పిప్పలి
పిప్పలి పైపెరేసి వృక్ష కుటుంబం లోని పుష్పించే తీగ. దాని పండు కోసం ఈ తీగను సాగు చేస్తారు. ఈ పండును ఎండబెట్టి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. దీన్ని భారతీయ పొడవాటి మిరియాలు (పైపర్ లాంగమ్) అనీ తిప్పలి అనీ పిలుస్తారు. దీని రుచి దాని దగ్గరి బంధువు నల్ల మిరియాల (పైపర్ నిగ్రం) రుచిని పోలి ఉంటుంది. కానీ దాని కంటే కారంగా ఉంటాయి.
పిప్పలి | |
---|---|
పిప్పలి ఆకులు, పండ్లు | |
Scientific classification | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | పుష్పించే మొక్కలు |
Clade: | Magnoliids |
Order: | Piperales |
Family: | Piperaceae |
Genus: | Piper |
Species: | P. longum
|
Binomial name | |
Piper longum |
పిప్పలి పండు లోపల చాలా చిన్నచిన్న గింజలుంటాయి. ఇవి ఒక్కొక్కటి గసగసాల పరిమాణంలో ఉంటుంది. నల్ల మిరియాలలో ఉన్నట్లే, ఇందులో కూడా ఆల్కలాయిడ్ పైపెరిన్ ఉంటుంది. దీని వలన ఈ పండుకు ఘాటుదనం చేకూరుతుంది. పిప్పలి లోని మరొక జాతి పైపర్ రెట్రోఫ్రాక్టమ్, జావా, ఇండోనేషియాలకు చెందినది. ఈ మొక్క పండ్లను మిరపకాయలను పోలి ఉండడం చేత అవే అని భావిస్తారు. ఇవి క్యాప్సికమ్ జాతికి చెందినవి.
చరిత్ర
మార్చుపిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.
నల్ల మిరియాల పురాతన చరిత్ర తరచుగా పిప్పలితో ముడిపడి ఉంటుంది. ఈ త్రెంటి మధ్య తికమక కూడా ఉండేది. థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్రంపై చేసిన తొలి కృషిలో ఈ రెండింటినీ వేరు చేశాడు. రోమన్లకు రెండింటి గురించీ తెలుసు. వాళ్ళు రెంటినీ పైపర్ అనే పిలిచేవారు. ఎండిన నల్ల మిరియాలు, పిప్పలి ఒకే మొక్క నుండి వచ్చాయని ప్లినీ భావించాడు.
గుండ్రని, నల్ల మిరియాలు పన్నెండవ శతాబ్దం నుండి ఐరోపాలో పొడవైన మిరియాల (పిప్పలి)తో పోటీపడటం ప్రారంభించాయి. పద్నాలుగో శతాబ్ది నాటికి పిప్పలిని తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించింది. నల్ల మిరియాల చౌకైన, మరింత ఆధారపడదగిన వనరుల కోసం చేసిన అన్వేషణ, ఆవిష్కరణ యుగానికి ఆజ్యం పోసింది.
అమెరికన్ ఖండాలను, మిరపకాయలనూ (స్పానిషులో పిమియంటో అంటారు) కనుగొన్న తర్వాత, పిప్పలికి ప్రజాదరణ మసకబారింది. [1] కొన్ని మిరపకాయలు ఎండినప్పుడు, పొడవాటి మిరియాల (పిప్పలి) ఆకారాన్నీ, రుచినీ పోలి ఉంటాయి. ఐరోపాకు మరింత అనుకూలమైన ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. నేడు, సాధారణ వాణిజ్యంలో పిప్పలి చాలా అరుదు.
వ్యుత్పత్తి
మార్చుపెప్పర్ అనే పదం పిప్పలి అనే పదం నుండి ఉద్భవించింది. ఈ మొక్క భారతదేశానికి చెందినది. బెల్ పెప్పర్‌లో పెప్పర్ అనే పదం, పూర్తిగా భిన్నమైన మొక్కలను సూచిస్తుంది (క్యాప్సికమ్ కుటుంబంలో). అయితే ఆ పేరు వ్యుత్పత్తి కూడా ఇదే. ఆ వాడుక 16వ శతాబ్దంలో మొదలైంది. [2]
వాడుక
మార్చుపిప్పలిని ఇప్పటికీ భారతీయ, నేపాలీ కూరగాయల ఊరగాయలు, కొన్ని ఉత్తర ఆఫ్రికా మసాలా మిశ్రమాలు, ఇండోనేషియా, మలేషియాల్లో వాడతారు. ఇది పిప్పలి అనే పేరుతో భారతీయ కిరాణా దుకాణాల్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. పాకిస్తాన్ లోను, లక్నో లోనూ ప్రజలు తినే నిహారి వంటకంలో వాడే ప్రధానమైన మసాలా దినుసు పిప్పలి. మధ్యయుగ కాలంలో ఐరోపా వంటకాల్లో "స్ట్రాంగ్ పౌడర్" వంటి మసాలా మిశ్రమాలలో పిప్పలిని వాడినప్పటికీ, ప్రస్తుత కాలంలో దీన్ని చాలా అరుదుగా వాడతారు.
మూలాలు
మార్చు- ↑ (June 1980). "Connaissez-vous le poivre long?".
- ↑ "Pepper entry in Online Etymology Dictionary". Douglas Harper. February 18, 2016.
/