మల్లాది సుబ్బమ్మ
మల్లాది సుబ్బమ్మ (ఆగస్టు 2, 1924 - మే 15, 2014) (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య.
మల్లాది సుబ్బమ్మ MALLADI SUBBAMMA | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంక | 1924 ఆగస్టు 2
మరణం | 2014 మే 15మే 15- 2014 | (వయసు 89)
వృత్తి | స్త్రీవాద రచయిత్రి, హేతువాది |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయులు |
జీవిత భాగస్వామి | ఎం.వి.రామమూర్తి |
సంతకం |
జీవిత సంగ్రహం
మార్చుసుబ్బమ్మ 1924, ఆగస్టు 2 వ తేదీ న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. "కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?" అని ప్రశ్నించిన స్త్రీవాది. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.
ఆచార్య సి.నారాయణరెడ్డి ఈమెను గురించి "వాలునుబట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తికాదు" అన్నారు. ఈవిడకు బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. ఈవిడ చదువుకోవడానికి అత్తమామలు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్చి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఎ., కూడా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.
బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు. 1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. ఫిలిం సొసైటీకి ఛైర్మన్ అయ్యారు. 1978లో లండన్లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో పాల్గొన్నారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో రెండు దండలు, రెండు ఫొటోలతో ఆదర్శ వివాహాలు జరిపించారు.
మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. "వికాసం" తర్వాత "స్త్రీ స్వేచ్ఛ" అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయ పురస్కారం' నెలకొల్పారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అరవైకి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం- మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాల ను 2000లో ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని 'మల్లాది సుబ్బమ్మ ట్రస్టు'కి రిజిస్టరు చేసారు.
మరణం
మార్చునిర్వహిస్తున్న సంస్థలు
మార్చు- మహిళాభ్యుదయ సంస్థ : దీనిని 1980లో స్థాపించారు. మిగిలిన సంస్థలు దీనికి అనుబంధంగా పనిచేస్తాయి. దీనికి 100 మందికి పైగా సభ్యులు, హితుల సహాయంతో మంచి గ్రంథాలయాన్ని కూడా స్థాపించి నడిపిస్తున్నారు.
- అభ్యుదయ వివాహవేదిక : దీనిని 1981లో స్థాపించి ప్రేమ, కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర, వరకట్నరహిత, విధవా వివాహాలను జరిపించి చట్ట ప్రకారం రిజిష్టరు చేస్తున్నారు.
- కుటుంబ సలహా కేంద్రం : దీనిని 1980లో స్థాపించారు. కుటుంబ కలహాలతో సతమతమౌతున్న భార్యాభర్తలను కలపడం, వీలుకాని పరిస్థితులలో విడాకులు ఇప్పించడం, భత్యాన్ని ఏర్పాటుచేయడం, హింసాత్మకంగా మారిన వారికి చట్టపరంగా శిక్షించడం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది.
- శ్రామిక మహిళా సేవ : దీనిని బాదం రామస్వామి గారి ఆర్థిక సాయంతో 1989లో నెలకొల్పారు. దీని ద్వారా వడ్డీ లేకుండా శ్రామిక మహిళలకు చిన్న వ్యాపారాలు చేసుకొనడానికి ఆర్థిక సహాయం అందజేసి నెలకు 50 రూపాయల చొప్పున తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటుచేశారు.
- స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం : దీనిని 1987లో స్థాపించి స్త్రీలకు శిక్షణ శిబిరాలను నిర్వహించి వారి హక్కులు, కుటుంబ నియంత్రణ, ఓటుహక్కు, ఇతర స్త్రీల సమస్యల మీద అవగాహన కల్గించారు.
- స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం : దీనిని 1989లో నార్వే వారి ఆర్థిక సహాయంతో వివిధ ప్రాంతాలలోని స్త్రీలకు వారి హక్కులు గురించి చైతన్యవంతుల్ని చేయడం కోసం స్థాపించారు.
- సుబ్బమ్మ షెల్టర్ : వివిధ సమయాలలో బాధిత స్త్రీలకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి కొంతకాలం తర్వాత ప్రభుత్వ సంస్థలకు అప్పగించడానికోసం 1990లో స్థాపించారు.
