బాబు (కార్టూనిస్ట్)

బాబు తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" కలం (కుంచె) పేరు. అసలు పేరు కొలను వెంకట దుర్గాప్రసాద్‌. ఇతని కార్టూన్లను 1963 సంవత్సరం నుండి మొదలు పెట్టి పుంఖాను పుంఖాలుగా అన్ని ప్రముఖ పత్రికల్లోను ప్రచురించారు. ఇతని కార్టూన్లు ఆంధ్రపత్రికలో మొదట ప్రచురించబడ్డాయి. తరువాత్తరువాత, స్వాతి పత్రిక ప్రచురించబడుతున్నాయి. ఇతను వ్యంగ్య చిత్రాలను చిత్రించటమే కాకుండా కథానికల రచయిత కూడా. ఆపైన, వార పత్రికలలో ప్రచురితమయ్యే కథలు, కథానికలు, శీర్షికలు, ధారావాహికలకు చక్కటి అర్ధవంతమయిన చిత్రాలను గీస్తుంటారు.

కొలను వెంకట దుర్గాప్రసాద్‌
బాబు
జననంకొలను వెంకటదుర్గాప్రసాద్‌
(1946-06-01)1946 జూన్ 1
కృష్ణా జిల్లా విజయవాడ
మరణం2019 అక్టోబరు 3(2019-10-03) (వయసు 73)
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుబాబు
వృత్తికార్టూనిస్ట్, పదవీ విరమణ చేసిన ఉద్యోగి
భార్య / భర్తశాంతకుమారి
పిల్లలుకళ్యాణ్ చక్రవర్తి, వేణు
తండ్రికొలను సత్యనారాయణ
తల్లికొలను పిచ్చమ్మ
బాబు కార్టూన్ల సంకలనం వెనుక కవరు పుట. ఇందులో బాబు చిత్రం కూడా ఉన్నది

వ్యక్తిగతం

మార్చు

కొలను వెంకటదుర్గాప్రసాద్ విజయవాడలో 1946, జూన్ 1న జన్మించారు. ఇతని తండ్రి కొలను సత్యనారాయణ, తల్లి కొలను పిచ్చమ్మ. మొదట ఇతని పేరును వెంకటరమణ అనుకున్నారట కాని ఇతడి తండ్రి విజయవాడ దుర్గాదేవి మీద ఉన్న భక్తితో, పేరును వెంకటదుర్గాప్రసాదుగా నిర్ణయించారట. ఇంట్లో అందరూ "బాబు" అని ముద్దుపేరుతో పిలిచేవారు. 1962వ సంవత్సరంలో విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో పి.యు.సి (Pre University Course) చదివారు. సినిమా ప్రచార కార్యక్రమంలో (Publicity)లో కొంతకాలం పనిచేశాడు. కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో 1966వ సంవత్సరంలో చేరి, 40 సంవత్సరాలు పనిచేసి గ్రూప్-బి అధికారిగా 2006లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం విజయవాడలోని సీతారాంపురంలో నివాసముంటున్నాడు. ఇతని భార్య పేరు శాంతకుమారి. వీరికి ఇద్దరు కుమారులు కళ్యాణ్ చక్రవర్తి, వేణు. కోడళ్లు- సునంద, శివ లక్ష్మీ, మనవడు-పావన వంశీ శ్రీనివాస్, మనవరాలు-దేవి శ్రీవల్లి

