పైడిమర్రి వెంకటసుబ్బారావు

తెలుగు రచయిత
(పైడిమర్రి సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)

పైడిమర్రి వెంకటసుబ్బారావు (1916 జూన్ 10 - 1988 ఆగష్టు 13) నల్గొండ జిల్లా, అన్నెపర్తికి చెందిన రచయిత, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత.[1]

పైడిమర్రి సుబ్బారావు
Paidi-marri-subbarao.png
పైడిమర్రి సుబ్బారావు
జననం1916 జూన్ 10
నల్గొండ జిల్లా , అన్నెపర్తి
మరణం1988 ఆగష్టు 13
ఇతర పేర్లుపైడిమర్రి సుబ్బారావు
వృత్తివిశాఖపట్నం డిటివొ
ప్రసిద్ధిరచయిత,
నేడు విద్యార్థులు చేస్తున్న "ప్రతిజ్ఞ" రచయిత.
మతంహిందూ
భార్య / భర్తవెంకట రత్నమ్మ
తండ్రిరామయ్య
తల్లిరాంబాయమ్మ,

జననం - విద్యాభ్యాసంసవరించు

ఈయన 1916, జూన్ 10న పైడిమర్రి రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు నల్లగొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తిలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అన్నెపర్తి, నల్లగొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులు.

ఉద్యోగంసవరించు

హైదరాబాద్ రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వోద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్లగొండ జిల్లాల్లో పనిచేశారు.

ప్రతిజ్ఞ రచనసవరించు

ఆయన 1962 లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు.[2] భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాధంతో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతాబాగానే ఉంది కానీ, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా..?

అది కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తేన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు.[3]

పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమలులోకి వచ్చింది.

ఈ భారత జాతీయ ప్రతిజ్ఞ గురించి వికీపీడియా మరో పేజీలో వివరంగా వున్నా, ఇక్కడకూడ తెలుగు పాఠాంతరాలను ఇస్తే బాగుంటుందని భావించి, ఈ కింద ఇస్తున్నాము:

ప్రస్తుత రూపంసవరించు

భారతదేశం నా మాతృభూమి.

భారతీయులందరూ నా సహోదరులు.

నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.

సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.

దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.

నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను.

ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.

నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

పాత రూపంసవరించు

భారతదేశము నా మాతృభూమి.

భారతీయులందరు నా సహోదరులు.

నేను నా దేశమును ప్రేమించుచున్నాను.

సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.

దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.

నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.

ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.

నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

ప్రతిజ్ఞ ప్రస్థానంసవరించు

పైడిమర్రి ప్రతిజ్ఞ రచించి 53 సంవత్సరాలు పూర్తయ్యింది. భారత ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆమోదించి 50 సంవత్సరాలు పూర్తయ్యింది.2011లో ప్రముఖ సంపాదకుడు ఎలికట్టె శంకర్రావు నల్గొండ కవుల కథలు రాస్తున్న సందర్భంగా పైడిమర్రి ప్రస్తావన వచ్చింది. ఆయన పైడిమర్రి కుమారుడు పి.వి సుబ్రమణ్యాన్ని కలవగా ప్రతిజ్ఞను తన తండ్రి గారు రచించారని శంకర్రావుకు తెలిపారు. ఒక మహనీయుడి మూలాలను ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయంతో ఎలికట్టె కొంతమంది తెలంగాణా సాహిత్య మిత్రులతో కలిసి "ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి" పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రింపచేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, తెన్నేటి ఫౌండేషన్ ప్రయత్నించాయి. జనవిఙ్ఞాన వేదిక (గంపలగుడెం శాఖ, కృష్ణాజిల్లా) ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళింది. మందడపు రాంప్రదీప్, పోతురాజు కృష్ణయ్య ల ఆధ్వర్యంలో తిరువూరు నియోజిక వర్గ పరిధిలో చదువుతున్న 25 వేల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి సి.డి రూపంలో పొందుపరిచి విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది. జనవిఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కర పత్రాలు ముద్రించి పంపిణీ చేయడం జరిగింది. విజయవాడలోని అన్నపూర్ణా దేవి ఉన్నత పాఠశాల ప్రతిజ్ఞకు ప్రాముఖ్యతనివ్వడానికి కృషి సల్పింది. ఎమ్.రాంప్రదీప్ (ఆర్లపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు) పలు పాఠశాలలను సందర్శించి వేలాది మంది విద్యార్థులను కలుసుకొని పైడిమర్రి జీవిత చరిత్రను వివరించారు.ఎట్టకేలకు జనవిఙ్ఞాన వేదిక, పలువురు ఇతర అభ్యుదయవాదులు చేసిన కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ముద్రించిన పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చడం జరిగింది. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది. ప్రజలలో సోదర భావాన్ని పెంచుతుంది.పైడిమర్రి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జనవిఙ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుంది. పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ఎం. రాంప్రదీప్ తెలుగులో "భారతదేశం నా మాతృభూమి" పేరుతో వ్రాయగా 2016 జనవరిలో విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రముఖ విద్యావేత్త కే.ఎస్ లక్ష్మణరావు, మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గార్ల చేతుల మీదగా వీ.జీ.ఎస్ బుక్ లింక్స్ వారు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆంగ్లంలో "ది ఫర్గాటెన్ పేట్రియాట్" పేరుతో రాంప్రదీప్ అనువదించగా, హిందీ ఉపాధ్యాయులు రేపాక రఘునందన్ పైడిమర్రి జీవిత చరిత్రను హిందీలోకి అనువదించారు. ప్రతిఙ వివరాల కొరకు రాంప్రదీప్ కేంద్ర ప్రభుత్వాన్ని సమాహార హక్కు చట్టం ద్వారా సంప్రదించగా ప్రతిఙ రచించింది పైడిమర్రేనని కేంద్రం తెలిపింది. 2016లో తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లోని రవింద్ర భారతిలో పైడిమర్రి సంస్మరణ సభను నిర్వహించింది. భారతీయులంతా ఒక్కటేనని చాటిచెప్పే ప్రతిఙకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2010 లో ఒక చురుకైన విద్యార్థి ఆంగ్ల ఉపాధ్యాయుడు రాంప్రదీప్ ను ప్రతిఙను ఎవరు రాశారు అని ప్రశ్నించడం దగ్గర నుంచి ప్రతిఙ ఉద్యమం ఊపందుకుంది. 

రచనలుసవరించు

పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. నోట్‌పుస్తకాలపై చాలా రచనలు చేశారు. అందులో అరబ్బీ అనువాదాలు కూడా ఉన్నాయి. జమిందారీ, భూస్వామ్య వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. ఎక్కడ సాహిత్య కార్యక్షికమాలున్నా వెళ్లేవాడు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనంలో పాల్గొనేవారు.

ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. సింగపురీ నృకేసరీ శతకం, బాలరామాయణం, వెంక స్తుతి మొదలైన రచనలు సుబ్బారావు చేశారు. అనేక అనువాద రచనలు కూడా చేశారు. గోలకొండ, సుజాత, ఆంధ్రపవూతిక, భారతి, నవజీవన్, ఆనందవాణి పత్రికలలో వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి పద్యాలు గోలకొండ కవుల సంచికలోను, వీరి కథలు ఉషస్సు కథా సంకలనం, తెలంగాణ తొలితరం కథలులో ‘నౌకరి’ కథ వచ్చింది.

1945లోనే ఉషస్సు కథల సంపుటిని వెలువరించారు. 1945-46 లలో నల్లగొండలో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలలో ప్రముఖ పాత్ర వహించారు. వీరి పదవీ విరమణ తర్వాత సర్వేలు గురుకుల పాఠశాలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు. 1977 నుండి 1988 వరకు నల్లగొండ గాంధీ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలందించారు.

