురణ) |
విడుదల: | తొలి ప్రచురణ - 1976, రెండవ ప్రచురణ - 2012 |
రచన నేపథ్యం
మార్చుతెలుగులో రాసిన తొలి ఆత్మకథగా, ప్రచురణలోకి వచ్చిన మూడో ఆత్మకథగా చారిత్రికంగా నా యెరుక ప్రఖ్యాతి పొందింది. స్వీయచరిత్ర (ఆత్మకథ) అనే ప్రక్రియలో పాశ్చాత్య దేశాల్లోని తాత్త్వికులు, మహాకవులు, చారిత్రికులు, రాజనీతివేత్తలు, కళాకుశలురు తమ జీవితాన్ని రాసుకున్నారు. వారి కోవలో సామాన్యులు కూడా స్వీయచరిత్రలను రాసుకున్నారు. ఆధునిక యుగంలో అలా బాగా విస్తరించిన స్వీయచరిత్ర ప్రక్రియ ఆంగ్ల విద్యాభ్యాసంతో భారతీయ సాహిత్యంలో పాదంమోపింది. ఈ గ్రంథం ద్వారా స్వీయచరిత్రలు అనే ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆదిభట్ల నారాయణదాసు ప్రసిద్ధి వహించారు. ప్రముఖ సంఘసంస్కర్త, సాహిత్యవేత్త కందుకూరి వీరేశలింగం పంతులు చేపట్టిన సంస్కరణోద్యమం, వ్యవహారిక భాషోద్యమం వంటివి నారాయణదాసు పూర్తిగా వ్యతిరేకించేవారు. వీరేశలింగం కవిత్వాన్ని, ఉద్యమాన్ని కూడా హేళన చేశారు. బ్రహ్మసమాజాన్ని, వితంతు వివాహాలను నారాయణదాసు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వీరేశలింగం, నారాయణదాసుల మధ్య విభేదాలు వైషమ్యాల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదిభట్ల స్వీయచరిత్ర రాస్తున్న సంగతి తెలిసి ఆయన కంటే ముందుగానే తన ముద్రణాలయం ద్వారా స్వీయచరిత్ర ప్రచురించారు. దాంతో తొలిగా తెలుగు సాహిత్యానికి స్వీయచరిత్ర ప్రక్రియను పరిచయం చేసినా దురదృష్టవశాత్తూ అది ప్రచురణలోకి వచ్చిన తొలి ఆత్మకథ కాకుండాపోయింది.[1]
రచనాంశాలు
మార్చునా యెఱుక 19వ శతాబ్ది చివరిపాదంలో దాక్షిణాత్య జీవన సరళికి, సమకాలీన మత సాంఘిక రాజకీయ కళాసంబంధమైన విషయసర్వస్వానికి అద్దం పడుతుంది. మూడు పదుల వయస్సులోపుగా ఆయన ఒడిశాలోని రసూల్ కొండ నుండి కర్ణాటకలోని మైసూరు వరకు గల వివిధ పట్టణాల్లో, పల్లెల్లో విస్తృతంగా పర్యటించారు. తన అనుభవంలోకి వచ్చిన ప్రతి అంశాన్నీ, తన దృష్టికి ఆనిన ప్రతి దృశ్యాన్నీ, తనను ఆదరించిన ప్రతి కళాపోషకుడిని, తన చెలిమికాండ్రనూ, తనతో చదువుకొన్నవారినీ, తన గురువులను, తన శత్రువులను ఒకరిని కూడా మరువకుండా, విడవకుండా నా యెఱుకలో ప్రస్తావించారు. గవ్వ, టోలీ, డబ్బు వంటి స్వల్ప ద్రవ్యప్రమాణాల గురించీ, రాత్రనక పగలనక ఆనాడు క్రోసుల కొలది నడక ప్రయాణాల వింతలు విశేషాలు తెలుసుకోవాలంటే నా యెఱుక చదవాలంటారు సాహితీవేత్త ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి.
