భగవద్గీత-శ్రద్దాత్రయవిభాగ యోగము

భగవద్గీత
GitaUpadeshTirumala.jpg
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక

  • భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికిసోర్స్‌లో ఉన్నది.


శ్రద్దాత్రయవిభాగ యోగము, భగవద్గీతలో పదిహేడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


అర్జునుడు:

కృష్ణా! శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా, రాజసులా, తామసులా? వీరి ఆచరణ ఎలాంటిది?

కృష్ణుడు:

పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక, రాజస, తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు. సాత్వికులు దేవతలనీ, రాజసులు యక్షరాక్షసులనీ, తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు. శాస్త్రనిషిద్దమైన తపస్సును, దారుణ కర్మలను చేసేవాళ్ళూ, దంభం, అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు. ఆహార, యజ్ఞ, తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి. ఆయుస్సునూ, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి, చమురుతో కూడి, పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం. చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని, రోగాలనూ, చింతనీ కల్గిస్తాయి. చద్దిదీ, సారహీనమూ, దుర్వాసన కలదీ, పాచిపోయినదీ, ఎంగిలిదీ, అపవిత్రమైనదీ అయిన ఆహారం తామసము. శాస్త్రబద్దంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం. ఫలాపేక్షతో, పేరు కోసం, గొప్పను చాటుకోవడం కోసం చేసేది రాజస యజ్ఞం. శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం. దేవతలను, పెద్దలను, గురువులను, బ్రహ్మవేత్తలను పూజించడం, శుచి, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస శరీరంతో చేయు తపస్సు. బాధ కల్గించని సత్యమైన ప్రియమైన మాటలు, వేదాభ్యాసం మాటలచే చేయు తపస్సు. నిశ్చల మనస్సు, మృదుత్వం, మౌనం, మనఃశుద్ధి కల్గిఉండడం మనసుతో చేయు తపస్సు. ఫలాపేక్ష రహితం, నిశ్చల మనస్సు, శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం. కీర్తిప్రతిష్ఠల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం. దీని ఫలితం కూడా అల్పమే. పరులకు హాని కల్గించు ఉద్దేశ్యంతో తనను తాను హింసించుకుంటూ, మూర్ఖఫు పట్టుదలతో చేయు తపస్సు తామసికం. పుణ్యస్థలాలలో దానం, పాత్రతను బట్టి దానం, తనకు సహాయపడలేని వారికి దానం చేయడం సాత్వికం. ఉపకారం ఆశించి, ప్రతిఫలం కోరుతూ కష్టపడుతూ ఐనా చేసే దానం రాజస దానం. అపాత్ర దానం, అగౌరవం చే చేసే దానం తామస దానం. 'ఓంతత్"'సత్" అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు. వాటి వలనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులూ కల్పించడం జరిగింది. అందుచేతనే యజ్ఞ, దాన, తపోకర్మలన్నీ 'ఓం'కార పూర్వకం గానే చేస్తారు. మోక్షం కోరువారు ప్రయోజనం కోరకుండా చేసే యాగ, దాన, తపోకర్మలన్నీ "తత్" శబ్దం చే చేయబడుతున్నాయి. "సత్" శబ్దము కు ఉనికి, శ్రేష్టము అని అర్థం. నిశ్చలనిష్ట, పరమాత్ముని గూర్చి చేసే అన్ని కర్మలు కూడా "సత్" అనే చెప్పబడుతున్నాయి. శ్రద్ద లేకుండా ఏమి చేసినా "అసత్" అనే చెప్పబడతాయి. వాటివలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.