- వృద్ధ మహిళాశ్రమం : దీనిని 1992 సంవత్సరం నార్సింగి గ్రామంలో నెలకొల్పి బాదం సరోజాదేవితో కలిసి దిక్కులేని వృద్ధ మహిళలకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు.
- కుటుంబ నియంత్రణ సంస్థ : రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహాయంతో కొద్దిమంది సహాయంతో కుటుంబ సంక్షేమం, జనాభా నియంత్రణ మొదలైన విషయాలను తెలియజేసి శస్త్రచికిత్స కోసం పంపిస్తారు.
- వరకట్న హింసల దర్యాప్తు సంఘం : వరకట్నం తీసుకోవడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వీరికి తెలియజేస్తే ఈ సంస్థ ద్వారా కేసును నడిపిస్తారు.
- వికాస కుట్టు, టైపింగ్ సెంటర్ : దీని ద్వారా మహిళలకు జీవనోపాధి కలిగించడం ఉద్దేశం.
- వయోజన విద్యా కేంద్రం : అక్షరాస్యతను వృద్ధి చేయడంలో భాగంగా దత్తాత్రేయ కాలనీలో ఈ కేంద్రాన్ని స్థాపించి కొందరు స్వయం సేవకుల సహాయంతో వయోజనులను విద్యావంతుల్ని చేస్తున్నారు.
రచనలు
మార్చుTitle | Year | Remarks | |
---|---|---|---|
వివాహం-నేడు-రేపు | 1983 | ||
వైవాహిక కుటుంబ సలహా[1] | |||
మాతృత్వానికి మరో ముడి | 1983 | ||
ప్రేమ + సెక్స్ | 1984 | ఆడవారి సమస్యలు, ఉద్రేకాలు, తపన, కామం, మనస్తత్వాల గురించి విస్తృతంగా చర్చించిన నవల | |
వ్యభిచారం ఎవరి నేరం[2] | |||
ఏది అశ్లీలం [3] | |||
బానిస కాదు - దేవత కాదు [4] | |||
బంగారు సంకెళ్ళు [5] | |||
స్త్రీ విమోచన [6] | |||
స్త్రీ విముక్తి [7] | |||
స్త్రీ విముక్తి-నూతన సిద్దాంతం [8] | |||
ఓ మహిళా..!! తెలుసుకో నీ హక్కులు[9] | |||
చీకటి వెలుగులు | 1984 | భార్యల్ని మానసికంగా లేదా భౌతికంగా హింసించే భర్తలతో కాపురం చేయడం కన్నా విడాకులు తీసుకోవడం మంచిది అని తెలిపే నవల. విశ్వసాహితి మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. | |
మహిళా వికాసం -శ్రమ-ఉద్యోగం [10] | |||
మతధర్మ శాసనాలు-మహిళలు | |||
హైందవం- స్త్రీలు | 1986 | ||
క్రైస్తవము- స్త్రీలు [11] | |||
ఇస్లాం- స్త్రీలు [12] | 1984 | ||
మనం మన సంస్కృతి [13] | |||
ఈ దేశం నాదేనా ? | 1986 | కూడు, గుడ్డ, గూడు ఇవ్వలేని మన దేశంలో చెత్తకుండీల దగ్గర చెత్తను ఏరుకొని బ్రతికే అభాగినుల గురించి వివరించే నవల. | |
హేతువాదం 1988 | |||
మూఢనమ్మకాలు నశించేదెలా? | |||
వంశాంకురం | 1988 | పిల్లలను కనడం, గర్భస్రావం వంటి విషయాలు స్త్రీల జన్మహక్కు అని వాదించే నవల: ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. | |
రుద్రమ దేవి | ఒక స్త్రీ ధైర్య సాహసాలను, పరిపాలనా దక్షతను గూర్చి స్ఫూర్తిని కలుగజేసే పిల్లల నవల. దీనిని 1991 సంవత్సరంలో బాలభవన్ వారు ముద్రించారు. | ||