నా యెఱుక గ్రంథంలో ఏడు అధ్యాయాలలో ఆదిభట్ల నారాయణదాసు బాల్యం నుంచి యౌవనంలో హరికథా ప్రక్రియను ప్రారంభించి ప్రఖ్యాతులయ్యే వరకూ గల జీవితాన్ని చిన్న చిన్న వివరాలతో సహా చెప్పారు. అజ్జాడ నుంచి పూరీ జగన్నాథానికి నెలల తరబడి చేసిన ప్రయాణం, దారిలోని వింతలు విశేషాలు వివరించారు. ఆ రోజుల్లో బందరు, విజయనగరం, బరంపురం వంటి పట్టణాలు దుర్గంధపూరితాలై, ధూళిదూసరితాలై, అనారోగ్య నిలయాలై ఉండే వైనమంతా చిత్రీకరించారు. ఓఢ్ర, తమిళ, ఆంధ్ర, కర్ణాటక దేశాల్లోని మనుషుల మాటతీరు, వేషభాషలు, కళాకుశలత ఎలా ఉండేదో దృశ్యమానం చేశారు. తొలిసారి చొక్కాలు తొడుక్కున్నప్పుడు, మొదటిసారి రైలెక్కినప్పుడు ఆనాటి గ్రామీణుల అనుభూతులు, మైసూరు, విజయనగరం సంస్థానాధీశుల ప్రాభవం, ఔదార్యం, సాహిత్య పోషణ, కళాపోషణలు వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి.
శైలి-శిల్పం
మార్చుఆదిభట్ల నారాయణదాసు "నా యెఱుక" రచనలో అవగుణాల్ని ఆవంతైనా దాచుకోని బోళాతనం కనిపిస్తుంది. సత్యనిష్ట, సవివరణాత్మక శైలి ముఖ్యలక్షణాలుగా స్వీయచరిత్ర రచించారు. ఆయనకు సమకాలీనులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు ప్రారంభించిన వ్యవహార భాషోద్యమం సుతరామూ అంగీకారం కాలేదు. ఆ నేపథ్యంలో "నా యెఱుక" గ్రాంథిక భాషలో రచించారు. ఆయన వచనం నుడికారపు సొంపుతో సాగింది. ఈ స్వీయచరిత్రను ఒక నవల చదివినంత ఆసక్తిగా నిలుపుదల లేకుండా చదవవచ్చునంటారు సాహితీవేత్త ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి.
తన ప్రాణమిత్రుడు, తొలిదశలో తన పోషకుడు, తనతో కలిసి కవిత్వం చెప్పినవాడు, తన కంచంలోనే భోజనం చేసినవాడు, తానెక్కిన పల్లకీ భుజాన మోసినవాడు, త్యాగి, భోగి, సంపన్నుడు ఐన జయంతి కామేశం పంతులుతో తన కథ చెప్తున్న విధంగా నా యెఱుక రచన ప్రారంభిస్తారు. నారాయణదాసు. ఈ రచన మొత్తం ఆయనతో చెప్తున్న శైలిలోనే కొనసాగడం విశేషం.
ప్రాధాన్యత
మార్చుతొలి తెలుగు స్వీయచరిత్రగానే కాక 19శతాబ్ది చివరి రోజుల్లోని ప్రజా జీవితం, సాంఘిక స్థితిగతులు, కళల పరిస్థితి వంటివి చిత్రీకరినిన గ్రంథంగా కూడా నా యెఱుక చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రచురణలు
మార్చునా యెఱుక 1953లో కొంత భాగం, 1955లో మిగిలిన భాగం ఆంధ్రపత్రికలో ప్రకటించారు. 1955లో ప్రచురిస్తున్నప్పుడు ఉపాధ్యాయులవారు అందజేశారని బాక్సులో పేర్కొన్నారు. ఆ ఉపాధ్యాయులవారు నారాయణదాసు మనుమడు ఉపధ్యాయులు సూర్యనారాయణ అయివుంటారని ద్వితీయ ముద్రణకు సంపాదకత్వం వహించిన మోదుగుల రవికృష్ణ భావించారు.1976లో ఎస్.వి.జోగారావు సంపాదకత్వంలో కర్రా ఈశ్వరరావు నా యెఱుకను ప్రచురించారు. 36 సంవత్సరాల అనంతరం మిత్రమండలి ప్రచురణలో మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో నా యెఱుక ద్వితీయ ముద్రణ పొందింది.[2]