మాయలోడు

1993 సినిమా

మాయలోడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1993 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి 1993 లో కుటుంబ సమేతంగా కలిసి చూడదగిన చిత్రంగా నంది పురస్కారం లభించింది.

మాయలోడు
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు
తారాగణంరాజేంద్రప్రసాద్,
సౌందర్య
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993[1]
భాషతెలుగు

అప్పలకొండ అనే వ్యక్తి ఆస్తిపరులైన తన చెల్లెలు కుటుంబాన్ని చంపి వాళ్ళ ఆస్థిని స్వాధీనం చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. అప్పలకొండ దాడిలో అతని చెల్లెలు, బావ చనిపోయినా, అతని మేనకోడలు చిన్నపాప మాత్రం అతన్నుంచి తప్పించుకుని పారిపోతుంది. వీరబాబు గారడీ చేసుకుని జీవితం వెళ్లబుచ్చుతూ ఉంటాడు. అతనికి గుండు అనే స్నేహితుడు, ఓ బామ్మ (నిర్మలమ్మ) తోడుగా ఉంటారు. తప్పించుకువచ్చిన అప్పలకొండ మేనకోడలు వీరబాబు చెంతకు చేరుతుంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న వీరబాబు ఆమెను తన దగ్గర ఉంచుకుని పోషిస్తుంటాడు. పాప కోరిక మేరకు ఆమెకు గారడీ నేర్పిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చూపు కోల్పోతుంది. తిరిగి ఆమెకు చూపు తెప్పించడానికి కొంత సొమ్ము అవసరమవుతుందని డాక్టరు చెబుతాడు. అందుకోసం తన ఖర్చులు తగ్గించుకుని ఆమె శస్త్రచికిత్స కోసం పైసా పైసా కూడబెట్టి పద్మనాభం దగ్గర దాచి పెడుతుంటాడు. పద్మనాభం కూతురు సిరి, అల్లరిపిల్ల. తన స్నేహితులని వెంటేసుకుని తిరుగుతూ అందరినీ ఆట పట్టిస్తుంటుంది. వీరబాబును కూడా ఒకసారి అలా ఆటపట్టిస్తుంది. కానీ అతని మంచి మనసు తెలుసుకుని అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.

తప్పి పోయిన పాప వీరబాబు ఇంట్లో ఉందని తెలుసుకున్న అప్పలకొండ ఆమెను తనకు అప్పగించమని కోరతాడు. దానికి వారు అంగీకరించకపోవడంతో వీరబాబు మీద కక్ష కడతాడు. పాప ఆపరేషన్ కోసం అనుకున్నంత ధనం సమకూరడంతో దానిని తీసుకోవడం కోసం పద్మనాభం దగ్గరికి వెళతాడు వీరబాబు. తన కూతురు వీరబాబును ప్రేమిస్తుందని ముందే తెలుసుకున్న ఆయన తన కూతురు అతన్ని మరిచిపోయేదాకా డబ్బులు ఇవ్వనని నిరాకరిస్తాడు. వీరబాబు కోపంతో ఆయన నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో బెదిరించి కూర్చీకి కట్టేసి తన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. చాటునుంచి ఇదంతా గమనిస్తున్న అప్పలకొండ ఆ మిగతా డబ్బును కూడా కాజేసి కత్తితో పద్మనాభాన్ని హత్య చేసి ఆ నేరాన్ని వీరబాబు మీద వేస్తాడు. వీరబాబు జైలుకి వెళతాడు. పాపకు ఆపరేషన్ ఆగిపోతుంది. కానీ పాపను జాగ్రత్తగా ఒక చోట దాచిపెడతాడు. ఈలోగా అప్పలకొండ తన రౌడీలని పంపించి పాపను చంపించాలని చూస్తాడు. కానీ వీరబాబు తన మాయలతో వారిని అడ్డుకుంటాడు. చివరికి వీరబాబు అప్పలకొండని తన ఇంద్రజాలంతో ముప్పుతిప్పలు పెట్టించి అతని చేత న్యాయస్థానంలో నిజం చెప్పించి నిర్దోషిగా విడుదలవుతాడు. పాపకు కూడా ఆపరేషన్ పూర్తై కంటి చూపు తిరిగి వస్తుంది.

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

దర్శకుడిగా ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి రెండవ చిత్రం. మొదటి సినిమా రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలే నాయకా నాయికలు. ఎస్. వి. కృష్ణారెడ్డి అప్పుడప్పుడే కథానాయికగా ఎదుగుతున్న సౌందర్యతో హాస్యనటుడైన బాబు మోహన్ తో జత కట్టించి చినుకు చినుకు అందెలతో అనే పాటకు నృత్యం చేయించాడు. నిజానికి ఈ పాట రాజేంద్రప్రసాద్ తోనే చిత్రీకరించాల్సి ఉన్నా రాజేంద్రప్రసాద్ డేట్స్ కుదరక బాబూమోహన్ తో చిత్రీకరించారు.[2] ఇదే పాటను మళ్ళీ 1994లో శుభలగ్నం సినిమాలో ఆలీ, సౌందర్యలతో చిత్రీకరించారు.[3]

విడుదల, ఫలితం

మార్చు

1993 లో విడుదలైన చిత్రం కొన్ని కేంద్రాల్లో 100, 175 రోజులు పూర్తి చేసుకున్నది. హైదరాబాదులోని శ్రీనివాస థియేటర్ లో రోజుకు నాలుగు ఆటల చొప్పున 252 రోజులు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రం ఇదే.[3]

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటకు ఆకాష్ ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.

  • నీ మాయలోడిని నేనే ,రచన: గూడురు విశ్వనాథ శాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడి రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చలాకి చిలిపి ,రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చూ మంత్ర ఖాళీ , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఉడతా ఉడతా, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు
  1. "Mayalodu (1993)". Indiancine.ma. Archived from the original on 2020-02-01. Retrieved 2020-02-01.
  2. "SV Krishna Reddy: రాజేంద్రప్రసాద్‌ చేయనన్న సాంగ్‌... అలా బాబూమోహన్‌తో చేశారు". EENADU. Retrieved 2024-02-05.
  3. 3.0 3.1 arun (2018-11-24). "మన మనసుకి మాయ చేసే " మాయలోడు "!". www.hmtvlive.com. Archived from the original on 2020-02-03. Retrieved 2020-02-03.
"https://te.wikipedia.org/w/index.php?title=మాయలోడు&oldid=4373286" నుండి వెలికితీశారు