నిర్మల్ బొమ్మలు

నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్యబొమ్మలు కొయ్యతో చేయబడినవి. ఇవి తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారుచేయబడినందున వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది. నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.[1][2]

నిర్మల్ బొమ్మలు
కొన్ని పండ్ల ఆకృతులు
సంస్థనిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రమ,నిర్మల్
దేశంభారత దేశం
రాష్ట్రంతెలంగాణ
ప్రాంతంనిర్మల్
లభ్యత400 సం. నుండి–
పదార్థాలుపొనికకర్ర, సహజ రంగులు
నిర్మల్ బొమ్మలు is located in India
నిర్మల్
నిర్మల్
భారతదేశంలో నిర్మల్ పట్టణ ఉనికి.

చరిత్ర

మార్చు

ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు.[3] పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది. 1830ల్లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా వ్రాశారు. నిర్మల్ బొమ్మలు, పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు. ఐతే అతిపరిచయం వల్ల కలిగే ఉదాసీనతతో తమ బొమ్మల విశిష్టత తాము తెలియకున్నారని, అందుకే ఒక ఇంట్లో చూసినా నిర్మల్ పంచపాత్రలు వాడుకలో కనిపించట్లేదని వ్రాశారు.[4] 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పరచారు.[5] రాష్ట్రపతిచే అవార్డు కూడా పొందినారు.

నిర్మల్ సంస్థానాన్ని పరిపాలిం చిన నిమ్మ నాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచాడు. దీంతో నిర్మల్లో 17వ శాతబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. నకాషీ కులానికి చెందిన కళాకారులు ఈ బొమ్మల తయారీలో నిమగమై వీటిని తయారు చేస్తారు. నిజాం నవాబు ఓసారి నిర్మల్ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంలో ఆయనకు సకల లాంఛనాలతో నవాబు స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంలో కూర్చోగానే పైనుంచి ఆయనపై పూలవర్షం కురిసింది. అవి మాములు పూలు కావు బంగారు పూలు. అచ్చు బంగారు పువ్వులను మరిపించే పూల వర్షం కురిపించారు. అయితే అవి బంగారు పుష్పాలు కావు. బంగారు పుష్పాల్లా భ్రాంతిని కలిగించే విధంగా నిర్మల్ కళా కారులు సృష్టించిన కృత్రిమ పుష్పాలవి.[6] మెహర్ రాజ్ మాల్వేకర్

తయారీ విధానం

మార్చు

ఇక్కడి కళాకారులు తయారుచేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉండి మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి. ఈ బొమ్మలను అడవులలో లభించే "పొనిక" కర్రను ఉపయోగిస్తారు. వనమూలికలు, సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారుచేస్తారు. అందువల్ల ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తారు. పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకొని బొమ్మ ఆకారానికి మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు. ఆ తరువాత బొమ్మను ఎండలో అరబెట్టి రంగులు వేస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు, సహజ వర్ణాలు ఉపయోగించి బంగారు వర్ణనాన్ని తయారు చేస్తారు.[7]

వివిధ ఆకారాలు

మార్చు

ఈ కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్షపండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె, సిగరెట్లు తదితరమైనవి ఉంటాయి. ఈ కళాకారులు తయారు చేసిన లవంగాలు, యాలకులు, తమలపాకులు, సిగరెట్ పెట్టెలను చూస్తే సహజత్వాన్ని మరిపిస్తాయి. దీనికి తోడు ఈ కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా గొప్పగానే ఉంటాయి. ముని కోపం వల్ల శిలారూపం దాల్చిన గంధర్వకన్య, యుద్దరంగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసే గీతా బోధనలు, ప్రకృతి సహజంగా ఏర్పడిన చిత్రాలు, దేవతా చిత్రాలు నిర్మల్ కళాకారుల చతురతకు అద్దంగా నిలుస్తున్నాయి.[6]

అమ్మకాలు

మార్చు

హైదరాబాద్లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా అమెరికా, రష్యా, అరేబియా, మలేషియా, ఇరాన్, దుబాయ్, స్విట్జర్లాండ్, సింగపూర్, తదితర దేశాలకు నిర్మల్ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్.కామ్ తెలంగాణలోని ప్రముఖ ఉత్పత్తులను ఇక నుండి తమ ఆన్ లైన్ నుండి అమ్మేందుకు సిద్దమయింది.[8]

కేంద్ర అవార్డు

మార్చు

భారత కేంద్ర పర్యాటక శాఖ 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులో మన నిర్మల్ కొయ్య బొమ్మకు ప్రతిష్టాత్మక జాతీయ పర్యాటక అవార్డు దక్కింది. 2024 సం లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం చేశారు[9].

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nirmal Attractions". Archived from the original on 2016-02-12. Retrieved 2016-01-25.
  2. "News Archives". The Hindu. 2010-10-26. Archived from the original on 2010-10-11. Retrieved 2015-12-19.
  3. "Nirmal toys to get a makeover". S. HARPAL SINGH. The Hindu. July 5, 2012. Retrieved 24 January 2016.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, 2008, పేజీ 278
  6. 6.0 6.1 "సజీవ కళలకు ప్రతిరూపం నిర్మల్ బొమ్మలు". బి.రమేష్ కుమార్ - ఆదిలాబాద్. visalaandhra. 8 Jun 201. Retrieved 24 January 2016.[permanent dead link]
  7. "From the Toyland of Andhra Pradesh". The Hindu. 2011-02-21. Archived from the original on 2012-10-23. Retrieved 2015-12-19.
  8. నిర్మల్ బొమ్మలు ఇక అమెజాన్.కామ్ లో Feb 5, 2015[permanent dead link]
  9. "మ‌న నిర్మ‌ల్‌కు కేంద్ర అవార్డు." naandi news (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-09-27. Retrieved 2024-09-28.

ఇతర లింకులు

మార్చు