ఫిజీలో హిందూమతం

ఫిజీలోని హిందూమతాన్ని ప్రధానంగా ఇండో-ఫిజియన్లు ఆచరిస్తారు. వీరు, బ్రిటిష్ వారు వలస చెరకు తోటల కోసం చౌక కార్మికులుగా భారతదేశం నుండి ఫిజీకి తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. హిందువులు 1879 లో ఫిజీకి చేరుకోవడం ప్రారంభించారు. 1920 లో బానిసత్వం లాంటి ఒప్పంద విధానాన్ని బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసేవరకు ఇది కొనసాగింది. బ్రిటన్ ఫిజీ ప్రజల్లో భారత మూలాలున్నవారిని "ఇండో-ఫిజియన్లు"గా గుర్తిస్తుంది. హిందువులు ఫిజీ జనాభాలో 27.9% ఉన్నారు.[1]

నాడి లోని శ్రీ శివ సుబ్రమణ్య దేవాలయం

చరిత్ర

మార్చు

ఫిజీ 1874 లో బ్రిటిషు వలస సామ్రాజ్యంలో ఒక భాగమైంది. కొన్ని సంవత్సరాల తరువాత, 1879లో మొదటిసారి, బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటీష్ వలస అధికారుల యాజమాన్యంలోని ఫిజీ చెరకు తోటలలో పని చేయడానికి ఒప్పంద కార్మికులుగా భారతీయులను కూలీ ఓడలలో తీసుకువచ్చింది.[2] 1919 నాటికి, దాదాపు 60,000 మంది భారతీయులను ఫిజీకి తీసుకువచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం తమ ఉద్యోగ ప్రకటనలు, వర్క్ కాంట్రాక్టులలో, భారతీయులకు తిరిగి వెళ్లే హక్కు లేదా అక్కడే ఉండేందుకు హక్కు, భూమిని సొంతం చేసుకునే హక్కు, 5 సంవత్సరాల ఒప్పంద కాలం ముగిసిన తర్వాత ఫిజీలో స్వేచ్ఛగా జీవించడం వంటివి వాగ్దానం చేసింది. ఈ ఒప్పందాలను గిర్మిట్ అని పిలుస్తారు (అగ్రిమెంట్ అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది).[3]

దాదాపు ఒప్పంద కార్మికులుగా ఫిజీకి వచ్చిన భారతీయ సంతతి ప్రజల్లో 85% మంది హిందువులు (ఇతరులు భారతీయ ముస్లింలు, భారతీయ క్రైస్తవులు, భారతీయ సిక్కులు). ఒప్పంద కార్మికులు పేదలు, భారతదేశంలోని బ్రిటిష్ వలస పాలనలో కరువు, పేదరికం బారి నుండి తప్పించుకున్నవారు. భారతదేశం, చైనా, ఆగ్నేయాసియా దేశాల నుండి పసిఫిక్‌ దీవులు ఆఫ్రికా, కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా దేశాల లోని ప్లాంటేషన్‌లు, మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన చౌక కార్మికులుగా ఫిజీకి తీసుకువచ్చినవారే.[4] వలస వచ్చిన వారిలో నాల్గవ వంతు మంది దక్షిణ భారతదేశం నుండి - ప్రధానంగా తమిళనాడు నుండి - వచ్చారు. మిగిలిన 75% మంది ఉత్తరాది రాష్ట్రాల నుండి - ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ నుండి - వచ్చారు. బీహార్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ ల నుండి కూడా వచ్చారు. ప్రతి సమూహమూ తమతమ హిందూమత పద్ధతులను తీసుకువచ్చింది.[5]