వ్యంగ్య చిత్రకారుని ప్రగతి

మార్చు

ఇతను చలనచిత్ర ప్రచార రంగంలో పనిచేస్తున్న రోజులలో, స్నేహితుడు క్యానం భగవాన్ దాస్ (ఇతను కూడా కార్టూనిస్టే-భగవాన్ పేరిట వ్యంగ్య చిత్రాలు గీశేవాడు) మార్గదర్శనంలో, బాపు ఆడుగుజాడలలో, అతని ఏకలవ్య శిష్యరికం చేస్తూ కార్టూన్లను వెయ్యటం మొదలుపెట్టాడు. మొట్టమొదటి కార్టూన్, ఆంధ్ర పత్రికలో 1963 సంవత్సరం, సెప్టెంబరు 6వ తారీకు సంచికలో ప్రచురితమయ్యింది. ఆ తరువాత డజన్ల కొద్దీ వ్యంగ్య చిత్రాలు ప్రచురించాడు. ఆంధ్ర పత్రిక సంపాదకులయిన శివలెంక రాధాకృష్ణ ఇతడిని ఎంతగానో ప్రొత్సహించాడు. ఆంధప్రత్రికలోనే కాక తమ అనుబంధ ప్రచురణలైన భారతి (మాస పత్రిక), కలువబాలలో ఇతని కార్టూన్లనే కాక, కథలకు బొమ్మలు, కథలు, అనువాదాలను దాదాపు రెండు దశాబ్దాల పాటు, ప్రచురించారు. 1972 సంవత్సరంలో "వెంకన్నాస్ కోల్డ్" అన్న వ్యంగ్య చిత్ర ధారావాహికను ఆంధ్రపత్రికలో 24వారాల పాటు (6 నెలలు) ఏకథాటిగా ప్రచురించి పాఠకులను ఎంతగానో అలరించి మెప్పు పొందాడు. అలాగే, "ఇ వేమన పద్యాలను" నాలుగు సంవత్సరాలపాటు ప్రచురించి, హాస్య ప్రధానంగా బొమ్మలు వేసి, వేమన పద్యాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చాడు. బారిష్టర్ పార్వతీశం నవల మొదటిభాగానికి బొమ్మలు వేశాడు. తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలలోనే కాక, ఆంగ్లంలో ప్రచురితమయ్యే, కార్వాన్(Carvan)లో చాలా కార్టూన్లను వేశాడు. అలాగే ఉమెన్స ఎరా(Women's Era)పక్ష పత్రికలో మోడెస్ట్(Modest) అన్న శీర్షికన, రెండు సంవత్సరాల పాటు కార్టూన్లను ప్రచురించాడు. 1970 ప్రాతాలలో, తన మిత్రుడు, ప్రముఖ కార్టూనిస్ట్ అయిన జయదేవ్‌తో కలసి "పేజీ కార్టూన్ల"ను వెయ్యటం ఒక మరుపురాని గొప్ప అనుభవం అని చెప్తాడు బాబు. జపాన్, బెల్జియం, టర్కీ దేశాలలో జరిగిన వివిధ కార్టూన్ల పోటీలలో ఇతని కార్టూన్లను ప్రదర్శించారు. తనకు అన్నిటికంటే జరిగిన సన్మానం బాపు తన కార్టూన్‌ను మెచ్చుకోవటం అని చెప్పి మురిసిపోతాడు. ఉద్యోగంనుండి మాత్రమే పదవీ విరమణ చేశాడు, తన ప్రవృత్తి అయిన వ్యంగ్య చిత్ర పరంపరను మటుకు చక్కగా కొనసాగిస్తున్నాడు, ప్రతివారం స్వాతి పత్రికలో కార్టూన్లను ప్రచురిస్తున్నాడు.

కథాకారుని ప్రగతి

మార్చు
  • చాలామందికి తెలియని విషయం, ఇతను మంచి కథా రచయిత కూడ. తన కథలను తన అసలు పేరుతో ప్రచురించటం వల్ల, "బాబు" కార్టూనిస్ట్, కథా రచయిత కొలను వెంకటదుర్గాప్రసాద్ ఒకరే అన్న విషయం చాలామంది పాఠకులకు తెలియదు.
  • "ప్రముఖ కార్టూనిస్టు అయిన బాబు కథలు కూడ వ్రాస్తారు" అని చెప్పుకోవటానికి మాత్రమే కాకుండా, చక్కటి కథలను రచించి, ఆంధ్రపత్రిక ఆ రోజులలో (1970లలో)నిర్వహించే దీపావళి కథల పోటీలలో, మూడుసార్లు బహుమతులను సంపాదించాడు.
  • వ్యంగ్య చిత్ర చిత్రీకరణ విషయంలో బాపును గురువుగా బావిస్తే, హాస్య రచనల విషయంలో ముళ్ళపూడి వెంకటరమణను తన గురువుగా భావిస్తారు.

బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రచురిస్తున్న గ్రామీణాభిఫృద్ధి మాస పత్రిక స్థానిక పాలనలో కూడా తన వ్యంగ్య చిత్రాలను ప్రచురిస్తూ గ్రామీణ పాఠకులకు నర్మగర్భంగా వివిధ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కలుగచేస్తున్నాడు.

