అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసందుకు గాను ఏర్పాటయిన సంస్థ ప్రపంచబ్యాంకు. 1945 డిసెంబర్ 27 న ప్రపంచబ్యాంకు ఏర్పాటై, 1946 జూన్ 25 న కార్యకలాపాలు మొదలు పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికై 1947 మే 9ఫ్రాన్సుకు మంజూరు చేసిన 250 మిలియను డాలర్లు బ్యాంకు అందించిన మొదటి ఋణం.

వాస్తవానికి ప్రపంచ బ్యాంకు ఐదు అంతర్జాతీయ సంస్థల కూర్పు. ఆ ఐదు సంస్థలు ఇవి:

  • ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవెలప్‌మెంట్ (IBRD)
  • ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC)
  • ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ అసోసియేషన్ (IDA)
  • మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ అసోసియేషన్ (MIGA)
  • ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ (ICSID)

ప్రపంచబ్యాంకు ప్రధానంగా మానవాభివృద్ధి (విద్య, ఆరోగ్యం మొదలైనవి), వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగం వంటి రంగాలపై దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. IBRD, IDA లు సభ్య దేశాలకు తక్కువ రేట్లకు ఋణాలు ఇస్తాయి. నిరుపేద దేశాలకు గ్రాంట్లను మంజూరు చేస్తాయి. ప్రాజెక్టులకిచ్చే ఋణాలు, గ్రాంటులు సదరు రంగాల్లో లేదా ఆర్థిక వ్యవస్థలోని విధానాల్లో చెయ్యవలసిన మార్పులతో లింకు పెట్టడం జర్గుతూ ఉంటుంది.

IFC ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెడుతుంది. MIGA ఇన్స్యూరెన్సు సేవలు అందజేస్తుంది.