ఫిజీలోని అనేక మంది హిందూ కార్మికులు తమ ఒప్పంద కార్మిక ఒప్పందం ముగిసిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి మొగ్గుచూపారు. 1940 నాటికి 40% మంది తిరిగి వచ్చినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ప్రారంభ సంవత్సరాల్లో వెనక్కి వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు.[6] 1920లో, ప్రపంచవ్యాప్తంగా బ్రిటీష్ కాలనీలలో ఒప్పంద వ్యవస్థకు వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలో అహింసాయుత పౌర నిరసనల తర్వాత, బ్రిటన్ ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో ఫిజీ తోటలలోకి కొత్త భారతీయ కార్మికుల ప్రవాహం ఆగిపోయింది. అయితే అప్పటికే పనిచేస్తున్న భారతీయులు తమ కాంట్రాక్టు ముగిసిన తరువాత ఫిజీ తోటలను విడిచి వెనక్కి వెళ్లడం కొనసాగించారు. అనుభవమున్న భారతీయ కార్మికుల నిష్క్రమణతో బ్రిటిష్ తోటలకు తీవ్రమైన కార్మికుల కొరత తలెత్తింది.[7] 1929లో, బ్రిటిషు ప్రభుత్వం ఇండో-ఫిజియన్ హిందువులకు ఎన్నికల హక్కును, కొన్ని పౌర హక్కులనూ మంజూరు చేసింది. ఫిజియన్ చక్కెర తోటల నుండి ఎగుమతులు, లాభాలను స్థిరీకరించడానికి, భారతీయ కార్మికులు వెనక్కి వెళ్ళిపోకుండా నిరోధించడానికి వీటిని మంజూరు చేసారు. కానీ ఆ ఎన్నికల హక్కులు చాలా పరిమితమైనవి. దామాషా ప్రకారం కాకుండా జాతి కోటా మీద ఆధారితమైనవి. ప్రభుత్వం దక్షిణాఫ్రికా మాదిరిగానే ఇండో-ఫిజియన్‌లను వేరు చేసి చూసింది.[3][7] ఈ వ్యవస్థను హిందువులు ప్రతిఘటించారు. శాంతియుత నిరసనలో భాగంగా హిందువులు, విభజించబడిన మండలిని అంగీకరించడానికి నిరాకరించారు. అయితే, కొన్ని సంవత్సరాలలో, హిందూ సమాజం మెజారిటీ సనాతన ధర్మ సమూహం, మైనారిటీ ఆర్య సమాజ్ సమూహాలుగా చీలిపోయింది. ఈ పరిస్థితి వలన మరిన్ని ఇండో-ఫిజియన్ రాజకీయ హక్కులను పొందడంలో ఆలస్యమైంది.[3] గాంధీ సహోద్యోగి అయిన ఎ.డి. పటేల్ ఫిజీలో స్వాతంత్ర్య దీక్షకు నాయకత్వం వహించాడు. ఫిజియన్లందరికీ పౌర హక్కులు కావాలని డిమాండ్ చేశాడు.[8] అయితే, 1970లో బ్రిటిష్ సామ్రాజ్యం, ఫిజీకి స్వాతంత్ర్యం మంజూరు చేసినపుడు జారీ చేసిన మొదటి రాజ్యాంగంలో హిందువుల పట్ల (ఇతర ఇండో-ఫిజియన్లకూ) రాజకీయ వివక్షను, అల్ప మానవ హక్కులనూ అలాగే ఉంచారు.[2][9]

1976 ఫిజీ జనాభా లెక్కల ప్రకారం, 2,95,000 మంది (ఫిజీ జనాభాలో 50 శాతం) ఇండో-ఫిజియన్ మూలాలకు చెందినవారు. వీరిలో 80% మంది హిందువులు. అంటే చెప్పాలంటే, ఫిజీ జనాభాలో 40 శాతం మంది హిందువులు. 1980ల నుండి నిరంతర హింస, హిందువుల గృహాలను తగులబెట్టడం, దేవాలయాలను కాల్చడం, అత్యాచారం చేయడం వంటివి జరగడంతో ఫిజీ హిందువులు, ఇతర ఇండో-ఫిజియన్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, భారతదేశాలకు వలస వెళ్ళారు. వారిలో దాదాపు 50,000 మంది 1987 తిరుగుబాట్ల తర్వాత 1987 - 1992 మధ్య వలస వెళ్లారు. ఫిజీలో హిందువుల జనాభా శాతం పరంగా అప్పటి నుండి క్షీణించింది.[5][10]

జనాభా వివరాలు

మార్చు
సంవత్సరం [11][12] శాతం తగ్గించు
1976 45% -19.8%
1996 33.7% -11.3%
2007 27.9% -5.8%

1976 ఫిజీ జనాభా లెక్కల ప్రకారం, దాని జనాభాలో 45% మంది హిందువులు.[13] 1980ల చివరి నుండి 2000ల ప్రారంభం వరకు, ఫిజీలో అనేక తిరుగుబాట్లు, మత కల్లోలూ జరిగాయి. హిందువులు హింసను ఎదుర్కొన్నారు. ఫిజీలోని చాలా మంది హిందువులు ఇతర దేశాలకు వలస వెళ్లారు.[5]