పైడిమర్రి రచనలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆయన లైబ్రరీని తన కుమారులు నల్లగొండలోని గీత విజ్ఞాన్ ఆంధ్ర కళాశాలకు అందించారు. ప్రస్తుతమది మూతపడింది. ఆ పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం జనవిఙాన వేదిక ఆధ్వర్యంలో పైడిమర్రి శత జయంతి ఉత్సవాలు పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. 

కుటుంబంసవరించు

ఆయన సతీమణి వెంకట రత్నమ్మ.

మరణంసవరించు

ఉద్యోగ విరమణ అనంతరం 1988 ఆగష్టు 13 న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

పుస్తకాలలో పేరు ముద్రణసవరించు

పాఠ్య పుస్తకాలలో ప్రచురిస్తున్న ప్రతిజ్ఞకు పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరును ముద్రించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక 2014 నవంబరు 27న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర గవర్నర్‌కు తెలంగాణ సీఎం కెసీఆర్ కు విజ్ఞప్తి చేయగా, 2015-16 విద్యాసంవత్సరం నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అన్ని భాషల్లో అన్ని ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో జాతీయ ప్రతిజ్ఞతో పాటు రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 5వ తరగతి తెలుగు పుస్తకం అట్ట వెనుక భాగం లోపలి పేజీలో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ముద్రించి విశేష ప్రాచుర్యం కల్పించి గౌరవించింది.[4]

సన్మానంసవరించు

వీరు వ్రాసిన ప్రతిఙ అన్ని భారతీయ భాషలలోనూ ప్రచురితమైననూ, వీరి పేరు ఎక్కడా ప్రచురించలేదు. ఈ విషయం గురించి, విజయవాడలోని అన్నపూర్ణ నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థుల, నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు ఎం.శివప్రసాద్ తదితరులు చేసిన విఙప్తి ఫలితంగా కూడా  రచయిత పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య పుస్తకాలలో  ప్రచురించారు. రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్యపుస్తకాలలోనూ వీరి పేరును ముద్రించిన సందర్భంగా, 2016, జనవరి-8వ తేదీనాడు, విజయవాడలోని కొత్తపేట అన్నపూర్ణాదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో, పీ.డబ్ల్యూ గ్రౌండ్ లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ రామకృష్ణ, శ్రీ బుడ్డా వెంకన్నల సమక్షంలో, శ్రీ పైడిమర్రి కుమారుడు శ్రీ వేంకటసుబ్రహ్మణ్యం, శేషుకుమారి, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు శ్రీ పోతావఝ్ఝుల వేంకటేశ్వరశర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. జాతీయస్థాయిలో గూడా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలోనూ ఈ ప్రతిఙ రచయిత పేరును ప్రచురింపజేటట్లు ప్రయత్నం చేసెదమని ఈ సందర్భంగా ఈ శాసనమండలి సభ్యులు ఇద్దరూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఆర్లపాడు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ మందడపు రాంప్రదీప్, శ్రీ పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించారు.

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (13 August 2017). "ప్రాతఃస్మరణీయుడు పైడిమర్రి". www.ntnews.com. Archived from the original on 17 ఆగస్టు 2019. Retrieved 17 August 2019. CS1 maint: discouraged parameter (link)
  2. ప్రజాశక్తి, ఎడిటోరియల్ (12 August 2019). "'ప్రతిజ్ఞ' ని నిలబెడదాం". www.prajasakti.com. యం.రాంప్రదీప్‌. Archived from the original on 17 ఆగస్టు 2019. Retrieved 17 August 2019. CS1 maint: discouraged parameter (link)
  3. సాక్షి ఆదివారం సంచిక ఆగస్టు 10, 2014 11వ పేజీ
  4. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (13 August 2016). "ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి". www.ntnews.com. జె.విశ్వ. Archived from the original on 17 ఆగస్టు 2019. Retrieved 17 August 2019. CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లింకులుసవరించు

  1. ఈనాడు అమరావతి; 2016, జనవరి-9; 2వపేజీ.