బోధనా మాధ్యమం
బోధనా మాధ్యమం, లేదా బోధనా మాధ్యమాలు అనేవి బోధన కొరకు వాడే భాషలు. ఇది దేశం లేదా భూభాగం యొక్క అధికారిక భాష కావచ్చు, కాకపోవచ్చు. విద్యార్థుల మొదటి భాష అధికారిక భాషకు భిన్నంగా ఉంటే, అధికారిక భాష పూర్తి పాఠశాల విద్య లేదా కొంత భాగం కోసం బోధనా మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. ద్విభాషా లేదా బహుభాషా విద్య ఒకటి కంటే ఎక్కువ భాషల బోధనను కలిగి ఉంటుంది. యునెస్కో "పిల్లల మాతృభాషలో విద్యను అందించడం నిజంగా కీలక సమస్య" అని భావించింది. [1]
భారతదేశం
మార్చు- భారతదేశంలో, ఇంగ్లీష్, హిందీ, ఆయా రాష్ట్రాల అధికారిక భాషలు బోధనా మాధ్యమంగా వున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా ఇంగ్లీషును ఇష్టపడతాయి, ప్రభుత్వ (ప్రాథమిక / మాధ్యమిక విద్య) పాఠశాలలు చివరి రెండింటిలో ఒకదానితో వెళ్తాయి. ఏదేమైనా, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధనా మాధ్యమం ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషలో జరుగుతుంది. శాస్త్ర, సాంకేతిక, ఇతర వృత్తివిద్యారంగాలలో బోధన ఆంగ్ల భాషలో జరుగుతుంది. విద్యా మాధ్యమం కూడా రాష్ట్రం, దాని అధికారిక భాషపై ఆధారపడి ఉంటుంది.
- అస్సాంలో, అస్సామీ లేదా ఇంగ్లీష్ వాడతారు.
- పశ్చిమ బెంగాల్లో, బెంగాలీ లేదా ఇంగ్లీష్ వాడతారు.
- కర్ణాటకలో, కన్నడ లేదా ఇంగ్లీష్ వాడతారు.
- గోవాలో, ఇంగ్లీష్ లేదా కొంకణి వాడతారు.
- గుజరాత్లో గుజరాతీ లేదా ఇంగ్లీష్ వాడతారు.
- మహారాష్ట్రలో, ఇంగ్లీష్ లేదా మరాఠీ ఉపయోగించబడుతుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు లేదా ఇంగ్లీష్ వాడతారు. కొన్ని పాఠశాలలు సంస్కృతాన్ని కూడా ఉపయోగిస్తాయి.
- తెలంగాణలో, తెలుగు లేదా ఇంగ్లీష్ వాడతారు.
- తమిళనాడులో, తమిళం, / లేదా ఇంగ్లీష్ వాడుతున్నారు.
- కేరళలో, మలయాళం లేదా ఇంగ్లీష్ వాడతారు.
- ఒడిశాలో, ఒడియా లేదా ఇంగ్లీష్ ఉపయోగించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్
మార్చుప్రాథమిక, ఉన్నత పాఠశాల బోధనా మాధ్యమంగా ఆంగ్లం
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతుల విద్యా మాధ్యమంగా తెలుగును తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.[2] దీనికి కారణంగా సమాజంలో బలహీన వర్గాలు ఆంగ్లమాధ్యమం కోరుతున్నాయని, ఆంగ్లమాధ్యమం చదువు వలనే ఉపాధి అవకాశాలుంటాయని పేర్కొన్నారు. అలా కాకుండా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, ఏ మాధ్యమంలో చదివించాలి అనే హక్కు పిల్లలకు, తల్లిదండ్రులకు ఉండేలా చేయాలని ఒక అభిప్రాయమైతే [3], మధ్యేమార్గంగా గణితం, శాస్త్ర, సాంకేతిక విషయాలకు ఆంగ్ల మాధ్యమం, సామాజిక విషయాలకు తెలుగుని కొనసాగించడం మంచిదని కొందరు ప్రతిపాదిస్తున్నారు. [4]
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం 2008 లోనే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ పాఠశాలల రూపంలో జరిగింది. 6500 ఉన్నత పాఠశాలల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. అయితే ఆంగ్ల మాధ్యమం ప్రారంభంలోనే సీబీఎస్‌ఈ సిలబస్‌ను వాడడం, దాని బోధనకు ప్రత్యేకంగా నిపుణులైన ఉపాధ్యాయులను నియమించకపోవడం, ఉన్న ఉపాధ్యాయులకు కేవలం 13 రోజుల శిక్షణతో సరిపెట్టడం, పాఠ్యపుస్తకాలు సమయానికి అందజేయలేకపోవడం లాంటి కారణాలవలన ప్రయోగం విఫలం అయింది. కొంతమంది విద్యార్ధులు తెలుగు మాధ్యమంలోకి మారితే మరికొంతమంది ప్రవేట్ పాఠశాలలకు మారారు. విద్యార్థులు తగ్గిపోవడంతో 2019 సంవత్సరంలో 5658 పాఠశాలలో మాత్రమే ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నది. చాలా మంది పిల్లలు మధ్యలో బడి మానేస్తున్నారు. సక్సెస్ పాఠశాలలలో సగటున ముప్ఫై శాతం మంది మాత్రమే ఆంగ్ల మాధ్యమం తీసుకుంటున్నారు.[5]