1996 జనాభా లెక్కల ప్రకారం 2,61,097 మంది హిందువులు (మొత్తం జనాభాలో 33.7%) ఉన్నారు. అయితే, 2007 జనాభా లెక్కల ప్రకారం ఇది 2,33,393 (27.9%) గా నమోదైంది, 5.8% తగ్గింది.[14] ఫిజీలోని హిందూ సమాజం కాలక్రమేణా అనేక దేవాలయాలు, పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలను నిర్మించింది. దీపావళిని వారి ప్రాథమిక పండుగగా జరుపుకుంటారు.[15] 1996 జనాభా లెక్కల ప్రకారం ఫిజీలో ఎక్కువ మంది హిందువులు ఇండో-ఫిజియన్లు. 864 మంది స్థానిక ఫిజియన్లు మాత్రమే హిందూమతాన్ని ఆచరిస్తున్నారు.[11]

ఫిజీలో హిందూ జనాభా ఏకరీతిగా విస్తరించి లేదు. నాడి, నౌసోరి ప్రాంతాల్లో, కొన్ని గ్రామాలు, పట్టణాలలో హిందువులు మెజారిటీగా ఉన్నారు.

మతం దేశీయ ఫిజియన్ ఇండో-ఫిజియన్ ఇతరులు మొత్తం
393,575 % 338,818 % 42,684 % 775,077 %
సనాతనీ 551 0.1 1,93,061 57.0 315 0.7 193,928 25.0
ఆర్య సమాజం 44 0.0 9,494 2.8 27 0.1 9,564 1.2
కబీర్ పంతి 43 0.0 73 0.0 2 0.0 120 0.0
సాయిబాబా 7 0.0 70 0.0 1 0.0 60 0.0
ఇతర హిందువులు 219 0.1 57,096 16.9 113 0.3 57,430 7.4
హిందువులందరూ 864 0.2 259,775 76.7 458 1.1 261,097 33.7

సమాజం

మార్చు

ఫిజియన్ హిందువుల సామాజిక నిర్మాణంలో కులం లేదు.[9] పండితులు [9][16][17] ఫిజియన్ హిందువులలో కుల వ్యవస్థ ఏర్పడకపోవడం లేదా పాటించకపోవడం ఫిజియన్ తోటలలో పని స్వభావం కారణమై ఉండవచ్చునని సిద్ధాంతీకరించారు. ఇక్కడ ప్రజల వృత్తి వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. వారు కూలీ ఓడలలో వచ్చినప్పటి నుండి పరిమితమైన జనాభా కారణంగా వారంతా కలిసే జీవించారు. మారిషస్, నాటల్ (దక్షిణాఫ్రికా), కరేబియన్‌లోని ఇతర ప్రధాన హిందూ ఒప్పంద కార్మిక స్థావరాల మాదిరిగానే, ప్లాంటేషన్ స్థావరాల ప్రారంభ రోజుల నుండి ఫిజీలోని హిందువులలో విస్తృతంగా ఇతర కులాలతో లైంగిక సంబంధాలుండేవి.[18][19][20]

దక్షిణాఫ్రికా మాదిరిగానే, బ్రిటిషు వలస అధికారులు ఫిజీలో కూడా ప్రజలను జాతి వారీగా వేరు చేశారు. ఫిజీలోని ప్లాంటేషన్ సెటిల్‌మెంట్‌లలో ఇండో-ఫిజియన్ హిందువులను శ్రామిక తరగతిగా పరిగణించడం విధానంగా ఉండేది. వారు యూరోపియన్ సెటిలర్‌లకు సమీపంలో కూడా నివసించడానికి అనుమతించలేదు. స్థానిక ఫిజియన్ ప్రజలతో కలవనీయలేదు.[21][22] ఈ విభజన వలన సాంస్కృతికంగా పరస్పర సంపర్కం లేకుండా పోయింది. అది కాలక్రమేణా తీవ్రమైంది.[2] వలస పాలన సమయంలో, ఐరోపా నుండి, ప్రధానంగా బ్రిటిష్ దీవుల నుండి, వచ్చిన మిషనరీలు స్థానిక ఫిజియన్లందరినీ క్రైస్తవ మతంలోకి మతమార్పిడి చేసారు. ఇండో-ఫిజియన్ హిందువులు మాత్రం, మతం మారడానికి చాలా వరకు నిరాకరించారు. అత్యధిక మెజారిటీ ఈనాటికీ హిందువులుగానే ఉన్నారు.

