మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకం.[1][2] కొల్లాపూర్ సమీపంలోని శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుండి లిఫ్ట్ కెనాల్ ప్రారంభమవుతుంది.[3][4][5] గ్రావిటీతో నడిచే 100 కిలోమీటర్ల కాలువ కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల 300 గ్రామాలలోని దాదాపు 4,00,000 ఎకరాలకు సాగును అందిస్తుంది.[6]
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం | |
---|---|
ప్రదేశం | మహబూబ్‌నగర్, తెలంగాణ |
ఆవశ్యకత | వ్యవసాయానికి నీరు |
స్థితి | వాడుకలో వున్నది |
నిర్మాణం ప్రారంభం | 1984 |
ప్రారంభ తేదీ | 2017 |
నిర్వాహకులు | తెలంగాణ నీటిపారుదల శాఖ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
Website నీటిపారుదల శాఖ వెబ్సైటు |
చరిత్ర
మార్చు- 1984 జూన్ 16న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సర్వే కోసం జీవో నంబరు 270ని జారీ చేసింది. 5 ఏళ్ళ తరువాత ఈ ప్రాజెక్టుల సర్వే కోసం నాలుగు డివిజన్లతో ఒక సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
- 1997 డిసెంబరులో సర్వే కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది. రెండేండ్ల సర్వే చేసిన తరువాత 1,271 కోట్లకు ప్రాజెక్టు నివేదిక తయారయ్యింది. 25 టిఎంసిల నీటిని ఎత్తిపోసి 22 జలాశయాల్లో నిల్వచేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
- 1999 జూలైలో మొదటి దశ పనులకు 233.72 కోట్లకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1999 జూలై 5న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశాడు.
- 2002లో ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించి మూడు స్టేజిల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై సమగ్ర నివేదికను తయారు చెయ్యాలని ఇంజనీర్లను ప్రభుత్వం ఆదేశించగా, 2002 ఆగస్టులో 2.5 లక్షలఎకరాలకు సాగునీరు, దారి పొడుగున గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1,766 కోట్లకు మరో ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినారు.
- 2003 మే 4న 1500 కోట్లకు జీవో నంబరు 65ని జారీచేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
- 2003 డిసెంబరులో పనులు ప్రారంభమై, కొంతకాలం జరిగి ఆగిపోయాయి.
- 2005లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2,990 కోట్లకు సవరిస్తూ జీవో జారీ చేశారు. ఆయకట్టును పెంచినాగానీ, నీటి కేటాయింపులని మాత్రం పెంచలేదు.
- శ్రీశైలం జలాశయం ద్వారా 800 అడుగుల వద్ద నుంచే నీటిని తీసుకునే విధంగా 2006లోనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన డిపిఆర్‌లో నివేదించాడు.[7]
- భూసేకరణ జరగక, అటవీ అనుమతులు పొందక, రైల్వే, రోడ్డు క్రాసింగులను సమన్వయం చేయక, అంతర రాష్ట్ర సమస్యలను పరిష్కరించక, కాంట్రాక్టు చేపట్టిన ఏజెన్సీల ఒప్పంద సమస్యలు, బిల్లుల చెల్లింపులు, కేంద్ర జల సంఘం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై నివేదికలు సమర్పించక, ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తిచేయక 2014 దాకా కూడా ఈ ప్రాజెక్టు పనులు 50% మాత్రమే పూర్తయ్యాయి. 2014 వరకు కల్వకుర్తి నుండి 13 వేల ఎకరాలకు నీరు అందింది.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును పరిశీలించగా, 2015 సెప్టెంబరు 28న కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులని 25 టిఎంసిలనుండి 40 టిఎంసిలకు పెంచుతూ జీవో నంబరు 141ని జారీ చేసింది.
- 2016లో ప్రభుత్వం 4,896.24 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని సవరించి, భూసేకరణకు 366.44 కోట్లు అంచనా విలువ చేశారు. భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 5 లక్షల రూపాయలని చెల్లించింది.
