పల్లెటూరి పిల్ల

1950 తెలుగు సినిమా

పల్లెటూరి పిల్ల, 1950లో విడుదలయిన ఒక తెలుగు సినిమా. రామారావు, అక్కినేని కలసి నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా గురించి రూపవాణిలో ఇలా వ్రాశారు -

పల్లెటూరి పిల్ల
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం బి.ఎ.సుబ్బారావు
కథ బి.ఎ.సుబ్బారావు
చిత్రానువాదం బి.ఎ.సుబ్బారావు
తారాగణం అంజలీదేవి(శాంత),
అక్కినేని నాగేశ్వరరావు (వసంత్),
ఎన్.టీ.రామారావు (జయంత్),
ఎ.వీ.సుబ్బారావు (కంపన్న దొర),
ఎస్వీ.రంగారావు (తాత),
నల్ల రామమూర్తి (లప్పం),
సీతారామ్ (టప్పం),
లక్ష్మీకాంతం (ఓ వీర కంపన్న పాటలో నర్తకి),
టీ.వీ.రాజు (గూఢచారి)
సంగీతం పి.ఆదినారాయణరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పిఠాపురం నాగేశ్వరరావు,
జిక్కి కృష్ణవేణి
సంభాషణలు తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం కొట్నిస్
కూర్పు కె. శ్రీరాములు
విడుదల తేదీ 27 ఏప్రిల్
భాష తెలుగు

ఒక పురుషుని చుట్టూ ఇద్దరు స్త్రీలు తిరుగుతూ ఒకరు పాతివ్రత్యాన్ని, మరొకరు వ్యభిచారాన్ని పోషించే ఊకదంపుడు కథలను మద్రాసు ప్రొడ్యూసర్లు పోషిస్తున్న యుగంలో "పల్లెటూరు పిల్ల" కథలోనే ముందుగా క్రొత్తదనం చూపింది. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమిస్తారు. ఒకడు తన ప్రేయసి కోసం ఆదర్శయుతమైన త్యాగాన్ని ప్రదర్శిస్తాడు. దోపిడిగాండ్లలో పరివర్తన తెప్పించి అధికాహార ఉత్పత్తికి దోహదమిస్తుంది ఈ కథ. పశుబలాన్ని మచ్చిక చేసుకొని ప్రజోపయోగకరంగా మలచుకోవచ్చునని తెలుపుతుంది ఈ కథ. ప్రతి పాత్రకూ తగిన ప్రాముఖ్యతనిచ్చి కథకూ సన్నివేశానికీ మంచి బిగువును కల్పించాడు సుబ్బారావు. పల్లె వాతావరణమూ, వారి ఆచారాలు, సంప్రదాయాలు, మంచీ చెడూ చాలా చక్కగా చిత్రీకరించారు. మంచి సంభాషణలు అందించిన తాపీ ధర్మారావును ప్రశంసింపక తప్పదు. ఆదినారాయణరావు సంగీతం పల్లెటూరి వాతావరణానికీ, కథకూ, గమనానికీ, స్థాయికీ బాగా సరిపోయింది. ఎడిటింగ్ చిత్రం యొక్క ఆఖరులో కొంచెం కుంటుపడింది. ఆంజలీ దేవి నటన పాత్రోచితంగా, సహజంగా ఉంది. నాగేశ్వరరావు, రామారావు తమ తమ పాత్రలను సమర్ధవంతంగా నిర్వహించారు. చక్కని హాస్యంతో చిత్రానికి అడుగడుగునా ఇంటరెస్టు కలిగించిన సీతారాం, రామ్మూర్తులను ప్రత్యేకంగా పేర్కొనక తప్పదు. [1]