సంస్కృతి

మార్చు
 
నాడి లోని శ్రీ శివ సుబ్రమణ్య హిందూ దేవాలయం

ఫిజియన్ హిందువులు రామ నవమి, హోలీ, దీపావళి జరుపుకుంటారు. వీటిలో దీపావళి ప్రభుత్వ సెలవుదినం.[23]

20వ శతాబ్దపు ప్రథమార్ధంలో, ఫిజీలోని హిందువులకు హోలీ ప్రధాన పండుగ.[15] ఆ తర్వాత దీపావళికి ప్రాధాన్యత పెరిగింది. ఫిజీ స్వాతంత్ర్యం పొందిన తరువాత, దీపావళి అన్ని ఇతర హిందూ పండుగలను అధిగమించింది. ఇప్పుడు అదే ప్రధాన ఫిజియన్ హిందూ పండుగ. హిందువులు యూరోపియన్ నివాసితులు, స్థానిక ఫిజియన్ ప్రజలతో సమాన రాజకీయ హక్కులను డిమాండ్ చేస్తున్నందున వారు ఎదుర్కొంటున్న విభజనను బహుశా ఇది ప్రతిబింబిస్తుందని జాన్ కెల్లీ [15] అన్నాడు. హోలీ అనేది ఒక అందరూ కలిసి చేసుకునే, బహిర్ముఖమైన పండుగ కాగా, దీపావళి భక్తి ఆధారంగా. అంతర్ముఖంగా చేసుకునే పండుగ. దీనివల్లనే ఫిజీలోని హిందువులలో సాంస్కృతిక వాతావరణంలో మార్పు వచ్చిందని కెల్లీ సిద్ధాంతీకరించాడు.[15]

ఫిజీలోని హిందువులు, పొలాల్లో శారీరక శ్రమతో సహా ఏ విధమైన పని అయినా ఒక పూజగా, మతపరమైన సమర్పణగా పరిగణిస్తారు.

హిందువులు ఫిజీకి వచ్చిన తర్వాత దేవాలయాలను నిర్మించడం ప్రారంభించారు. వివాహాలు, వార్షిక మతపరమైన పండుగలు, ప్రియమైనవారి మరణం తర్వాత జరిగే కుటుంబ ప్రార్థనలు తదితర సామాజిక కార్యక్రమాలకు ఇవి వేదికలుగా పనిచేశాయి. హిందూ దేవాలయాలు ఉత్తర, దక్షిణ భారత శైలిలో నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, నాడిలోని నదావర్ వద్ద ఉన్న శివాలయం 1910లో నిర్మించబడింది; అయితే ఈ ఆలయం 2008 లో జరిగిన మత హింసలో దగ్ధమైంది.[24] నాడిలోని శ్రీ శివ సుబ్రమణ్య దేవాలయం ఫిజీలో అతిపెద్ద దేవాలయం.[25]

దేవాలయాలతో పాటు, హిందువులు సామాజిక, విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలను నిర్మించారు. ఉదాహరణకు, స్వామి వివేకానంద భక్తుడు, తరువాతి కాలంలో సాధు స్వామి అని పేరొందిన కుప్పుస్వామి నాయుడు, ఫిజీలోని వివిధ దీవులను సందర్శించి, ప్రత్యేకించి దక్షిణ భారతదేశం నుండి వచ్చిన విభిన్న హిందూ సమాజాలను కలుసుకుని TISI సంగం అనే సంస్థను స్థాపించాడు. ఈ సంఘం కాలక్రమేణా పాఠశాలలు, నర్సింగ్ క్లినిక్‌లు, వ్యవసాయ సాంకేతికతలలో కమ్యూనిటీ సహాయం, దేవాలయాలు, ఫిజీలో హిందూ ప్రజల కోసం కమ్యూనిటీ సెంటర్/హిస్టరీ మ్యూజియంలను ఏర్పరచింది.[26]

రెండవ ప్రపంచ యుద్ధం

మార్చు

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రరాజ్యాల సేనలో చేరాలని ఇండో-ఫిజియన్లకు పిలుపునిచ్చారు. ఫిజీలోని 5,000 మంది హిందువులు యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేశం, ఇతర బ్రిటిష్ కాలనీల నుండి వచ్చిన లక్షల మంది సైనికులతో కలిసి పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండో-ఫిజియన్లు ఆసియా, ఐరోపాలలో సేవలందించారు.

