పండిత గోపదేవ్

గోపదేవ్ (జులై 30, 1896 - అక్టోబర్ 22, 1996) సంస్కృతములో మహాపండితుడు, తెలుగునాట ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు[1].

పండిత గోపదేవ్ శాస్త్రి
పండిత గోపదేవ్.jpg
దర్శన తత్త్వవేత్త, వేదవేదాంగ పారగత్, కళాప్రపూర్ణ పండిత గోపదేవ్
జననంకావూరి గోపయ్య
1896, జులై 30
గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామం
మరణం1996, అక్టోబర్ 22
ప్రసిద్ధిఆర్య సమాజ
తల్లిదండ్రులుకావూరి రామయ్య, అచ్చమాంబ

జననం - బాల్యముసవరించు

పండిత గోపదేవ్ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కూచిపూడి గ్రామములో కావూరి రామయ్య, అచ్చమాంబ దంపతులకు 1896, జులై 30 న జన్మించాడు.వీరికి తల్లిదండ్రులు పెట్టినపేరు గోపయ్య, సామాన్య కర్షక కుటుంబములో పుట్టాడు. చిన్నతనములో పొలం పనులు చేసుకుంటూ తండ్రికి చేదోడుగా ఉండేవాడు. కొంత వయస్సు వచ్చిన తర్వాత స్వంత ఆసక్తితో అక్షర జ్ఞానం సంపాదించాడు. చదువు మీద జిజ్ఞాస పెరిగింది. బెల్లంపల్లి వెంకటనారాయణ వద్ద చదువుకొని ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందాడు. 1922లో గుంటూరు జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగములో చేరిన కొత్తలోనే పెళ్ళి జరిగింది. భార్య వివాహము జరిగిన కొద్ది కాలానికి భార్య చనిపోయింది. శేషజీవితం బ్రహ్మచర్యములోనే గడపాలని దీక్ష బూనాడు.

సంస్కృత విద్యసవరించు

కూచిపూడి దగ్గరలోని అమృతలూరు లో సంస్కృత పండితులను ఆశ్రయించి పంచకావ్యాలను, నాటక సాహిత్యము చదివాడు. కావూరు సంస్కృత పాఠశాలలో తర్క, మీమాంస శాస్త్రములు చదివాడు. వేద వేదాంగములు అభ్యసించడానికి పండితులను కోరగా నిరాకరించబడ్డాడు. కేరళ, లాహోరు, వారణాసి పర్యటించి, విసిగి చివరకు ఢిల్లీ లో స్వామి శ్రద్ధానంద స్మారక విశ్వవిద్యాలయములో 1927లో విద్యార్థిగా చేరాడు. అచటనే ఉపనయన సంస్కారం జరిగింది. గోపయ్య గోపదేవ్ శాస్త్రిగా మారాడు. విద్వాంసుల వద్ద వేదోపనిషత్తులు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్నాడు. ఆదర్శవంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. లాహోరు లోని ఉపదేశక విశ్వవిద్యాలయములో చేరి అచట స్వతంత్రానందస్వామి వద్ద సంస్కారవిధి, తర్కము, మీమాంస, వేదానంద స్వామి వద్ద వ్యాకరణము నేర్చుకున్నాడు. అచటనే ఆర్యసమాజ పరిచయం, ప్రవేశం జరిగాయి. దర్శన వాఙ్మయం చదివే కోరికతో పోఠోహోర్ గురుకులము చేరి పండిత రామోపాధ్యాయుల వద్ద శిష్యుడిగా చేరాడు. 1933లో జగద్గురు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల పరిచయముతో పీఠాధిపతుల వద్ద వేదాంత దర్శనము చదివే భాగ్యము కలిగింది.

ఆర్య సమాజముసవరించు

తరువాత స్వగ్రామము కూచిపూడి చేరి, పండిత గంగాప్రసాద్ ఉపాధ్యాయ ప్రోత్సాహముతో వైదిక ధర్మాన్ని, వైదిక సంస్కృతినీ ప్రచారం చేయాలనే ఆశయముతో 1939లో ఆర్య సమాజము స్థాపించాడు. తెలుగు నాట అనేక ప్రాంతాలలో ఆర్యసమాజాన్ని గురించి, మహర్షి దయానంద సరస్వతి సందేశాల గురించి ప్రచారము చేశాడు. అనేక చోట్ల ఆర్యసమాజాలు స్థాపించాడు. కూచిపూడిలో 1946లో మహిళా ఆర్యసమాజము కూడా స్థాపించి స్త్రీలకు వేదాభ్యాసము చేశాడు. హైదరాబాదులో దయానంద సరస్వతి ఉపదేశక విద్యాలయములో ఉపదేశకునిగా పనిచేసి డెబ్బది పైగా గ్రంథాలు రచించాడు.[2]

రచనలు- అనువాదములుసవరించు

  • సత్యార్ధ ప్రకాశము
  • దయానంద ఋగ్వేద భాష్యభాస్కరము (3 భాగాలు)
  • నిరుక్తము
  • ఉపనిషత్తులు (11 గ్రంథాలు)
  • న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ దర్శన గ్రంథాలు (4 గ్రంథాలు)
  • వేద తత్త్వ ప్రకాశము[3]
  • వేదాంత దర్శనము (వ్యాస కృత బ్రహ్మ సూత్రములు)
  • ఆస్తిక వాదం
  • వైదక త్రైత్రవాదము
  • శ్రీమద్భగవద్గీత
  • డాక్టర్ గోపదేవ్ ఆత్మచరిత్ర

పురస్కారాలుసవరించు

1922లో దయానంద సరస్వతి వారి పురస్కారము పొందాడు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్ "కళాప్రపూర్ణ" బిరుదుతో గౌరవించింది.

మరణంసవరించు

నిస్వార్ధముగా వైదికథర్మ ప్రచారానికి జీవితము అంకితము చేసిన గోపదేవ్ శత వసంతాలు పరిపూర్ణ జీవనం గడిపి 1996, అక్టోబర్ 22 న పరమపదించారు.

మూలాలుసవరించు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 84
  2. పండిత, గోపదేవ్ శాస్త్రి (1997). సత్యార్ధప్రకాశము. సికింద్రాబాదు: అంబా - రామార్య సత్యార్ధప్రకాశక ట్రస్టు. p. 4.
  3. "Vedatatva Prakasamu By Pandita Sri Gopadev In Telugu". Internet Archive. Retrieved 1 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)