కథ మార్చు

విశేషాలు మార్చు

 • మహానటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన తొలి చిత్రం 'పల్లెటూరి పిల్ల'. ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతరకాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డ్‌ను 14 చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి నెలకొల్పారు. అలాగే హీరోగా ఎన్.టి.ఆర్. కెమేరా ముందుకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ ముందు మొదలయినప్పటికీ ఆయన సోలో హీరోగా నటించిన 'షావుకారు' చిత్రం మొదట విడుదలైంది. ఎల్.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్.కు మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి హీరోగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు బి.ఎ.సుబ్బారావు.
 • శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు ఆ స్టూడియో అధినేత మీర్జాపురం రాజా ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 'పల్లెటూరి పిల్ల' చిత్రాన్ని నిర్మించారు.అంతకుముందు ఏ దర్శకుడి దగ్గరా పనిచేసిన అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీశారు. అంజలీదేవి టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం విడుదలై ఏప్రిల్ 27, 2010న 60ఏళ్లు పూర్తయ్యాయి.
 • ఫిబ్రవరి 9, 1949న శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన 'పల్లెటూరి పిల్ల ' చిత్రానికి రిజక్ట్ షెరిటన్ రాసిన 'ఫిజారో' ఆంగ్ల నాటకం ఆధారం. ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి.ఆదినారాయణరావు తయారు చేశారు. సుబ్బారావు స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాట కూడా రాశారు.
 • ఈ చిత్రంలో వసంత్ పాత్రను మొదట ఆనాటి ప్రముఖ హీరో కె.రఘురామయ్య పోషించారు. అంజలీదేవి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అప్పుడు ఆ పాత్రను అక్కినేని పోషించారు. సుబ్బారావుతో సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా తక్కువ పారితోషికం తీసుకుని త్యాగపూరితమైన వసంత్ పాత్రను పోషించారు.
 • ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశంలో ఎన్.టి.ఆర్. కుడిచేయి విరిగింది. డూప్‌ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు చెప్పినా సహజత్వం ఉండదని రామారావు భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో ఎద్దు ఒక కుమ్ము కుమ్మి అవతలకి విసిరెయ్యడంతో ఆయన చెయ్యి విరిగింది.
 • ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి అప్పటికే పెద్ద హీరోయిన్. అయినా కొత్త హీరో పక్కన నటించడానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
 • ఈ చిత్రంలో విలన్ కంపన దొర పాత్రను తన స్నేహితుడు ఎస్.వి.రంగారావుతో వేయించాలని సుబ్బారావు అనుకున్నారు. అయితే ఆయన చెన్నై చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏ.వి.సుబ్బారావుతో వేయించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో తాత పాత్రను రంగారావు పోషించారు.
 • ఈ సినిమాలో ముఖ్యమైన హీరో రామారావు కనుక ఆయన పేరు మొదట వెయ్యమని అక్కినేని సూచించినా సీనియారిటినీ గౌరవిస్తూ టైటిల్స్‌లో ఎ.ఎన్.ఆర్. పేరే మొదట వేశారు సుబ్బారావు.
 • ఏప్రిల్ 27, 1950న విడుదలైన 'పల్లెటూరి పిల్ల' చిత్రం విజయం సాధించి హీరోగా ఎన్.టి.ఆర్. భవిష్యత్‌కు బంగారు బాట ఏర్పరచింది.

పాటలు మార్చు

 1. కళ్ళులేని కబోదిని కడుపుమంటతో మొర్రో అంటే కనబడలేదా రామా - టి.వి.రాజు
 2. చిన్నారి పాపాయి చిట్టి పాపాయి చిన్ని నవ్వుల ముద్దుగుమ్మా రావోయి - యు.సరోజిని, శ్రీదేవి
 3. ధీరకంపనా మహవీర కంకణా వీరులకంటే వేరు దైవములు లేరు - జిక్కి - రచన: ఆదినారాయణ రావు
 4. నా జబ్బసత్తువ చూసేవా చూచేవా దెబ్బలాటా - పిఠాపురం, టి. కనకం, శ్రీదేవి
 5. ప్రేమమయా చిత్రము నీ మాయా చాలా చిత్రము నీ మాయా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
 6. శాంతవంటి పిల్ల లేదోయి లే లేదోయి జగమంతా - ఘంటసాల - రచన: పి. ఆదినారాయణరావు
 7. ఉంటేనేమి లేకుంటేమి చేతగాని మొగుడు నీలాంటి మొగుడు - టి. కనకం
 8. ఓం ధూం ధాం కర్‌లె గటమహాటమే చాంద్ బింగంగా - నల్ల రామూర్తి, పిఠాపురం
 9. చిటపట చినుకుల దుప్పటి తడసెను తలుపు తీయవే - నల్ల రామూర్తి, పిఠాపురం
 10. ధన్యత్మా జోహార్ మహాత్మా జోహర్ - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
 11. పల్లెసీమలె అందమోయి ఆనందమోయి ఓయి పల్లె - శ్రీదేవి
 12. పోపొండి హై రాకండి పోపొండి హై రాకండి దూర - శ్రీదేవి, యు.సరోజిని, పిఠాపురం బృందం
 13. పారవే జోరుగా జోరుగా నీతోనే ఏతాము - పిఠాపురం, ఎం. ఎస్. రామారావు,శ్రీదేవి
 14. బలవంతమైన సరపము సలి సీమల సేత సిక్కే గదరా - నల్లరామూర్తి
 15. వద్దుర బాబోయి పెళ్ళి వద్దుర నాయనోయి - పిఠాపురం,నల్లరామూర్తి, కనకం
 16. రత్నాల తీవెలతోడ వజ్రాల కోవెల తోడ ముత్యాల - యు. సరోజిని, శ్రీదేవి

మూలాలు మార్చు