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పి సంబంధిత జీవోలను రద్దుచేసింది. బోధనా భాష ఎంపిక తల్లిదండ్రులు లేక సంరక్షుకలదేనని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుని ఈ తీర్పులో పేర్కొంది. మాతృభాష లో ప్రాథమిక విద్య పిల్లల వ్యక్తిత్వ వికసనానికి దోహదపడుతుందని పేర్కొంది.[6]
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిఫారస్ లేకుండా ఆంగ్ల మాధ్యమ ఉత్తర్వులు సరికాదన్న హైకోర్టు తీర్పుకు ప్రతిక్రియగా ప్రభుత్వం కోరికపై, ఆ సంస్థ కొనసాగగలిగే అక్షరాస్యత అభివృద్దికి బోధనా మాధ్యమం ఒక్కటే కీలకం కాదని, విద్యకు సంబంధించిన అన్ని అంశాలతో కొనసాగగలిగే అక్షరాస్యత సాధించవచ్చని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం 1-6 తరగతులలో చదువుతున్న తల్లిదండ్రుల సర్వే జరిపితే 96.17% మంది ఆంగ్ల మాధ్యమం కోరుతున్నందున, ప్రతిపాఠశాలలో రెండు మాధ్యమాలతో నడుపుటకు నిధులు, వనరులు లేనందున మండల కేంద్రంలో తెలుగు మాధ్యమం పాఠశాల నడిపి, దానిలో చదువుకునే విద్యార్ధులకు వారి గ్రామంనుండి ఉచిత రవాణా సౌకర్యం కలగచేయదలచినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఉత్తర్వు సుప్రీంకోర్టులో వేయబడే అర్జీ తీర్పుకు లోబడి వుంటుందని పేర్కొంది.[7]
2021-22 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కోర్సులకు తెలుగు మీడియం రద్దు
మార్చు2021-22 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీషు బోధనాభాషగానే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్ 2021-06-14 న ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ప్రారంభించే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు ఆంగ్లమాధ్యమంగానే నిర్వహిస్తారు. [8]
తెలంగాణ
మార్చు2022-23 సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమాన్ని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు విస్తరించడానికి తెలంగాణా ప్రభుత్వం ఆలోచన ప్రారంభించింది. మొత్తం సుమారు 26000 బడులలో 2021-22 విద్యాసంవత్సరం నాటికి 4000ప్రాథమిక బడులు, 4000 ఇతర బడులలో ఆంగ్ల మాధ్యమం వాడుతున్నారు. అయితే ఆంగ్లమాధ్యమ బోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించకపోవడం వలన పేరుకే ఆంగ్ల మాధ్యమంగా వుందని విమర్శ వుంది.[9]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Results of the 7th consultation of member states on the implementation of the Convention and Recommendation against discrimination in education. Para. 41" (PDF). UNESCO. 2007.
- ↑ "పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్". NTVnews. 2019-12-11. Archived from the original on 2019-12-14.
- ↑ సత్యాజీ (2019-12-11). "అమ్మ భాష ఆంగ్ల మాధ్యమం". ప్రజాశక్తి. Archived from the original on 2019-12-14.
- ↑ కె అరవిందరావు (2019-11-26). "తెలుగు వర్ధిల్లితేనే వెలుగు". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2019-12-14.
- ↑ కత్తి నరసింహారెడ్డి. "విఫల ప్రయోగంలో బలిపశువులు". తెలుగు వెలుగు. Archived from the original on 2019-12-14.
- ↑ "ఆంగ్లమాధ్యమం జీవోలు రాజ్యాంగం విరుద్ధం". ఈనాడు. 2020-04-16. Archived from the original on 2020-04-20.
- ↑ "ఆంగ్ల మాధ్యమమే!". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2020-05-14. Retrieved 2020-05-14.
- ↑ "ఇక డిగ్రీ చదువు ఇంగ్లీషు మీడియంలోనే". ఆంధ్రజ్యోతి. 2021-06-15.
- ↑ "Telangana government school: చాలాచోట్ల పేరుకే ఇంగ్లీషు మీడియం.. ప్రత్యేక ఉపాధ్యాయులు కరవు!". etvbharat. 2022-01-18. Retrieved 2022-01-26.