వెలిగిన జ్యోతి | 1992 | డబ్బుకోసం భర్త తనని దగాచేసి పడుపు గృహానికి తరలిస్తుంటే కత్తిపీటతో అతన్ని చంపిన ఒక మహిళ కథ. | |
విముక్తి ఉద్యమాలు-మహనీయులు | |||
మానవ హక్కులు-మహిళల హక్కులు | |||
భావ వాహిని (హేతువాద వ్యాసాలు) [14] | 1983 | ||
మానవ హక్కులు-మహిళల హక్కులు [15] | |||
ఓ మహిళా ముందుకు సాగిపో [16] | |||
స్వతంత్ర స్త్రీల చైతన్యం - భవిష్యద్దర్శనం [17] | |||
కాంతి కిరణాలు | 1984 | వివాహ వ్యవస్థలో ఎన్ని విధాలైన దాంపత్య జీవితం గడపవచ్చునో, కలిసి ఎలా జీవించవచ్చునో చిత్రీకరించడంతో బాటు, ప్రేమ వివాహం, ఆధునిక వివాహం, సంస్కరణ వివాహాలే కాక విప్లవ వివాహం అనే కొత్త రూపాన్ని సామాజిక దృష్టిలోనికి తెచ్చిన నవల. | |
Women In Changing Society [18] |
ధైర్యశాలి
మార్చు1986 ప్రాంతాలలో గీటురాయి వారపత్రిక వాళ్ళు హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహించారు. మల్లాది సుబ్బమ్మ, మాలతీ చందూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ డైరెక్టర్ అబ్బాదుల్లా గారు మగ వక్తలందరికీ పూల దండలు మెడకు వేసి మాలతీ చందూర్ గారికి చేతికి ఇస్తే ఆమె తీసుకున్నారు.అలాగే మల్లాది సుబ్బమ్మగారికి చేతికి ఇవ్వబోతే ఆమె ఎదురు తిరిగి పురుషులకంటే మేము ఏమీ తక్కువ కాదు."దండ నామెడలోనే వెయ్యండి" అని ఆదేశించి మరీ వేయించుకున్నారు.అలాగే ఈ సభలో అంతా మగవాళ్ళే కనిపిస్తున్నారు.సాయిబుల సభలకు ఆడవాళ్ళను తీసుకురారా? అని ప్రశ్నించారు.లేదమ్మా ఆడవాళ్ళు కూడా వచ్చారు.పైన బాల్కనీలో పరదా చాటున ఉన్నారు అంటే కూడా నమ్మకుండా పరదా తొలిగించాల్సిందే అని వాళ్ళందరినీ మగవాళ్ళతో పాటు మెయిన్ హాలులోనే కూర్చోబెట్టాలనీ ప్రసంగించారు.
మూలాలు
మార్చు- ↑ వైవాహిక కుటుంబ సలహా -మల్లాది సుబ్బమ్మ, ఎమ్.వి.రామమూర్తి, ఎమ్ రాధారమణయ్య
- ↑ వ్యభిచారం ఎవరి నేరం-మల్లాది సుబ్బమ్మ
- ↑ ఏది అశ్లీలం
- ↑ బానిస కాదు - దేవత కాదు
- ↑ బంగారు సంకెళ్ళు
- ↑ స్త్రీ విమోచన
- ↑ స్త్రీ విముక్తి
- ↑ స్త్రీ విముక్తి-నూతన సిద్దాంతం
- ↑ ఓ మహిళా..!! తెలుసుకో నీ హక్కులు
- ↑ మహిళా వికాసం -శ్రమ-ఉద్యోగం
- ↑ క్రైస్తవము- స్త్రీలు
- ↑ ఇస్లాం స్త్రీలు
- ↑ స్త్రీ విమోచన
- ↑ భావ వాహిని (హేతువాద వ్యాసాలు)
- ↑ మానవ హక్కులు-మహిళల హక్కులు
- ↑ ఓ మహిళా ముందుకు సాగిపో
- ↑ స్వతంత్ర్య స్త్రీల చైతన్యం - భవిష్యద్దర్శనం
- ↑ Women In Changing Society
- నా జీవితం, నా సాహితీయాత్ర - స్త్రీవాద సాహిత్యమే నా రచనలు, మల్లాది సుబ్బమ్మ, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు, హైదరాబాదు, 2006.