మార్తాండ దేవాలయం

(మార్తాండ సూర్య దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

మార్తాండ దేవాలయం కాశ్మీర్‌లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం. ఇది కాశ్మీర్‌ లోయలో అనంతనాగ్‌ పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉంది. సూర్య భగవానునికి అంకితమివ్వబడిన ఈ మార్తాండ దేవాలయాన్ని సా.శ. 8 వ శతాబ్దిలో కాశ్మీర రాజు 'లలితాదిత్య ముక్తాపీడుడు' నిర్మించాడు. కాశ్మీరీ వాస్తుకళకు మచ్చుతునకగా వున్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి, అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది.

మార్తాండ సూర్య దేవాలయం
మార్తాండ సూర్య దేవాలయం లోని ప్రధాన కేంద్ర ఆలయం
పేరు
ఇతర పేర్లు:మార్తాండ దేవాలయం
మార్తాండేశ్వర మందిరం
స్థానిక పేరు:మార్తాండ మందిరం
మార్తాండ తీర్థం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:జమ్మూ, కాశ్మీర్
జిల్లా:అనంతనాగ్
ప్రదేశం:అనంతనాగ్
ఎత్తు:1,720 మీ. (5,643 అ.)
భౌగోళికాంశాలు:33°44′44″N 75°13′13″E / 33.74556°N 75.22028°E / 33.74556; 75.22028
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మార్తాండ (సూర్యుడు)
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
సా.శ. 8 వ శతాబ్దం
నిర్మాత:లలితాదిత్య ముక్తాపీడుడు

ఉనికి

మార్చు

మార్తాండ ఆలయం జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్‌ పట్టణానికి తూర్పున 9 కి. మీ. దూరంలో కాశ్మీర్ లోయలో ఒక ఎత్తైన పర్వత పీఠభూమిపై నిర్మించబడింది. సముద్రమట్టం నుండి సుమారు 1720 మీటర్ల ఎత్తులో వున్న ఈ పీఠభూమిపై నుంచి చూస్తే కాశ్మీర్‌లోయ ఆసాంతం కనిపిస్తుంది. శ్రీనగర్‌ నుంచి ఈ ఆలయం ఆగ్నేయదిశలో 65 కి.మీ. దూరంలో ఉంది.

చరిత్ర

మార్చు
 
1868 లో జాన్ బర్కీ అనే బ్రిటీషర్ తీసిన ఫోటో:మార్తాండ ఆలయ శిథిలాలు

కాశ్మీరును పరిపాలించిన కార్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు అయిన లలితాదిత్య ముక్తాపీడుడు సా.శ. 8 వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు.[1][2] సా.శ. 725-756 సంవత్సరాల మధ్యకాలంలో ఆ ఆలయం నిర్మాణం పూర్తి అయివుండవచ్చు.[3]

కల్హణుడు తన చారిత్రిక గ్రంథం 'రాజ తరంగిణి'లో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడనే తెలిపాడు. అయితే పురావస్తు పండితులు దీనిపై విభేదిస్తున్నారు. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్ హోం ఈ ఆలయం కాశ్మీరును పాలించిన గోనంద్య వంశస్తుడైన 'ఆర్యరాజు' నిర్మించాడని, తరువాతి కాలంలో రాజా రణదిత్య, అతని రాణి అమరప్రభ ఇరువురూ దానికి ఉత్తర, దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారని పేర్కొన్నాడు.[4] ఈ ఆలయానికి పునాది సా.శ. 370-500 సంవత్సరాల మధ్య వేసివుండవచ్చని, ఆలయ నిర్మాణం రాజు రణదిత్య (Ranaditya) తో ప్రారంభమై ఉండవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.[5][6] తదనంతర కాలంలో కార్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపీడుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, 84 వరుస స్తంభాలతో కూడిన ప్రాంగణాన్ని నిర్మించి ఉండవచ్చు.[4] ఏది ఏమైనప్పటికి మార్తాండ సూర్య దేవాలయ నిర్మాతగా లలితాదిత్య ముక్తాపీడుని పేరే ఎక్కువ ప్రచులితంగా ఉంది.

కలశుడు (సా.శ. 1063-88) వంటి కాశ్మీర్ హిందూ రాజులు సైతం ఈ ఆలయ సంపదను దోపిడీ చేసారు.[4] అయినప్పటికీ ఆలయాన్ని ధ్వంసం చేయలేదు. షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ (సికిందర్ బుత్షికాన్) ఆదేశాల మేరకు సా.శ. 15 వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు. ఈ ఆలయ విధ్వంసం ఒక సంవత్సరం పాటు కొనసాగింది.[7][8]