బాబు-బాపు

మార్చు

కొత్తగా కార్టూన్లను చూడటం మొదలు పెట్టిన పాఠకులు, పేర్లలో ఉన్న సామ్యం వల్ల, బాబు-బాపు ఇద్దరూ ఒకరే అనుకునే అవకాశం ఉంది. బాపు తెలుగు వ్యంగ్య చిత్రాలకు ఆద్యుడు, పితామహుడయితే, ఆ ఒరవడిని అంది పుచ్చుకుని, తెలుగులో వ్యంగ్య చిత్రాల చిత్రీకరణలో చెయ్యగలిగిన ప్రయోగాలన్నీ చేసి పాఠకులను అలరించినవారు బాబు . అందుకనే, తన కార్టూన్ల సంపుటిలో బాబు ఎంతో ఒద్దికతో, "ఎవరి గీతలనయితే నేను చూచి గీయడం నేర్చుకున్నానో-ఆగీతాకారుడైన శ్రీ బాపూగార్కి" అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

 
ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్‌ గీసిన బాబు రేఖా చిత్రం.

బాపు తెలుగు కార్టూన్లకు ఆద్యుడయితే, బాబు-జయదేవ్ రెండు కళ్ళలాంటివారు. ఇద్దరూ ఒకరికొకరు స్ఫూర్తిగా, స్నేహపూర్వక పోటీ తత్వంతో, తెలుగు వ్యంగ్య చిత్ర విభాగానికి ఏనలేని సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నిజ జీవితంలో ప్రియ మిత్రులు. "బాబు" అన్న మాటను చిన్న పిల్లవాడిని సంబొధించేటప్పుడు కూడా వాడతారు. ఆ వాడుకను అనుసరించి, బాబు బొమ్మను చిన్నపిల్లవాని దేహం, పెద్దవారి తలతో చిత్రించారు జయదేవ్. చిలిపితనంలో, కొత్త విషయాలపట్ల ఆసక్తిలో చిన్నవాళ్ళల్లో ఉన్న ఉత్సాహంతోను, తెలుసుకున్న విషయాన్ని పెద్ద తలకాయతో ఆలోచించి మంచి హాస్యం,వినోదం పంచే కార్టూన్లు బాబు వేస్తుంటారని చెప్పకనే తన రేఖాచిత్రంతో చెప్తున్నారు జయదేవ్ .

బాబు కథ

మార్చు

మనకున్న అగ్రగామి వ్యంగ్య చిత్రకారులలో, బాపు, బాబు తప్ప మిగిలిన అందరూ, తమ తమ పేర్లను లేదా తమ పేర్లలోని కొంత భాగాన్ని తమ వ్యంగ్య చిత్రానికి సంతకంగా వాడుతుంటారు. బాబు, ఈ విధంగా పొడి అక్షరాలను వాడటానికి కారణం, వీరి చిన్నతనంలో, కుటుంబ సభ్యులు, మేనమామలు ముద్దుగా "బాబు" అని పిలిచేవారట. తన ముద్దుపేరునే తన కలంపేరుగా మార్చుకుని కలకాలం నిలిచేట్టుగా చేశారు.

కార్టూన్ల ప్రత్యేకత

మార్చు

వ్యంగ్య చిత్రాలకు ప్రాణం బొమ్మలో నాణ్యం. ఇతను గీసే కార్టూన్లలోని చిత్రాలన్నీ కూడా చాలా నాణ్యమయినవే! చక్కటి గీతల కలయికతో భావయుక్తమయిన కార్టూన్లను గీయటం ఇతని ప్రత్యేకత. కార్టూన్‌లో ఎంతవరకూ అవసరమో అంతవరకే వివరాలను చిత్రీకరిస్తాడు. అనవసరమైన ఆర్భాటాలు ఇతని కార్టూన్లలో ఉండవు. బొమ్మలు చక్కగా కుదురుగా ఉండి చూసి ఆనందించటానికి అనువుగా ఉంటాయి. మంచి చేతివ్రాతతో, అంతకంటే మంచి మాటల పొందికతో చదవగానే అర్ధమయ్యి నవ్వు తెప్పించే సంభాషణలు వ్రాయటం ఇతని మరొక ప్రత్యేకత.

ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు

మార్చు

సామాన్యంగా, వ్యంగ్య చిత్రకారులు, తమ కార్టూన్లలో, ఒక్కొక్క కార్టూన్‌లోఒక్కో విషయం మీద హాస్యాన్ని గుప్పిస్తూ ఉంటారు. కాని, బాబు ఏదో ఒక విషయం తీసుకుని ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు అనేకం గీయటంలో మంచి దిట్ట.

