పొణకా కనకమ్మ

భారతీయ రాజకీయనేత
(పాణాకా కనకమ్మ నుండి దారిమార్పు చెందింది)

పొణకా కనకమ్మ (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక.{ఈమె జననం-1892, జూన్ 10 - మరణం 1963 సెప్టెంబరు 15}. ఈమె అమ్మమ్మ ఇంట నెల్లూరు జిల్లా మినగల్లులో 1892 జూన్ 10 న జన్మించింది. బాల్యంలో చదువుకోలేదు. నెల్లూరుకు చెందిన మరుపూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ . తనతో పాటు తన కుటుంబం మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో అక్తొబరు 18 న, విజయదశమిరోజున కస్తూరీదేవి బాలికా పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో ఎంతో కృషి చేసింది. రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపింది.

పొణకా కనకమ్మ
పొణకా కనకమ్మ

పొణకా కనకమ్మ చిత్రపటం



వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 10, 1892
మినగల్లు, ఆంధ్రప్రదేశ్
మరణం సెప్టెంబరు 15, 1963
నెల్లూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పొణకా సుబ్బరామి రెడ్డి
సంతానం ఒక కుమార్తె
నివాసం పొట్లపూడి, పల్లెపాడు
మతం హిందూ

బాల్యం, వివాహం

మార్చు

ఆమెకు 9 సంవత్సరాల వయసులో మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం అయింది. అత్తవారి ఊరు పోట్లపూడి. కనకమ్మ స్వయంకృషితో, తెలుగు, సంస్కృతం, హిందీ నేర్చుకుంది. 1907లో కనకమ్మ టైఫాయిడ్ జ్వరంతో నెల్లూరులో వైద్యం చేయించుకొంటున్న సమయంలో బిపిన్ చంద్రపాల్ నెల్లూరు వచ్చినపుడు {1907 ఏప్రిల్} ఈమె ఆతిధ్యం ఇచ్చింది. మరిది పట్టాభిరామారెడ్డి విద్యావంతుడు, గ్రంథాలయోద్యమంలో, ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో పనిచేసాడు. ఇద్దరు కలిసి 19013 మార్చి 18 న పోట్లపూడిలో "సుజనరంజని సమాజం" పేరుతొ ఒక సాంస్కృతిక సంస్థను, వివేకానంద గ్రంథాలయాన్ని నెలకొల్పారు. సుజనరంజని తరఫున పోట్లపూడిలో పాఠశాల, నాటక ప్రద్రర్శనలు, కవిపండితులను పిలిపించి సభలు ఏర్పాటుచేశారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పోట్లపూడిలో దాదాపు ఏడాది ఉన్నాడు. జాతీయోద్యమ స్ఫూర్తితో, నెల్లూరు రామానాయుడు సహకారంతో కనకమ్మ పోట్లపూడిలో ఆ ఊళ్ళో చేనేత మగ్గాలు పెట్టి చేనేతను ప్రోత్సహించింది. ఇంటింటా మగ్గాలు వచ్చాయి. ఆమె గాంధీజీ స్పృతితో జీవితాంతం ఖద్దరు చీరలు కట్టుకుంది. పోట్లపూడి సమీప గ్రామాలలో కలరా, ఇతర జ్వరాలు వ్యాపించినపుడు కనకమ్మ, ఆమె మనుషులు దళిత వాడలకు వెళ్లి మందులు, ఆహారం ఇచ్చి సేవచేసారు.

ఉద్యమ బాట

మార్చు

1915-16 సంవత్సరాల్లో కనకమ్మ, ఆమె యువబృందానికి విప్లవకారులతో సంబంధాలు ఏర్పడ్డాయి. కనకమ్మ వెన్నెలకంటి రాఘవయ్యను పూనా పంపి తిలక్ తో మాట్లాడించింది. పాండిచ్చేరి నుంచి కనకమ్మ ధన సహాయంతో కొన్ని రివాల్వర్లు కొని తెచ్చారు. ఆయుధాలను దాచడానికి, కాల్చడం రహస్యంగా నేర్చుకోడానికి కనకమ్మ పల్లిపాడులో "కొంజేటివారితోట" అనే 13 ఎకరాల తోటను 800 రుపాయలకు కొన్నిది. కొద్ది సమయంలోనే సాయుధ విప్లవోద్యమం అసాధ్యమని గ్రహించి దానికి కనకమ్మ బృందంవారు దూరమై, అనీ బీసెంట్ పట్ల ఆకర్షితులయ్యారు. 1919 గాంధీజీ మద్రాసు వచ్చినపుడు కనకమ్మ, మరికొందరు అనుచరులు, కనకమ్మ తల్లితో సహా అతనిని కలిశారు. అప్పటినుంచీ అందరూ జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు.

