పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్

పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్, ప్రసిద్ధ నాటక అనువాదకుడు. వాగ్గేయకారుడు. నవలా రచయిత. జానపద కళా ప్రముఖుడు. సాహిత్యకళా యోధుడు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్.[1] గుంటూరు జిల్లా రేపల్లె సమీపం లోని వెల్లటూరులో అంకినీడు, మహాలక్ష్మమ్మ దంపతులకు 1928లో లక్ష్మీకాంత మోహన్ జన్మించాడు. చిన్నతనం నుంచి కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన లక్ష్మీకాంతమోహన్ అనేక రంగాల్లో నిష్ణాతుడిగా ఎదిగాడు. షేక్సిపియర్ రచించిన 33 నాటకాలలో 22 నాటకాలను అనువదించాడు.[2] లక్ష్మీకాంతమోహన్ రచించిన షేక్సిపియర్ మెన్ అండ్ విమెన్, సైకలాజికల్ ఇంటర్ ప్రిటేషన్ గ్రంథాలను నాగపూర్ విశ్వవిద్యాలయం పాఠ్య గ్రంథాలుగా ఎంపిక చేసింది. తెలంగాణ పోరాట గాథలు తెలుగు గ్రంథాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. చైనా గెరిల్లా యోధుడు, కూలి, కౌలుదారు, స్వామివివేకానంద, ఝాన్సీలక్ష్మీబాయి, కన్నకూతురు, అల్లూరి సీతారామరాజు బుర్రకథలను రచించడమే కాకుండా స్వయంగా వినిపించాడు. జానపద కళారూపమైన గొల్ల సుదులను ఆంగ్లంలోకి అనువదించి చెప్పాడు. కాంగ్రెస్ మంత్రుల వీధిబాగోతం, ఎల్లమ్మ కథ అనే ఒగ్గు కథలతో పాటు అనేక తెలంగాణ జానపద గేయాలను రచించాడు. బుర్రకథ పితామహుడు నాజర్కు బుర్రకథలో మెలకువలను నేర్పాడు. రామరాజ్యం, సింహ గర్జన, సింహపురిరాణి, మేరియాన్ నవలలను రచించాడు. సింహగర్జన నవలను మద్రాసు, తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. ఏఆర్ కృష్ణ ప్రదర్శించిన మాలపల్లి జీవ నాటకంలో లక్ష్మీకాంతమోహన్ బుర్రకథ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ధాప్యంలో తీవ్ర దారిద్ర్యంతో అష్టకషాలు పడ్డ లక్ష్మీ కాంతమోహన్ 1995 మే 5న అస్తమించాడు.

మూలాలు

మార్చు
  1. http://epaper.andhrajyothy.com/c/11435049[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-23. Retrieved 2016-07-18.