  • ఆనందమంటే:చిన్న చిన్న ఆనందాలు-పెళ్ళాంతో వాదించి గెలవటం(భర్త మొహంలో అనిర్వచనీయమైన మహదానందం), వచ్చిన చుట్టం వెళ్ళిపోవటం, స్నేహితుడు హోటలు బిల్లు చెల్లించటం(ఆ స్నేహితుని ముఖ భంగిమ పొట్ట చెక్కలు చేస్తుంది)
  • పొదుపుచేసి చూడండి:పొదుపు చెయ్యటంలో విపరీతాలు, కూరలు వండుకోకుండా పచ్చివి తినటానికి ప్రయత్నించటం-నూనె ఆదా కోసరం అందరికీ గుండు చేయించి, భార్యను మరి నువ్వో అనే భర్త
  • బ్రాందీ పుట్టిన దేశంలో ఓ మహానాయకుని చరిత్ర:మామూలు వీధి రౌడీ పెరిగి పెద్దయ్యి రాజకీయనాయకుడూ ఆపైన మంత్రి అయిన తరువాత అతని జీవిత చరిత్రను ఒక్కొక్క సంఘటనకు రెండేసి బొమ్మలు-ఒకటి యదార్ధం, మరొకటి ఆ యదార్ధాన్ని ఎలా మసిపూసి మారేడుకాయచేసి చూపుతారు-ఎంతో హాస్యంతో నింపి వేసారు.
  • సినిమా పాటలు:సినిమా పాటలకు పారడీగా కొన్ని చక్కటి కార్టూన్లు
  • సుమతి కార్టూన్లు:సుమతీ శతకంలోని కొన్ని పద్యాలకు వ్యంగ్య చిత్రీకరణ
  • హోటలోపాఖ్యానం: హోటళ్ళలో జరిగే హాస్య సంఘటనలు
  • విశాఖలో సిటీ బస్సులు:ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి విశాఖ పట్టణంలో సిటీ బస్సుల స్వైర విహారం గురించి కాప్షన్ వ్రాస్తే, బాబు ఆ విషయానికి చక్కటి కార్టూన్లను అందించారు.
  • శిల్పి: శిల్పి శిల్పాలు చెక్కుతుండగా ఏర్పడటానికి అవకాశమున్న హాస్య సంఘటనలు. ముందు కాళ్ళు చెక్కటం మొదలు పెట్టటంతో, ఆ శిలకు పైన బరువెక్కువై ముందుకు ఒరిగి శిల్పి మీదపడపోతుంటే ఆ శిలను పట్టుకు నిలవిరుస్తున్న ఒక కొత్త శిల్పిని చూసి, అనుబవజ్ణుడైన పెద్ద శిల్పి "ముందు పైభాగం చెక్కాలని చెప్పానా" అంటూ ఉంటాడు.
  • రాశిఫలాలు:వార పత్రికలలో రాశి ఫలాలలో సామాన్యంగా ప్రతివారం వ్రాసే కొన్ని పడికట్టు మాటలను ఎద్దేవా చేస్తూ వేసిన వ్యంగ్య చిత్రాలు
  • ఇన్ఫ్లేషనంటే: ద్రవ్యోల్బణం పెచ్చరిల్లితే ఎలా ఉంటుంది అన్న విషయానికి చక్కటి హాస్యంతో కూడిన చిత్రాలు
  • వయోజనవిద్య:చదువుకోని పెద్దలకు అక్షరాలు నేర్పటం, తెలుగు అక్షరమాలను అనుసరించి "అ" నుండి "అం" దాకా అకర్షణీయమైన వ్యంగ్య చిత్రాలు.
  • మందుమహాత్యం:మధ్యం సేవించిన మనిషి చేసే అపభ్రంశపు పనులు

వీరి కార్టూన్లు నవ్వు తెప్పించటమే కాక, చదువరిని అలోచింప చేస్తాయి. పైన ఉదహరించిన ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలన్నీ కూడా ఆ కోవకు చెందినవే. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాల విద్యార్థులలో పారిశుద్ధ్యం పెంపొందించటానికి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి పనిచేసి, హాయిగా ఆరోగ్యంగా అనే బొమ్మల పుస్తకాన్ని కూడా రచించాడు. ఈ పుస్తకం అనంతర కాలంలో ఆంగ్లంలోకి కూడా "హెల్తీ అండ్ హ్యాపీ" పేరుతో తర్జుమా అయి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం లోని విషయం ఆధారంగా యానిమేటెడ్ చిత్రాలను కూడా ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలుగు ఆంగ్ల భాషలలో రూపొందించింది. ఈ చిత్రాలు యూ ట్యూబ్లో కూడా లభ్యమవుతున్నాయి.

