పెంపుడు కూతురు
పెంపుడు కూతురు 1963, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా. బి. ఆర్. పంతులు దర్శకత్వంలో నందమూరి తారకరామారావు, దేవిక, హరనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం టి. జి లింగప్ప అందించారు.
పెంపుడు కూతురు (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఆర్.పంతులు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక, హరనాధ్ |
సంగీతం | టి.జి.లింగప్ప |
నిర్మాణ సంస్థ | పద్మిని పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- కథ : ఇరా షణ్ముగం
- మాటలు, స్క్రీన్‌ప్లే : డి.వి.నరసరాజు
- నృత్యం: పి.యస్. గోపాలకృష్ణ
- కూర్పు : డి.దేవరాజ్
- ఛాయాగ్రహణం: వి.రామ్మూర్తి
- సంగీతం: టి.జి.లింగప్ప
నటీనటులు
మార్చు- నందమూరి తారకరామారావు
- దేవిక
- రమణారెడ్డి
- రేలంగి
- హరనాథ్
- షావుకారు జానకి
- వల్లూరి బాలకృష్ణ
- బొడ్డపాటి
చిత్రకథ
మార్చుతిరుపతి (రమణారెడ్డి) సీతమ్మ దంపతుల కుమారుడు రఘు (యన్.టి.ఆర్) వారి పెంపుడు కూతురు ఉమ (దేవిక), గాయనిగా, స్కూల్ టీచర్‌గా మంచి పేరుసంపాదించుకుంటుంది. దశావతారం (రేలంగి) కుమారుడు వాసు (హరనాథ్) కుమార్తె మంజుల (షావుకారు జానకి) భార్య రమాదేవి. వాసు, ఉమ ప్రేమించుకుంటారు. రఘు, తండ్రితో కలిసి పేకాట ఆడడం, బలాదూర్‌గా తిరగడం, కుస్తీపోటీల్లో పాల్గొనటం చేస్తుంటాడు. దశావతారం ధనవంతుడైనా ఉమ గుణం నచ్చి ఆమెతో తన కొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. రఘు పాల్గొన్న కుస్తీపోటీలకు జడ్జిగా వచ్చిన మంజులను రఘు అవమానిస్తాడు. రఘు సోదరి ఉమ అని తెలుసుకున్న మంజుల, ఆమె తల్లి ఉమతో వాసు పెళ్ళికి అంగీకరించరు. ఇంటినుంచి వెళ్ళిపోవాలనుకున్న ఉమకు తల్లి ఆమె తమ పెంపుడు కూతురని నిజం తెలియచేసి, అన్నను తండ్రిని దారిలోపెట్టమని బాధ్యత అప్పగించి మరణిస్తుంది. మంజుల నాట్యప్రదర్శన చేస్తూ ప్రమాదంలో చూపుకోల్పోతుంది. తండ్రి, అన్నలవల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఉమ, జైలుకి వెళ్ళిన అన్నకోసం, ఓ ముసలివానితో పెళ్ళికి సిద్ధపడుతుంది. రఘులో మార్పు వచ్చి జైలునుంచి రాగానే ఆ పెళ్ళి ఆపాలనుకుంటాడు. కాని ఉమకు, వాసుతో పెళ్ళి జరిగిందని తెలుసుకుని, చూపులేని మంజులను, తాను మూగవాడినని చెప్పి పెళ్ళి చేసుకుంటాడు. మంజులకు నిజం తెలిసి భర్తకు దూరంగా బెంగుళూరు వెళ్ళిపోతుంది. వాసు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళతాడు. ఉమ అత్తగారు ఆమెను ఇంటినుంచి వెడలగొడుతుంది. ఒక బిడ్డను కని ఆ ఊరికి దూరంగా బ్రతుకుతుంటుంది ఉమ. రఘు భార్య మంజుల దగ్గరకు బెంగుళూరు మారువేషంలో వెళ్ళి ఆమె మనసుమారుస్తాడు. తిరిగి తమ ఊరు వచ్చేటప్పుడు రైల్వేట్రాక్ మీద ప్రమాదంలో వున్న ఉమ బిడ్డ (మేనల్లుడి) ని కాపాడి, అందరిచేత మెప్పుపొందుతాడు. వాసు విదేశాలనుంచి తిరిగి రావటంతో కథ సుఖాంతం అవుతుంది[1].
పాటలు
మార్చు- ఏవి వెలుతురు లేవి నను బ్రతుకుబాటలో - ఘంటసాల- సినారె
- నాకు కనులు లేవు నీవు పలుకలేవు బ్రతుకులోని తీయదనం పంచుకోలేవు - పి.సుశీల - సినారె
- నీ జాడ కననైతిరా సామి - పి.లీల - సినారె
- చెప్పిన మాటేననుకో, ఇది చెప్పిన మాటే ననుకో - ఘంటసాల బృందం- కొసరాజు
- కన్నుల విందే అందాలు కోరికలూరే డెందాలు - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి- అనిసెట్టి
- జీవనరాగం ఈ అనురాగం మధురానందమయితే - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్- అనిసెట్టి
మూలాలు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (14 June 2013). "ఫ్లాష్ బ్యాక్ @ 50 పెంపుడు కూతురు". ఆంధ్రభూమి దినపత్రిక.