- ఆ తరువాత ప్రాజెక్టు మొత్తం ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు పెంచుతూ ప్రభుత్వం 2017 సెప్టెంబరు 1న జీవో జారీచేసింది.
- 2017 అక్టోబరు 15వ తేదీన రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు.
- ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మూడు దశాబ్దాలకు పైగా పట్టింది.[8]
ఆయకట్టు
మార్చుప్రాజెక్టును మొదట్లో 25 టీఎంసీల నీటి సామర్థ్యంగా డిజైన్ చేశారు. ఆ తర్వాత నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు 40 టీఎంసీలకు పెంచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీటిని అందిస్తుంది. కృష్ణానది నుండి నీటిని నదిమట్టం నుండి 300 మీటర్ల ఎత్తులో ఎత్తి రిజర్వాయర్‌లోకి పంపిణి చేస్తారు. 14 కి.మీ.ల మేర అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ ను విస్తరించనున్నారు. తద్వారా అచ్చంపేట మండలంలో 15,000 ఎకరాల (ఉప్పునూతల మండలంలో 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు) అదనపు ఆయకట్టుకు నీరు అందుతుంది.
కొల్లాపూర్ మండలం, ఎల్లూరు గ్రామ సమీపంలోని రేగుమానుగెడ్డ వద్ద శ్రీశైలం జలాశయం నుండి 3 స్టేజిల్లో 258 మీటర్ల ఎత్తుకు 4000 క్యూసెక్కుల నీరు పంపు చేయబడుతుంది. శ్రీశైలం జలాశయం నుండి అప్రోచ్ ఛానల్ ద్వారా మొదటి స్టేజీ పంప్ హౌజ్ సర్జి పూల్ లోనికి పంపుల ద్వారా 95 మీటర్ల ఎత్తులో సిస్టర్న్ కు చేరి అక్కడి నుంచి ఎల్లూరు బ్యాలెన్సింగ్ జలాశయానికి, అక్కడి నుండి వాలు కాలువ ద్వారా సింగోటం జలాశయానికి చేరుతాయి. ఈ తరువాత వాలు కాలువ, టన్నెల్ ద్వారా రెండో స్టేజీ పంపుహౌజ్ సర్జిపూల్ కి చేరి, స్టేజి 2 పంపు హౌజ్ నుండి పంపులు 86 మీటర్ల ఎత్తుకి నీటిని సిస్టర్న్ చేరవేస్తాయి. అక్కడినుండి జొన్నలబొగుడ జలాశయానికి నీరు చేరుతుంది. ఇక్కడి నుండి వాలు కాలువ, టన్నెల్ ద్వారా స్టేజీ 3 లిఫ్ట్ సర్జిపూల్‌కు చేరుతాయి. ఈ మధ్యలో రిడ్జ్ కాలువ ద్వారా 13 వేల ఎకరాలకు, ఎడమవైపున పసుపుల బ్రాంచి కాలువ ద్వారా 44 వేల ఎకరాలు, బుద్దారం ఎడమ కాలువ ద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించబడుతుంది. చివరగా 117 మీటర్ల ఎత్తున ఉన్న గుడిపల్లిగట్టు జలాశయానికి నీరు చేరుతుంది. ఇక్కడి నుండి ఎడమవైపున 160 కి మీ పొడవైన కల్వకుర్తి ప్రధాన కాలువ ద్వారా 1 లక్ష 80 వేల ఎకరాల ఆయకట్టుకు, కుడివైపున 80 కి మీ అచ్చంపేట ప్రధాన కాలువ ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించబడుతుంది.[9]
ఇక్కడి నుండి అర టీఎంసీ నీరు మార్కండేయ ఎత్తిపోతల పథకానికి పంపిణీ చేయబడుతుంది.