వ్యంగ్య చిత్ర ధారావాహిక

మార్చు

1972లో ఆంధ్రపత్రిక వార పత్రికలో, సంచిక తెరువగానే ముఖచిత్రం వెనుక వెంకన్నాస్ కోల్డ్ (అప్పట్లో మనదేశంలో విడుదలయిన ప్రముఖ ఆంగ్ల చిత్రం మెకన్నాస్ గోల్డ్ కు పారడీగా-పేరువరకు మాత్రమే) 24 వారాల పాటు ప్రచురించబడి పాఠకులను ఎంతగానో అలరించింది. తెలుగులో వ్యంగ్య చిత్ర ధారావాహికలలో మొదటిది బుడుగు అయితే, వెంకన్నాస్ కోల్డ్ రెండవది.

ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
 
బాబుకు బాపు ప్రశంస
  • శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు మొదలు పెట్టారు. జయదేవ్, బాబుల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి. బాబు మంచి కార్టూనిస్టుగానే కాదు, ప్రథమ శ్రేణికి చెందిన కథా రచయితగానూ పేరుపొందాడు.
  • బాపు-ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, వ్యంగ్య చిత్రకారులు-ఇతను మాటలతో కాకుండా తన గీతలతోనే బాబు కార్టూన్ల మీద తన అభిప్రాయాన్ని విన్నూత్నంగా వ్యక్తపరిచాడు.
  • జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్-తెలుగు కార్టూనుకు దర్పణం పట్టిన కార్టూనిస్టులు ఇద్దరే ఇద్దరు. ఒకరు బాపు, మరొకరు బాబు. ఇద్దరి కార్టూనుల్లో హావం, భావం, పదం, రేఖా విన్యాసం మెండుగా కనిపించి, పాఠకుడి మనసునాకట్టుకుంటాయి. బాపు కార్టూను కళాకోవిదుడు. ఆయన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, చదివి వంటపట్టించుకుని, కార్టూన్ విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు బాబు. తన చుట్టూ కదిలే, మెదిలే, వస్తువుల్ని, అంశాల్ని, వ్యక్తుల్ని, వాసనతో సహా పట్టేసి, స్పృశించి, సందర్భానుసారంగా తన ఊహా శక్తిని ప్రదర్శించగల నేర్పు బాబు ఒక్కరికే ఉంది. 1965లో "మకెన్నాస్ గోల్డ్" సినిమా రిలీజైంది (విజయవాడలో1970వ సంవత్సరంలో ఊర్వశీ సినిమా హాలులో మొదటి సినిమాగా విడుదలయ్యింది). ఆ సినిమా టైటిలును బాబు పట్టుకున్నాడు. "వెంకన్నాస్‌ కోల్డ్" బొమ్మల కథను సృష్టించాడు(1972లో). అతనికి స్ఫూర్తి ఏ విధంగా కలుగుతుందో చెప్పలేము. అన్ని రకాలుగా ఆలోచించి, వ్యంగ్యాన్ని పండించగల ధీమంతుడు బాబు!
  • వేమూరి బలరామ్‌-స్వాతి వారపత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు-ఎదుటివారిని ఏడిపించడం ఎందరికో వేడుక. కాని ప్రతి వార్ని నవ్వించాలని కొందరికే కోరిక. అలా నవ్వించగలిగిన కొందరిలో 'బాబు'ది ఓ ప్రత్యేక బాణి.
  • రామకృష్ణ-ప్రముఖ కార్టూనిస్ట్- "బాపు తరువాత అంత అలవోకగా,తేలికైన గీతలలో కార్టూన్ చిత్రించటంలో నేర్పరి బాబు........సామాన్యుడి దైనందిన జీవితంలోని అనుభవాలకు చాలా దగ్గరగా ఉంటాయి ఆయన కార్టూన్లు. అందుకే అవి అంత బాగా పేలతాయి........."

కొలను వెంకట దుర్గాప్రసాద్ గారు 3 అక్టోబర్ 2019 తెల్లవారుఝామున 02:10 గంటలకు విజయవాడలో వారి స్వగృహమునందు మరణించారు.

బాబు వ్యంగ్య చిత్ర మాలిక

మార్చు

మూలాలు,వనరులు

మార్చు

1981వ సంవత్సరంలో స్వాతి పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించిన బాబు కార్టూన్స్‌‌ సంకలనం