అణచివేత

మార్చు

ఫిజి బ్రిటిష్ వలస సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందే సమయానికి, హిందువులు, ఇతర ఇండో-ఫిజియన్లు మొత్తం ఫిజియన్ జనాభాలో దాదాపు యాభై శాతం ఉన్నారు. అయితే వలసవాద యుగం చట్టాలు, ఫిజీకి మొదటి రాజ్యాంగం, స్థానిక ఫిజియన్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేసింది.[9] ఈ చట్టాలు హిందువులకు తక్కుబ్వ స్థాయి మానవ హక్కులనిచ్చి ఫిజీలో రెండవ స్థాయి పౌరులుగా మార్చాయి. ఉదాహరణకు, హిందువులకు భూమిని కొనుగోలు చేసే లేదా స్వంతం చేసుకోవడం వంటి ఆస్తి హక్కులను నిరాకరించింది. అప్పటి నుండి హిందువులు, ఇతర ఇండో-ఫిజియన్లు ఇతర ఫిజియన్లతో సమానమైన మానవ హక్కులను అనుభవించలేదు. వారు ఫిజియన్ భూస్వాముల వద్ద కౌలు రైతులుగా మాత్రమే పని చేయగలరు.[27] మానవ హక్కులలో ఈ వ్యత్యాసం "స్థానిక" ఫిజియన్‌లు, ఇండో-ఫిజియన్‌ల మధ్య నిరంతర సంఘర్షణకు కారణమైంది. స్థానిక ఫిజియన్లు ఫిజీని తమ పూర్వీకుల భూమిగా విశ్వసిస్తూ, తాము మాత్రమే భూమి కలిగి ఉండాలని భావిస్తారు. ఇండో-ఫిజియన్లు మాత్రం మానవులందరికీ సమాన హక్కులుండాలని డిమాండు చేస్తున్నారు.  

భూ స్వామిత్వమే కాకుండా, ఫిజియన్ మత నిర్మాణంలో కూడా హిందువులు హింసించబడ్డారు. స్పైక్ బోయ్‌డెల్ ఇలా పేర్కొన్నాడు, "బ్రిటీష్ వారు మతపరమైన ప్రాతినిధ్యం, మతపరమైన ఓటర్ల జాబితాల విభజనలతో ఒక పనిచేయని వ్యవస్థను ప్రవేశపెట్టారు. అందువలన, వివిధ సంఘాలకు వివిధ పద్ధతుల్లో ప్రాతినిధ్యం లభించింది. ఇది ఇప్పటికీ పాక్షిక వర్ణవివక్ష విద్యా విధానంలో అమలులో ఉంది.[7]

1990ల చివరలో, ఫిజి హిందువులకు (ఇతర ఇండో-ఫిజియన్లకు) వ్యతిరేకంగా రాడికల్ స్థానిక ఫిజియన్లు వరుసగా అల్లర్లు జరిపారు. 2000 వసంతకాలంలో, ప్రధానమంత్రి మహేంద్ర చౌదరి నేతృత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఫిజియన్ ప్రభుత్వాన్ని జార్జ్ స్పీట్ నేతృత్వంలో ఉన్న బృందం బందీ చేసింది. వారు స్థానిక ఫిజియన్ల కోసం విడిగా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు తద్వారా హిందూ నివాసులకు ఉన్న మానవ హక్కులను చట్టబద్ధంగా రద్దు చేశారు. హిందువులకు చెందిన దుకాణాలు, హిందూ పాఠశాలలు దేవాలయాలను ధ్వంసం చేశారు, దోచుకున్నారు.[5][28][29]

