మిస్టర్ పర్‌ఫెక్ట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన కుటుంబ కథాచిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్.[1] జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, నాజర్, మాగంటి మురళీమోహన్, కె.విశ్వనాథ్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.

మిస్టర్ పర్‌ఫెక్ట్
(2011 తెలుగు సినిమా)
Mr Perfect poster.jpg
దర్శకత్వం కొండపల్లి దశరథ్
నిర్మాణం దిల్ రాజు
కథ కొండపల్లి దశరథ్
చిత్రానువాదం హరి
తారాగణం ప్రభాస్
కాజల్ అగర్వాల్
తాప్సీ
ప్రకాష్ రాజ్
నాజర్
మాగంటి మురళీమోహన్
సాయాజీ షిండే
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం విజయ్ కే చక్రవర్తి
కూర్పు మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 21 ఏప్రిల్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

విక్కీ (ప్రభాస్) ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఒక గేమింగ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్. జీవితంలో ఏదైనా సాధించాలంటే రాజీపడకూడదని నమ్మే విక్కీకి ఎన్ని సార్లు తన తండ్రి (నాజర్) నచ్చజెప్పినా తన తండ్రి సలహాలను పెడచెవిన పెడుతుంటాడు. ఇంతలో ఒక రోజు ఇండియాలో తన తల్లిదండ్రులు తన తండ్రి స్నేహితుడి (మాగంటి మురళీమోహన్) కూతురు, తన చిన్ననాటి "శత్రువు" ఐన ప్రియ (కాజల్ అగర్వాల్)కు పెళ్ళిచేయాలని నిశ్చయించుకుంటారు. ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల మొదట ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ తర్వాత నచ్చితే పెళ్ళి చేసుకుంటామని చెప్తారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు.

విక్కీ, ప్రియ ఇద్దరూ వేరు వేరు మనస్తత్వాలు కలవారు. విక్కీ ఆధునిక జీవితాన్ని గడపాలనుకునే ఒక గేమింగ్ సాఫ్ట్వేర్ ప్రోఫెషనల్. ప్రియ సాంప్రదాయకంగా ఉండే ఒక డాక్టర్. ముఖ్యంగా తన వాళ్ళకోసం రాజీపడటం ప్రియకు ఇష్టమే కానీ విక్కీకి మాత్రం రాజీపడటమంటే ఇబ్బందే. కనుక మొదట్లో వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువౌతాయి. కానీ తర్వాత ప్రియ తన తండ్రి సలహా మీద విక్కీతో స్నేహంగా ఉంటుంది. అప్పటి దాకా తనతో గడపడం ఇష్టపడని విక్కీ నాటినుంచీ ప్రియతో స్నేహంగా ఉంటాడు. ఇక దాదాపుగా విక్కీ ప్రియతో తన పెళ్ళికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. కానీ తనకోసం ప్రియ తన ఇష్టాలన్నీ మార్చుకోవడం, తనకు ఇష్టమైనవన్నీ విక్కీ వల్ల వదులుకోవడం చూసి విక్కీ ఆందోళనకు గురౌతాడు. తనవల్ల ప్రియ తన అందమైన జీవితాన్ని కోల్పోతుందని, అది తనకి ఇష్టం లేదని, అందుకే ప్రియ తనకి కరెక్ట్ కాదని చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాడు. అప్పటికే విక్కీని గాఢంగా ప్రేమిస్తున్న ప్రియ ఈ మాటలను విని తీవ్రమైన బాధకు గురౌతుంది.

ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత విక్కీ క్యాడ్బరీ కంపెనీ వాళ్ళ ఒక కాంపిటీషన్ ద్వారా మ్యాగీ (తాప్సీ) ని కలుస్తాడు. ఇద్దరి ఆలోచన ఒకటే. ఇద్దరూ రాజీపడేందుకు ఇష్టపడరు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించాక పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ దీనికి మ్యాగీ తండ్రి (ప్రకాష్ రాజ్) ఒప్పుకోడు. విక్కీ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన మ్యాగీ తండ్రి ఒక షరతు పెడతాడు. ఆ షరతు ప్రకారం విక్కీ రాబోయే 4 రోజుల పాటు మ్యాగీ ఇంట్లో తన అక్క పెళ్ళికి అతిథిగా రావాలి. అక్కడ మ్యాగీ బంధువుల్లో ఏ ఇద్దరికైనా విక్కీ మ్యాగీకి సరైన జోడీ అని భావిస్తే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. కానీ ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విక్కీ పెళ్ళి మ్యాగీతొ జరగదు. విక్కీ దీనికి ఒప్పుకుంటాడు.

ఇండియా నుంచి ఆడ, మగ పెళ్ళి వాళ్ళ బంధువులు ఆస్ట్రేలియాకి వస్తారు. అదే పెళ్ళికి తన తండ్రి సలహా మీద ప్రియ ఆ పెళ్ళికి వెళ్తుంది. పెళ్ళికొడుకు ప్రియకి బావ అని తెలిసాక విక్కీ ప్రియతో తన సమస్య గురించి చెప్తాడు. విక్కీ తనలాగే ప్రేమలో ఓడిపోవడం ఇష్టంలేని ప్రియ తనకి సహాయం చేస్తుంది. ప్రియ వల్ల ఆ ఇంట్లో అందరి మనసులనూ గెలుచుకున్న విక్కీ తనకు తెలియకుండానే రాజీపడటానికి అలవాటు పడతాడు. మ్యాగీ చెప్పే దాకా తనలోని ఈ మార్పును విక్కీ గమనించడు. ఇంతలో ప్రియ విక్కీ చాలెంజ్ గెలిచిన రాత్రి ఇండియాకి బయలుదేరుతుంది. ఇది తెలిసి బాధపడుతున్న విక్కీకి ప్రియ విక్కీని ప్రేమిస్తున్నట్టు పంపిన ఎం.ఎం.ఎస్. సందేశం తన బాధను రెట్టింపు చేస్తుంది.

తనలోని లోపాలను పట్టించుకోకుండా ప్రియ తనని ప్రేమించిందని తెలుసుకున్నాక విక్కీకి ప్రియని కాదని తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అలాగే తన తండ్రి చెప్పినట్టు మన వాళ్ళకోసం రాజీపడాల్సిన అవసరాన్ని తెలుసుకుంటాడు. ఇంతలో మ్యాగీ తండ్రి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ విక్కీ-మ్యాగీల పెళ్ళికి ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత విక్కీ మ్యాగీకీ, తన పూర్తి కుటుంబానికీ, తన-ప్రియల కథను చెప్తాడు. విక్కీ వల్ల తను కూడా తన తండ్రిని బాధపెట్టిన విషయాన్ని గమనించిన మ్యాగీ తన ప్రవర్తనను మార్చుకుంటుంది. ఎలాగైనా ప్రియను సొంతం చేసుకోవాలని ఇండియాకి వచ్చిన విక్కీ ప్రియకు ఎన్నో రకాలుగా తన ప్రేమను తెలియచేసే ప్రయత్నం చేస్తాడు. మొదట్లో బాగా ఇబ్బంది పెట్టినా, చివరికి ప్రియ తనతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. "కెరియర్లో గెలవాలంటే రాజీపడకుండా కష్టపడాలి. అప్పుడే గెలుస్తాం. కానీ బంధాల్లో కొన్నిసార్లు రాజీపడితేనే గెలుస్తాం." అని విక్కీ చెప్పే మాటలతో ఈ సినిమా ముగుస్తుంది.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Mr Perfect Telugu Movie (2011), Mr Perfect Movie Review, Mr Perfect Movie Release Date, Trailer, Rating". Altiusdirectory.com. Archived from the original on 8 అక్టోబర్ 2011. Retrieved 4 August 2012. {{cite web}}: Check date values in: |archive-date= (help)

బయటి లింకులుసవరించు