బొమ్మారెడ్డి వెంకటేశ్వర రావు

బొమ్మారెడ్డి వెంకటేశ్వర రావు (వి.ఆర్.బొమ్మారెడ్డిగా సుపరిచితులు) పత్రికా సంపాదకుడు.

జీవిత విశేషాలుసవరించు

బొమ్మారెడ్డి 1917లో కృష్ణాజిల్లా గన్నవరం సమీపాన తేలప్రోలు గ్రామంలో జన్మించాడు[1]. అతను బి.ఏ చదువుతున్న సమయంలోనే 'నేషనల్‌ ఫ్రంట్‌' పత్రిక ద్వారా కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. అతను 1945లో ప్రజాశక్తి దినపత్రికలో సబ్‌-ఎడిటర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ పత్రికపై ప్రభుత్వం 1948లో నిషేధం విధించడంతో వేరొక కమ్యూనిస్టు పార్టీ పత్రిక "జనత" పక్ష పత్రికలో రెండు సంవత్సరాలు పని చేశాడు. ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తీవ్రం కావడంతో పార్టీ ఆదేశం మేరకు మద్రాసు వెళ్లి తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వెలువడిన "జనవాణి" పత్రికలో పని చేస్తూ కమ్యూనిస్టు ఉద్యమానికి తోడ్పడ్డాడు. నిషేధానంతరం "ప్రజాశక్తి" వారపత్రికగా మరలా ప్రారంభించబడినప్పుడు అందులో మరల చేరాడు. తరువాత పార్టీ ప్రారంభించిన "విశాలాంధ్ర" పత్రికలో 12 సంవత్సరాల పాటు పని చేశారు. 1966లో సిపిఐ నుంచి విడిపోయి సిపిఎం ఏర్పడిన తరువాత 'జనశక్తి' పత్రికలోనూ, 1968లో సిపిఎం ప్రారంభించిన 'ప్రజాశక్తి' వార పత్రికలోనూ, 1981లో 'ప్రజాశక్తి' దినపత్రికగా మారినప్పుడు అందు లోనూ పని చేశాడు. కమ్యూనిస్టు పత్రికా రంగానికి విశిష్ట సేవలు చేసిన బొమ్మారెడ్డి 1997లో వయోభారం వలన పాత్రికేయ జీవితం నుంచి విరమణ పొందాడు[1]. అతను ప్రజాశక్తి పత్రిక అరవయ్యేళ్ల ప్రస్థానానికి ప్రత్యక్ష సాక్షి. చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై, తర్వాత పత్రికా రంగంపై ఆసక్తి పెంచుకున్న బొమ్మారెడ్డిగారు ఏడు దశాబ్దాలలోనూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభం, విస్తరణ, విజయాలు, అపజయాలు, పాలకుల నిర్బంధాలూ, అంతర్గత విచ్ఛిన్నాలూ, దాడులూ దౌర్జన్యాలూ కఠిన శిక్షలూ అగ్నిపరీక్షలూ అన్నిటినీ చూశాడు[2].

రచయితగాసవరించు

కమ్యూనిస్టు నాయకుడు చండ్ర పుల్లారెడ్డితో కలిసి సోషలిస్టు ప్రచురణగా వెలువడిన 'మావో సూక్తులు' గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆంగ్లంలో రాసిన 'వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు' గ్రంథాన్ని వాసిరెడ్డి, ఎపివిఠల్‌తో కలిసి తెలుగులోకి అనువదించాడు. కాశ్మీర్‌ సమస్య, నేపాల్‌ గురించి 'నేపాల్‌పై అరుణతార', ప్రముఖుల జీవిత చరిత్రలు మొదలైన 50 పుస్తకాల అనువాదాలు, రచనలు చేశాడు.

పాత్రికేయునిగాసవరించు

ఆంధ్రాలో పాత్రికేయ సంఘ స్థాపకుల్లో బొమ్మారెడ్డి ఒకడు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌కు ఉపాధ్యక్షులుగా సేవలందించాడు. సోవియట్‌ యూనియన్‌ ఆహ్వానంపై 1985లో మార్క్సిస్టు పాత్రికేయ బృందానికి నాయకత్వం వహించి సోవియట్‌ పర్యటన చేశాడు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షునిగా పని చేశాడు. 1999లో తెలుగు పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు పేర నెలకొల్పిన 'నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు' ను ప్రప్రథమంగా బొమ్మారెడ్డికి ప్రదానం చేశారు. 2000లో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి బొమ్మారెడ్డిని సత్కరించింది. కులమతాల ప్రసక్తి లేని హేతువాద దృక్పథం గల ఎన్నో ఆదర్శ వివాహాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి[3].


అతను 2006 అక్టోబరు 12న విజయవాడలోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ప్రజాశక్తిమంతుడు".
  2. "పాత్రికేయ పితామహుడు బొమ్మారెడ్డి".
  3. "Veteran Journalist Comrade V R Bommareddy Passes Away".[permanent dead link]

బయటి లంకెలుసవరించు