కనకమ్మ వితరణ, ఉద్యమానికి ఖర్చులు పెట్టడంవల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఆమె భర్త వేంకటగిరి జమీందారు వద్ద పిడూరు గ్రామంలో భూములు కొని వ్యవసాయం ఆరంభించాడు. ఒప్పందం ప్రకారం జమీందారు ఆ పొలాలకు నీటి సౌకర్యం కలిగించక పోవడం వల్ల వ్యవసాయం దెబ్బ తిన్నది. నమ్మినవారి దగా వల్ల కూడా కనకమ్మ కుటుంబం పొలాలు పరాధీనం అయ్యాయి. కనకమ్మ ఏకయిక కుమార్తె వెంకటసుబ్బమ్మను తన పెద్ద తమ్ముడు మరుపూరు పిచ్చిరెడ్డికి ఇచ్చి వివాహం చేసింది. కనకమ్మ అత్తింటివారి ఆస్తినే కాక, పుట్టింటి వారి ఆస్తిని కూడా వితరణ ఎరుగని ఖర్చులు, ఉద్యమాలకు ఖర్చులు పెట్టి అంతా నష్టపోయింది.

ఆశ్రమ స్థాపన

మార్చు

1921 ఏప్రిల్ 7వ తారీకు నాడు గాంధీజీ కనకమ్మ విప్లవ కార్యక్రమాలకోసం కొన్న పల్లిపాడు గ్రామంలోని 13 ఎకరాల స్థలంలో "పినాకిని సత్యాగ్రహాశ్రమం" ప్రారంభించారు. నూరేళ్ళ తరవాత కూడా ఆ ఆశ్రమం ఇప్పుడు చక్కగా పనిచేస్తోంది.

1923 కల్లా కనకమ్మ నెల్లూరులో స్థిరపడి జాతీయోద్యమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1923 అక్టోబరు 18, విజయదశమి రోజు కస్తూరిదేవి విద్యాలయాన్ని అద్దె ఇంటిలో నెలకొల్పింది. 1934 వరకు ఈ బాలికా విద్యాలయం పనిచేసింది. ఆమె జైలుకు వెళ్లిన తర్వాత స్కూల్ నిర్వహిచడం కష్టమై 1934 చివరలో మూతపడింది.

1921 డిసెంబరు 28-30 వ తారీకుల్లో అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు హాజరై, కాంగ్రెస్ కమిటికి ఎంపికై రెండు సంవత్సరాలు ఆ బాధ్యత నిర్వహించింది. 1922 మార్చి 10న నెల్లూరు జిల్లా మహిళా కాంగ్రెస్ నెలకొల్పి {జిల్లా స్త్రీల కాంగ్రెస్ సంఘం} ఆ సంస్థ ద్వారా జాతీయోద్యమంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేశబంధు చిత్తరంజనదాస్ , బాబు రాజేంద్రప్రసాద్ నెల్లూరు వచ్చినపుడు కనకమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి మాట్లాడారు.

జమీందారీ రైతు పత్రిక నిర్వహణ

మార్చు

వెంకటగిరి జమీందారు కనకమ్మ పొలాలు హస్తగతం చేసుకొన్న తర్వాత, కనకమ్మ "జమీందారీ రైతు" పేరుతొ పత్రిక నెలకొల్పి మూడేళ్లు కొనసాగించింది. జమీందారీ రైతుల పోరాటాన్ని ఆమె తన పత్రిక ద్వారా సమర్ధించింది. రాజాగారితో రాజీ కుదిరిన తర్వాత నెల్లూరు రామానాయుడు సంపాదకత్వంలో "జమీన్ రైతు" పేరుతొ ఆ పత్రిక కొనసాగింది.

సాహిత్యకృషి

మార్చు
  • జ్ఞాననేత్రం
  • ఆరాధన
  • నైవేద్యము-గీత
  • రమణగీత
  • శ్రీరమణ గురుస్తవం
  • ఆంధ్రస్త్రీలు
  • వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు
  • కనకపుష్యరాగం (పొణకా కనకమ్మ స్వీయచరిత్ర). సంపాదకులు:డా. కాళిదాసు పురుషోత్తం. రచనాకాలం 1959-60. ప్రచురణ 2011, ద్వితీయముద్రణ: పల్లవి ప్రచురణలు, విజయవాడ, 2021

వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.

బహుమతులు

మార్చు

1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణం స్వీకరించారు.

మూలాలు

మార్చు

జమీన్ రైతు 20-9-1963, కనకమ్మ మీద ప్రతేక సంచిక.

వెలుపలి లంకెలు

మార్చు