వాస్తు నిర్మాణం

మార్చు
 
1870-73 లో J. Duguid చే పునరుద్ధరించబడిన మార్తాండ సూర్య దేవాలయ నమూనా చిత్రం
 
మార్తాండ దేవాలయ ప్రవేశ ద్వారం
 
మార్తాండ దేవాలయ ప్రాంగణం

సా.శ. 8 వ శతాబ్దంలో నిర్మించబడిన మార్తాండ దేవాలయం కాశ్మీరీ వాస్తుకళకు చక్కని ఉదాహరణగా నిలిచిపోతుంది. దీని వాస్తు నిర్మాణ శైలిలో గాంధార, గుప్తుల, చైనీయుల, రోమన్, సిరియన్-బైజాంటిన్, గ్రీకుల వాస్తు నిర్మాణ శైలులు మేళవించాయి.[9][10] ఈ ఆలయం భారీ నిర్మాణానికి, హుందాతనానికి పేరెన్నికగన్నది. ఈ ఆలయం భారీ స్థాయి దీర్ఘ చతురస్రాకారపు సున్నపు రాళ్ళతో నిర్మితమైంది. నీలిరంగు భారీ సున్నపురాళ్ల (Blue Limestone) దిమ్మలను [4] మోర్టార్‌తోను, ఇనుప బోల్టులతోను అనుసంధానిస్తూ జరిగిన ఈ ఆలయ నిర్మాణం భారీ చుట్టుకొలతలకు, సాంకేతిక నిర్మాణ ప్రతిభకు, అద్భుత శిల్పకళకు, అలంకార శిల్పాలకు ప్రసిద్ధి పొందింది.

మార్తాండ సూర్య దేవాలయం, 84 వరుస స్తంభాలతో కూడివున్న ఒక విశాల ప్రాంగణాన్ని (colonnaded courtyard) దాని మధ్యలో ఒక ప్రధాన కేంద్ర ఆలయాన్ని కలిగివుంది.

  • ప్రవేశ ద్వారం (Entrance లేదా Gateway) : చతురస్త్రం (Quadrangle) గా వున్న ఆలయ ప్రాంగణానికి పశ్చిమ దిశలో మధ్యభాగంలో ప్రవేశ ద్వారం ఉంది. దీని వెడల్పు కూడా ప్రధాన కేంద్ర ఆలయం వెడల్పు మాదిరిగానే వుండటంతో ప్రవేశ మార్గం భారీ నిర్మాణంగా హుందాతనంతో కనిపిస్తుంది. విస్తారమైన అలంకరణలతో కూడి వున్న ఈ ప్రధాన ప్రవేశ ద్వారం సందర్శకులకు స్వాగతచిహ్నంగా వుండేది.
  • ప్రాంగణం (Courtyard) : ఈ ఆలయం యొక్క ప్రాంగణం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పుతో సువిశాలంగా ఉంది. ఈ ప్రాంగణం అంచులలో 84 వరుస స్తంభాలు ప్రాంగణం వైపుగా నిలబెట్టబడి ఉన్నాయి.
  • ప్రధాన కేంద్ర ఆలయం (Central Shrine) : ఇది ప్రాంగణం మధ్యలో నెలకొని ఉంది. దీని పొడవు 63 అడుగులు, వెడల్పు 36 అడుగులు. ఒక సమతల పీఠభూమిపై నిర్మితమై వుండటంవల్ల, మార్తాండ సూర్య దేవాలయం నుండి ఎటువైపు చూసినా ఈ ప్రధాన కేంద్ర ఆలయం కనిపిస్తుంది. కాశ్మీరీ ఆలయాలకు సాధారణంగా ఉన్నట్లే, ఈ ప్రధాన కేంద్ర ఆలయానికి కూడా పిరమిడ్ ఆకారపు గోపురం ఉండివుండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి ప్రస్తుతం పైకప్పు (roof) లేదు. గర్భగుడికి దారితీసే ముందుగది గోడలపై సూర్యుని శిల్పాలతో పాటు విష్ణు శిల్పాలు, గంగ, యమున వంటి నదీ దేవతల శిల్పాలు, ఎగురుతున్న గంధర్వుల శిల్పాలు అలంకరించబడి ఉన్నాయి. విష్ణు విగ్రహం 3 తలలతో, 8 చేతులతో ఉంది.[4] ఆలయ విధ్వంసం వలన విగ్రహాల రూపం వికృతం చేయబడి వాటిని గుర్తుపట్టడం కష్టంగా వుంటుంది.
  • గర్భగృహం: ఇది 18 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పును కలిగివుంది. సూర్యుని విగ్రహం ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించబడినదని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయానికి మూడు వైపులా 3 ద్వారాలు (Gates) ఉన్నాయి. ఈ మూడు విభిన్న ద్వారాల నుండి ప్రధాన కేంద్ర ఆలయానికి (Central Shrine) చేరుకోవడానికి నిర్మించబడిన దారులు కచ్చితంగా ఒకే చోట కలుసుకోవడం ఆనాటి సాంకేతిక నిర్మాణ ప్రతిభకు నిదర్శనం.
  • స్తంభపంక్తి (Peristyle) : ఆలయ ప్రాంగణం చుట్టూ నాలుగు దిక్కులలో వరుస స్తంభాలతో కూడిన ఒక నడవా నిర్మించబడింది. ఇది అవంతీపూర్ ఆలయాల నమూనాలో ఉంది. ఆలయానికి చుట్టూ నలుదిశలా వున్న ఈ పెరిస్టైల్స్ నిర్మాణం గ్రీకో-రోమన్ వాస్తుశైలిని పోలివుంది.
  • ఆలయ బాహ్య సరిహద్దు (Outer periphery) : 270 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో వున్న ఆలయ వెలుపలి సరిహద్దు మూడు ద్వారాలను కలిగివుంది.

దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే, కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కోణార్క్ లోని సూర్య దేవాలయంలో గర్భగుడి తూర్పు దిశ వైపుగా (East Face) వుండటం చేత, సూర్యుని ఉదయకిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి. కాని కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడి పశ్చిమ దిశ వైపున (West Face) వుండటం వలన గర్భగుడిలో సూర్యాస్తమయకిరణాలు ప్రసరిస్తాయి.[4]

ప్రధాన కేంద్ర ఆలయం ముందు భాగం నుండి వీక్షించబడిన ఆలయ ప్రాంగణం, శిధిలాలు, ప్రవేశ ద్వారం దృశ్యం
 
మార్తాండ ఆలయ ప్రవేశ ద్వారంనకు దారితీసే మార్గం

ప్రస్తుత స్థితి

మార్చు

ఒకప్పుడు వైభవోపితమైన మార్తాండ సూర్య దేవాలయం విధ్వంసకాండకు గురికావడంతో శిథిలాలు మాత్రమే నేటికి మిగిలాయి. గుర్తు పట్టలేనంతగా వికృతం చేయబడిన, చెక్కివేయబడిన, ముక్కలు చేయబడిన శిల్పాలు మాత్రమే గతకాలపు స్మృతి చిహ్నాలుగా మిగిలాయి. కాలక్రమేణా విస్మృతికి లోనైన మార్తాండ సూర్య దేవాలయ శిథిలాలను 1869 లో బ్రిటీష్ అర్కియాలజిస్ట్‌లు తిరిగి కనుగొన్నారు.[4] ఆర్కియాలజికల్ సర్వీ అఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించారు.[11] కేంద్ర రక్షిత కట్టడాల జాబితాలో ఈ ఆలయం పేరు కనిపిస్తుంది.[12] భారత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది.

ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'హైదర్‌' (2014) లో మార్తాండ ఆలయం నేపథ్యంగా బిస్మిల్ పాటను చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో ఈ ఆలయం దుష్ట ప్రదేశం (Place of evil) గా చూపబడటంతో చిత్రంపై వివాదం చెలరేగింది.[13] అనుపమ్ ఖేర్ దర్శకుడు పవిత్ర మందిరంలో దయ్యాల నృత్య సన్నివేశాలను చిత్రీకరించడం ద్వారా దర్శకుడు విశాల్ భరద్వాజ్ కాశ్మీరీ పండిట్లను అవమానించినందుకు విమర్శించాడు.[14]

చిత్రమాలిక

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Animals in stone: Indian mammals sculptured through time By Alexandra Anna Enrica van der Geer. pp. Ixx.
  2. India-Pakistan Relations with Special Reference to Kashmir By Kulwant Rai Gupta. p. 35.
  3. The Early Wooden Temples of Chamba. pp. 50, 66.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Somen, Sengupta (2014-01-05). "Temple of ruins" (PDF). The Hindusthan times. Retrieved 8 July 2017.
  5. "Tourist places in south Kashmir". alpineinpahalgam.com. Archived from the original on 7 ఫిబ్రవరి 2013. Retrieved 8 July 2012.
  6. "Martand House of Pandavs". Search Kashmir. Retrieved 11 July 2012.
  7. Hindu temples were felled to the ground and for one year a large establishment was maintained for the demolition of the grand Martand temple. But when the massive masonry resisted all efforts, it was set on fire and the noble buildings cruelly defaced.-Firishta, Muhammad Qãsim Hindû Shãh; John Briggs (East India Company officer)|John Briggs (translator) (1829–1981 Reprint). Tãrîkh-i-Firishta (History of the Rise of the Mahomedan Power in India). New Delhi
  8. India: A History. Revised and Updated By John Keay.
  9. Al-Hind, the Making of the Indo-Islamic World, Volume 1 By André Wink. 1991. pp. 250–51.
  10. Arts Of India By Krishna Chaitanya. p. 7.
  11. "Archaeological survey of India protected monuments". heritageofkashmir.org. Archived from the original on 19 సెప్టెంబరు 2012. Retrieved 11 August 2012.
  12. "Protected monuments in Jammu & Kashmir". asi.nic.in, Archaeological surey of india. Archived from the original on 7 మే 2012. Retrieved 29 October 2012.
  13. https://storify.com/kohl_nick/the-haider-controversy-1
  14. "After awards, war of words over Haider". Archived from the original on 2015-05-18. Retrieved 2017-07-09.