బోయినపల్లి వెంకట రామారావు
బోయినపల్లి వెంకట రామారావు (బోవెరా), సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, గ్రంథాలయోద్యమ నాయకుడు.
జీవిత విశేషాలు
మార్చుఇతను సెప్టెంబరు 2, 1920 న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటపల్లి గ్రామంలో రంగమ్మ, కొండల రావు దంపతులకు జన్మించాడు. ఇతనిని బోయినపల్లి హనుమంత రావు, లచ్చమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు.[1] ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చేరాడు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా మెట్రిక్యులేషన్ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువు నిలిపివేశాడు. అయినా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.[2]
తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్ననలందుకున్న బోయినపల్లి వెంకటరామారావు అక్టోబరు 27, 2014న మరణించారు.[3]
స్వాతంత్ర్య పోరాటయోధుడు
మార్చుచిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. ఆర్యసమాజ్ ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడాడు.[4] 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనాడు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశాడు[5]. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా సమర యోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నాడు.
జిల్లాలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40 మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు. ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. అతను 65 సం.ల. క్రితం దేవులపల్లి రామానుజరావు సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాడు. వినోబాబావే, జయప్రకాశ్ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, మల్లాది సుబ్బమ్మ వంటి ప్రముఖులతో పనిచేశాడు. 1952లో ఎలగందుల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1957లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ ఆప్ ఇండియా అభ్యర్థిగా పోటీచేశాడు. దివంగత నేత కొండాలక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ కోసం ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు.
గ్రంథాలయోద్యమంలో
మార్చుతన నివాసంలో 19సంవత్సరాల వయసు అప్పుడు గ్రంథాలయాన్ని స్థాపించి గ్రామస్తులకు పుస్తకాలు చదవడానికి అవకాశం కలిపించారు. 1939లో ఆంధ్ర విజ్ఞాన వర్దిని పేరుతో తన సొంత గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నాటకాలను, బుర్రకథలు, హరికథలు ఏర్పాటు చేసి ఆ డబ్బుతో పుస్తకాలు ఇతర సామగ్రి కొనేవారు. శాంతి యువసేన సహాయంతో అనేక వందల పుస్తకాలు సేకరించి ఉచితంగా ప్రజలకు అందించేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన జాతీయ ఉద్యమంలో, ఉత్తర తెలంగాణాలో ఎంతోమంది యువకులను చేరదీసి గ్రంథాలయోద్యమంలో భాగస్వాములు చేసి గ్రామ గ్రామాన గ్రంధాలయం స్థాపించి, దాదాపు 100 పైగా గ్రంధాలయాలు కూడా నడిపాడు. 1953లో జిల్లా సారస్వత సమితిని ఏర్పాటు చేసి దీని ద్వారా సంచార గ్రంథాలయాలను నడిపాడు. కోదాటి నారాయణతో గ్రంథాలయోద్యమములో, సర్వోదయ, గాంధేయ కార్యక్రమాలలో కలిసి పనిచేశారు. 30 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ పాలక్ మండలి సభ్యులుగా, 11 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశాడు. 1972 నుంచి 1978 వరకు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షుడుగా గ్రామాలలో చాలా గ్రంధాలయాలు స్థాపించారు. 1976లో ప్రభుత్వ భూమిని సేకరించి జిల్లా గ్రంధాలయ భవనాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘంతో 60 సంవత్సరాల అనుబంధం. కార్యవర్గ సభ్యునిగా ప్రారంభించి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎదిగాడు.[6]
కరీంనగర్ కి సంబంధించి దేవాలయాల చరిత్ర, రచయితల పరిచయం, గ్రంధాలయ సంస్థలు వంటి పుస్తకాలే, కాకుండా గాంధీ తత్త్వం, బోవెరా గేయాలు -1, బోవెరా గేయాలు - 2, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు వంటి రచనలు చేసారు[1].
సన్మానాలు, బిరుదులు
మార్చుఅనేక సంస్థలకు సభలకు అధ్యక్షుడుగా, కార్యదర్సిగా గౌరవాధ్యక్షుడుగా, ఉపాధ్యక్ష్యుడుగా సభ్యుడుగా, సలహాదారుడుగా ఉన్నాడు.
- పాతూరి శతజయంతి సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీద సన్మానం
- ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘ్ శతజయంతి సందర్భంగా జీవిత సాఫల్య సత్కారం
- 1945లో బోవెరా కృషి ఫలితముగా తోటపల్లి హరిజనులు ఆలయ ప్రవేశం చేయగలిగారు. ఆ సంవత్సరమే బెజ్జంకిలో హరిజన పాఠశాల, వసతి గృహాలు ఏఏర్పాటు చేసి హరిజన బంధు అను గౌరవము పొందాడు.
- ఉపన్యాసకేసరి, గ్రంధాలయ విభూషణ, విశ్వాబంధు, తెలుగు భాషా మిత్ర వంటి బిరుదులు[1]
- 2006లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించింది.
- భారత రాష్ట్రపతి నుండి అత్యుత్తమ స్థాయి పురస్కారం అందుకున్నాడు.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 శారద, రావి (November 2014). "కరీంనగర్ గాంధి". గ్రంధాలయ సర్వస్వము. 75 (8). విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంస్థ: 1–3.
- ↑ తెలంగాణ గాంధీ ఇకలేరు
- ↑ నమస్తే తెలంగాణ ఆన్‌లైన్ వార్తాపత్రిక, తేది 27-10-2014
- ↑ శతవసంతాల కరీంనగర్ జిల్లా
- ↑ స్వాతంత్ర్య సమరంలో తెలుగు యోధులు
- ↑ 6.0 6.1 రవికుమార్, చేగోని (October 2017). "తెరచిన పుస్తకం బోవెరా జీవితం". గ్రంధాలయ సర్వస్వము. 78 (6). విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంస్థ: 6–7.