రిజర్వాయర్లు
మార్చుఆయకట్టుకు నీటి సరఫరా కోసం ఈ ప్రాజెక్టు కింద 20 టిఎంసి నీటి సామర్థ్యంతో దాదాపు 51 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ప్రతిపాదించబడ్డాయి. 2018లో బుద్దారం పెద్దవాగు సరస్సును రిజర్వాయర్‌గా మార్చాలని ప్రతిపాదిన వచ్చింది. ఈ రిజర్వాయర్‌తో వనపర్తి జిల్లా పరిధిలోని అన్ని ఎండిపోయిన భూములకు సాగునీరు అందనుంది.
వాటర్ లిఫ్టింగ్
మార్చుఈ ప్రాజెక్ట్‌లో మూడు లిఫ్టులు ఉన్నాయి. మొదటి లిఫ్ట్ ఎల్లూరు (కొల్లాపూర్ మండలం)లో, రెండవది జొన్నలబొగుడ (పెద్ద కొత్తపల్లి మండలం) గ్రామంలో, మూడవది గుడిపల్లి (నాగర్ కర్నూల్ మండలం) ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోసే నీటిని నిల్వ చేసేందుకు ఇంకా చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాల్వల ద్వారా నీటిని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాలలోని సరస్సులు నిండుతాయి.
పంపులు
మార్చులిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు, లిఫ్ట్–3లో ఐదు పంపులలో ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్‌లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు. లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది.[10]
ఇతర వివరాలు
మార్చువానాకాలంలో జలాశయం నీటి ఒత్తిడితో పంపుల షట్టర్లకు లీకేజీ ఏర్పడటం, ఇతరత్రా కారణాలతో పంపు హౌస్‌లోకి జలాలు ప్రవేశించి మునిగిపోతోంది. 2014 సెప్టెంబరులో, 2020 అక్టోబరులోనూ ఐదు పంపులున్న హౌస్ మొత్తం మునిగి పోయింది. దాంతో రెండు నెలలకుపైగా నీటి ఎత్తిపోతల నిలిచిపోయింది.[11] పంప్ హౌస్ లోని నీటిని డీ వాటరింగ్ చేయడానికి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుండి పెద్ద మోటర్లు, పైపులు తెప్పించి, నీటిని బయటికి పంపించారు.
మూలాలు
మార్చు- ↑ Purandare, Vidya; Bajaj, Dr.V.H. (2017-01-01). "Economic Appraisal of Lift Irrigation Schemes-Benefit Cost Ratio & Internal Rate of Return: Case Study of Mhaisal Lift Irrigation Scheme". IOSR Journal of Humanities and Social Science. 22 (01): 61–68. doi:10.9790/0837-2201056168. ISSN 2279-0845.
- ↑ "Eight projects caught in clearance maze - Times Of India". web.archive.org. 2012-09-15. Archived from the original on 2012-09-15. Retrieved 2022-06-18.
- ↑ India, The Hans (2018-02-23). "Buddaram Reservoir to be a reality soon". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-18.
- ↑ Harish Rao goes on whirlwind tour of Nagarkurnool, Wanaparthy
- ↑ Modernisation of three canals in erstwhile Nalgonda by December
- ↑ IANS (2018-04-17). "ABB deploys high-capacity motors for Telangana irrigation project". Business Standard India. Retrieved 2022-06-18.
- ↑ Punnam, Venkatesh (2021-12-19). "'కల్వకుర్తి'లో కొత్తదేం లేదు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Retrieved 2022-06-18.
- ↑ "Telangana: Harish Rao vows to ensure water to 20 lakh acres". web.archive.org. 2018-03-29. Archived from the original on 2018-03-29. Retrieved 2022-06-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ దేశ్ పాండే, శ్రీధర్ రావు (2017-11-02). "కల్వకుర్తి ఎత్తిపోతల పథకం". తెలంగాణ. Archived from the original on 2021-06-17. Retrieved 2022-06-21.
- ↑ "'కల్వకుర్తి' చివరి పంపు రెడీ". Sakshi. 2018-08-20. Retrieved 2022-06-18.
- ↑ "కల్వకుర్తి ఎత్తిపోతలకు బైపాస్ కాల్వ". ETV Bharat News. Retrieved 2022-06-18.