కోయ

(భినెకోయ నుండి దారిమార్పు చెందింది)

కోయ అనేది ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ లో నివసించే ఒక గిరిజన తెగ. ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 18వ కులం. వీరు ఇంద్రావటి, గోదావరి,పెన్ గంగా, శబరి, సీలేరు నదుల ప్రాంతాల్లోను,బెజ్జుర్, బస్తర్, కొరాపూట్,ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. భారతీయ కుల వర్గీకరణ ప్రకారం వీరు షెడ్యూల్ ట్రైబ్ గ్రూపుకి చెందినవారు. 1991 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 1,40,000. దేశభక్తి, ఐక్యత ఎక్కువగా ఉన్న వీరు 1880 లో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. భారతీయ స్వాతంత్ర్య పోరాట చరిత్ర ప్రకారం దీనినే కోయ తిరుగుబాటు అని అంటారు. కోయవారు మాట్లాడే భాష కోయి - తెలుగు భాషకు పోలికగా ఉంటుంది.

కోయ మహిళల నృత్యం
కొమ్ముకోయ కళాకారుల బృందం

కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి, రేగు పళ్ళను సృష్టించాడు. 18 వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులు గా పరిగణించేవారు. తరువాతి కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారి కిచ్చారు. ఆప్పుడు ఆ డివిజన్ లో 225 కోయ గ్రామాలుండేవి.

కోయవారిలో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ, అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోనే ఆహారపు అలవాట్లు ఒకలా ఉండవు. లింగదారి కోయలు గొడ్డు మాంసం తినరు - ఇతరులతో భోజనం చేయరు. కులాంతర వివాహాల వచ్చే నష్టాలను నివారించడానికి కొన్ని పూజలు చేస్తారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కూడా కొన్ని పూజలు చేస్తారు. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు.

కోయభాషపై కొన్నిమాటలు

మార్చు
  • సవరలు, కోయలు మొదలయిన మోటు జనులు సంఘములలో అందరూ ఒక్క విధమయిన భాషే మాట్లాడుతారు; శిష్ట భాష అనీ గ్రామ్య భాష అనీ తారతమ్యము ఉండదు. నాగరికులతో సంబంధముగలవారు కొందరు నాగరికుల మాటలు కొన్ని తమ భాషలో కలిపి వాడుకొంటారు. వాటి ఉచ్చారణ సరిగా ఉండకపోయినా, అందరూ వాటిని మెచ్చుకొంటారు. గాని నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు. వర్ణవ్యవస్థ యేర్పడ్డ సంఘములలో భాషావ్యవస్థ కూడా ఏర్పడుతుంది. మాట్లాడేవారి ప్రతిష్ఠ, గౌరవము, కులీనత్వము మొదలయినవాటిని బట్టి వారి భాష “శిష్ట భాష” అని మెప్పుపొందుతుంది; అట్టి వారితో సహవాసము చేత, ఇతర జాతుల వారికి కూడా శిష్ట భాష అలవడుతుంది. క్రమక్రమముగా ఈ “శిష్టభాష” సంఘములో వ్యాపిస్తుంది. “దేశభాష” అనేది ఈలాగుననే ఏర్పడుతుంది.-గిడుగు రామమూర్తి పంతులు
  • వెయ్యేళ్ళ క్రితమే ‘స్థిరపడ్డ’ తెలుగును ‘కోయ, సవర, చచ్చట’ భాషల్లాంటి కేవల వ్యవహార దశకూ ఆటవిక స్థితికి దించరాదు-గ్రాంథిక భాషావాదులు

• కోయ గిరిజనుల పంచాయతీ విధానం:

కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యేక న్యాయ విధానం అమలులో ఉండేది. వీరి సమాజంలో వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆచార వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటాయి. దీనిలో తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తుల ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహిస్తూ వారి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీర్పును వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య కులాల మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా, నష్టం కలిగినా తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా విచారిస్తారు.

• వ్యక్తులు -ప్రాధాన్యత:

పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబంధించి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరితో పాటుగా గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గోత్రానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో

1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పెద్ద. ఈ పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ కాలం ఒకే చోట నివాసం చేయరు.ఇలా ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా, అనుమతి అవసరం.విచారణ అనంతరం తుది తీర్పును పటేల్ వెళ్ళడిస్తాడు. క్రమంగా వంశ పారపర్యంగా ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటేల్ గా వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.

2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గూడెం ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.పంచాయతీ విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.

3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు, ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారంపర్యంగా విధులను కొనసాగించే హక్కు ఉంది. గూడెంకు సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు, మంచిరోజు, ముహూర్తాన్ని నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే కాక గూడెంకు సంబంధించిన పంచాయతీలో ప్రధాన వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.

4.ఏపారి: గూడెంకు సంబంధించిన సామూహిక పనులు, సమాచారాన్ని ప్రజలందరీ చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. పంచాయతీ జరిగే సమయంలో అందరినీ పిలుచుకురావడం, కుల పెద్దలు చెప్పిన విధులను నిర్వర్తిస్తుంటాడు.

• పంచాయతీ రకాలు:

గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధం లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి పంచాయతీ ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కారం జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు, ఆక్రమణలు, భూ తగదాలు, అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు, విడాకులు, అక్రమసంబంధం, బలాత్కారం వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటాయి. ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుకుని చేసుకునే పంచాయతీలే ఉంటాయి.

•శిక్షలు-విముక్తి చర్యలు:

తెగకు మచ్చ తెచ్చే విధంగా కట్టుబాట్లను అధిగమించినపుడు వెలివేయడం తీవ్రమైన శిక్ష.అటువంటివారికి ఇటు గూడెం నుండి కాకుండా పొరుగు గూడాలకు కూడా విషయం తెలియడం వల్ల వీరిని దరికి రానివ్వరు.శిక్షను అనుభవించేవారు నీళ్లు ముట్టరాదు, పండుగల్లో పాలుపంచుకోరాదు.వారికి ఆపద వస్తే పలకరించరు.ఇలాంటి కఠిన నియమాలు అమలుచేయడం వల్ల కొన్ని రోజుల్లోనే తప్పును గ్రహించి తిరిగి కులంలో కలవడానికి పెద్దల అంగీకారం తీసుకుని శిక్షల నుండి విముక్తి పొందేవారు.

ఇవి కూడా చదవండి

మార్చు

లంకెలు

మార్చు

జానపద గిరిజన విజ్ఞానం జాతీయ సదస్సుల పత్రాలు (పెజీ 93-95)

ఇతర పఠనాలు

మార్చు
  • ఎ.అయ్యప్పన్ (1944). మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు.
"https://te.wikipedia.org/w/index.php?title=కోయ&oldid=4354176" నుండి వెలికితీశారు