ఫిజీలో క్రైస్తవ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఫిజీ, రోటుమా మెథడిస్ట్ చర్చ్, మరీ ముఖ్యంగా ఫిజీలో 1987 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సితివేని రబూకా, పిలుపునిచ్చారు. 1987లో తిరుగుబాటు తర్వాత హిందువులను బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని ఆమోదించారు.[5] 2012లో, ఫిజీ మెథడిస్ట్ చర్చి అధ్యక్షుడు, తుకిలాకిలా వకైరతు, ఫిజీలో క్రైస్తవ మతాన్ని రాజ్య మతంగా అధికారికంగా ప్రకటించాలని పిలుపునిచ్చాడు. మతం, రాజ్యం వేరుగా ఉన్న ఫిజీ లౌకిక రాజ్యంగానే ఉండాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.[30]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "International Religious Freedom Report" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 A. C. Cato (1955), Fijians and Fiji-Indians: A Culture-Contact Problem in the South Pacific, Oceania, Vol. 26, No. 1 (Sep., 1955), pp. 14-34
  3. 3.0 3.1 3.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; jkelly అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Cumpston, I. M. (1956), A survey of Indian immigration to British tropical colonies to 1910, Population Studies, 10(2), pp. 158-165
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Sussana Trnka (2002), Foreigners at Home: Discourses of Difference, Fiji Indians and the Looting of May 19, Pacific Studies, Vol. 25, No. 4, pp. 69-90
  6. Grieco, Elizabeth (1998), The effects of migration on the establishment of networks: Caste disintegration and reformation among the Indians of Fiji, International Migration Review, Vol. 32, No. 3, pp. 704-736
  7. 7.0 7.1 7.2 Spike Boydell (2001), Philosophical Perceptions of Pacific Property - Land as a Communal Asset in Fiji Archived 2016-03-03 at the Wayback Machine Department of Land Management and Development, School of Social and Economic Development, University of the South Pacific
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; strnkasos అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. 9.0 9.1 9.2 9.3 John Kelly (1988), Fiji Indians and Political Discourse in Fiji: from the Pacific Romance to the Coups, Journal of Historical Sociology, Volume 1, Issue 4, pp. 399–422
  10. Boydell, S. (2000), 'Coups, Constitutions and Confusion in Fiji', in Land Tenure Center Newsletter 80 (Fall 2000):1-10
  11. 11.0 11.1 "Religion - Fiji Bureau of Statistics". www.statsfiji.gov.fj. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 24 March 2020.
  12. "Fiji, Religion and Social Profile". Archived from the original on 2021-10-29. Retrieved 2022-01-17.
  13. Compare and contrast: Lochtefeld, James G. (2001). "Fiji". The Illustrated Encyclopedia of Hinduism. Vol. 1. New York: The Rosen Publishing Group, Inc. p. 228. ISBN 9780823931798. Retrieved 16 November 2020. In the 1990s Indians comprised about 45 percent of Fiji's population.
  14. "Religion". Fiji Bureau of Statistics. 2020. Archived from the original on 2 జూన్ 2023. Retrieved 16 November 2020.
  15. 15.0 15.1 15.2 15.3 John Kelly, From Holi to Diwali in Fiji: An Essay on Ritual and History, Man, Vol. 23, No. 1 (Mar., 1988), pp. 40-55
  16. Carolyn Brown (1988), Demographic constraints on caste: a Fiji Indian example, Journal of Historical Sociology, Volume 1, Issue 4, pages 399–422
  17. Brenneis, D. (1984), Grog and gossip in Bhatgaon: style and substance in Fiji Indian conversation, American Ethnologist, 11(3), pp. 487-506
  18. Hollup, O. (1994), The disintegration of caste and changing concepts of Indian ethnic identity in Mauritius, Ethnology, Vol. 33, No. 4, pp. 297-316
  19. Van den Berghe P. L. (1962), Indians in Natal and Fiji: A "Controlled Experiment" in culture contact/LES INDIENS A FIDJI ET AU NATAL, Civilisations, Vol. 12, No. 1, pp. 75-87
  20. Elizabeth M. Grieco (1988), The Effects of Migration on the Establishment of Networks: Caste Disintegration and Reformation among the Indians of Fiji, International Migration Review, Vol. 32, No. 3 (Autumn, 1998), pp. 704-736
  21. A. J. Christopher (1992), Urban Segregation Levels in the British Overseas Empire and Its Successors, in the Twentieth Century, Transactions of the Institute of British Geographers, New Series, Vol. 17, No. 1, pp. 95-107
  22. Jayawardena, C. (1980), Culture and ethnicity in Guyana and Fiji. Man, Vol. 15, No. 3, pp. 430-450
  23. Public Holidays Archived 2014-11-11 at the Wayback Machine The Fijian Government
  24. Another Arson attack on Fiji's Hindu Temples Radio Australia (October 2008)
  25. Largest Temple in Fiji Opens Archived 2020-08-01 at the Wayback Machine Hinduism Today (September 1994)
  26. History Archived 2018-03-17 at the Wayback Machine TISI Sangam, Fiji
  27. Vasil, R. K. (1972) 'Communalism and constitution-making in Fiji', in Pacific Affairs 45 (1 & 2):21-41
  28. "Hindus in South Asia and the Diaspora: A Survey of Human Rights 2005". Hafsite.org. Archived from the original on 2012-07-12. Retrieved 2013-04-30.
  29. FIJI 2012 INTERNATIONAL RELIGIOUS FREEDOM REPORT
  30. Fiji Hindu group rejects Christian state calls Australian Broadcasting Corporation (6 Sep 2012)