బాలాంత్రపు నళినీకాంతరావు

బాలాంత్రపు నళినీకాంతరావు రచయితగా, జర్నలిస్టుగా ప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1915, మే 9వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, కుతుకులూరు గ్రామంలో జన్మించాడు[1]. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు ఇతని తండ్రి. ప్రముఖ వాగ్గేయ కారుడిగా ప్రసిద్ధికెక్కిన బాలాంత్రపు రజనీకాంతరావు ఇతనికి సోదరుడు. కాకినాడ పి.ఆర్.కాలేజీలో బి.ఎ. చదివాడు. 1937లో మద్రాసుకు వెళ్లి ఇంగ్లీషులో ఎం.ఎ. చదివాడు. మద్రాసులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ నడిపిన ఆంధ్ర మహిళాసభ విద్యావిభాగానికి 1940-47ల మధ్య పర్యవేక్షకుడిగా పనిచేశాడు.

పాత్రికేయుడిగా మార్చు

ఇతడు పదిహేనేళ్ల వయసులోనే తన తండ్రి నిర్వహించిన ఆంధ్ర ప్రచారిణి పత్రికకు, ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలకు ప్రచురణకు వచ్చే రచనలను పరిశీలిస్తూ తండ్రికి సహరించేవాడు. 1948లో మద్రాసులో ప్రముఖ జర్నలిస్టు కోటంరాజు రామారావు దగ్గర 'ఇండియన్ రిపబ్లిక్ ' పత్రికలో పత్రికారచనలో శిక్షణ పొందాడు. తొలిరోజులలో తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ పత్రికలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. 1973లో ది మెయిల్ పత్రిక నుండి సీనియర్ జర్నలిస్టుగా పదవీ విరమణ చేశాడు.

రచనలు మార్చు

  1. కృష్ణశాస్త్రి వ్యాసావళి[2] (సంపాదకత్వం బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుతో కలిసి)
  2. తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలు ( బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుతో కలిసి)
  3. నివేదన[3]

అంతర్జాతీయ శ్రామిక గేయం మార్చు

ఫ్రెంచివిప్లవకారుడు ఈజిన్ పాటియర్ 1871లో ఫ్రెంచి కమ్యూన్ కాలంలో వ్రాసిన ‘కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్’ కు తెలుగులో బాలాంత్రపు నళినీకాంతరావు 1935లో అనువదించి తొలి కమ్యూనిస్ట్ పత్రిక ప్రభలో ప్రకటించాడు. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో విస్తృత ప్రాచుర్యం పొంది, లక్షల మంది శ్రమజీవులు, కమ్యూనిస్టులు పాడుకుంటున్న ఈ గేయం ఇవాళ్టికీ శ్రామికోద్యమానికి ఊతంగా నిలుస్తున్నది.

ఆ గేయంలోని కొంతభాగం:

 మేలుకోండి పేద ప్రజలారా
మేలుకోండి నలు దిశలా
శ్రామికులు చూపిరి మార్గం
లేచిందోయ్ విముక్తి పథం
తరతరాల కుటిలాచారం
చెయ్యాలిక పూర్తి హతం
తుడిచేయ్ జన దీనాలాపం
జీవన్-మరణమని పోరి
తుదిపోరు ఇది ఓ కామ్రేడ్స్
కలవండోయ్ ఏకంగా
ఇంటర్నేషనల్
ఒకటౌదాం - మానవులం
కలవండోయ్ ఏకంగా
ఇంటర్నేషనల్
ఒకటౌదాం – మానవులం’

మరణం మార్చు

ఇతడు తన 89వ యేట చెన్నైలో 2005, ఏప్రిల్ 29న అనారోగ్యం కారణంగా మరణించాడు.[4]

మూలాలు మార్చు