నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా I

(మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికీ బయాఫాండి నుండి దారిమార్పు చెందింది)

మీర్ కమర్-ఉద్-దీన్ ఖాన్ సిద్దికీ బయాఫాండి ( 1671 ఆగస్టు 20 - 1748 జూన్ 1) భారతీయ, మధ్య ఆసియా తుర్కిక్ సంతతికి చెందిన కులీన వ్యక్తి. [1] ఇతడు అసఫ్ జాహి వంశ స్థాపకుడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించి, 1724 నుండి 1748 వరకు పరిపాలించాడు. [2] [3] అతన్ని చిన్ కిలిచ్ ఖాన్ అని కూడా అంటారు (ఔరంగజేబు 1690-91 లో ప్రదానం చేసిన బిరుదు [4] ). నిజాం ఉల్ ముల్క్ (ఫరుఖ్‌సియార్ 1713 లో ఇచ్చిన బిరుదు[5] ) అనీ, అసఫ్‌జా అనీ (ముహమ్మద్ షా 1725 లో [6]) కూడా అంటారు.

మీర్ కమర్-ఫ్లై-దిన్ ఖాన్ సిద్దిఖీ, అసఫ్ జా 1

పూర్వీకులు

మార్చు

నిజాం-ఉల్-ముల్క్ మొదటి రషీదున్ ఖలీఫ్ అయిన అబూ బకర్కు ప్రత్యక్ష వారసుడు. నిజాం-ఉల్-ముల్క్ ముత్తాత ఆలం షేక్, బుఖారా (ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లో ఉంది) కు చెందిన సూఫీ సాధువు. అతని తాత కిలిచ్ ఖాన్ ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లోని సమర్కాండ్‌కు చెందినవాడు. [7] 1654 లో ఖాన్, మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో హజ్ యాత్రకు వెళ్తూ మొదటిసారి భారతదేశానికి వచ్చాడు. తీర్థయాత్ర పూర్తి చేసిన తర్వాత, అతను భారతదేశానికి వలస వచ్చి, 1657 లో దక్కనులో ఔరంగజేబు సైన్యంలో చేరాడు. [8] సమూగఢ‌ యుద్ధంలో ఖాన్ పాల్గొన్నాడు. ఔరంగజేబు సోదరుడు దారా షికో ఓడిపోవడంతో ఆ యుద్ధం ముగిసింది. [9] ఔరంగజేబు సైన్యంలో కమాండర్‌గా ఉండటంతో పాటు, అతను జాఫరాబాద్ (ప్రస్తుత బీదర్) గవర్నర్‌గా కూడా పనిచేశాడు. [10] ఖాన్ పెద్ద కుమారుడు, నిజాం-ఉల్-ముల్క్ తండ్రి అయిన ఫిరోజ్ జంగ్. [11] జంగ్ 1669 లో భారతదేశానికి వలస వచ్చి. ఔరంగజేబు సైన్యంలో ఉద్యోగం పొందాడు. [12]

జీవితం తొలి నాళ్ళు

మార్చు

నిజాం-ఉల్-ముల్క్ 1671 ఆగస్టు 11 న ఫిరోజ్ జంగ్‌కు, అతని మొదటి భార్య సఫియా ఖానూమ్ దంపతులకు జన్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతడికి కమ్రుద్దీన్ ఖాన్ అని పేరు పెట్టాడు. [13] [14] అతని జన్మస్థలం గురించిన ఆధారాలు లేవు. అయితే, నిజాం ఉల్ ముల్క్ ఆగ్రాలో జన్మించాడని యూసఫ్ హుస్సేన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. [14]

ఆరేళ్ల వయసులో, నిజాం-ఉల్- ముల్క్‌కు ఒక మన్సాబ్ లభించింది. తన యవ్వనంలో, నిజాం-ఉల్-ముల్క్ తన తండ్రితో కలిసి సైనిక యాత్రలకు వెళ్లేవాడు. 1684 లో తన తండ్రితో కలిసి పూణేకు చేసిన దండయాత్రలో రాణించినపుడు, నిజాం-ఉల్-ముల్క్ కు 400 జాట్లు, 100 గుర్రాల ర్యాంకును అందుకున్నాడు. [14] 1688 లో, అతను తన తండ్రి నాయకత్వంలో ఆదోని కోట ముట్టడిలో పాల్గొన్నాడు. ఆ ముట్టడిలో అతడు నిర్వహించిన పాత్రకు గాను ఔరంగజేబ్ అతడి ర్యాంకును 2,000 జాట్లు, 500 గుర్రాలకు పెంచాడు. రెండు సంవత్సరాల తరువాత, అతనికి చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు లభించింది. చక్రవర్తి అతనికి ఒక ఏనుగును కూడా కానుకగా ఇచ్చాడు. 1693 లో మరాఠాలు పన్హాలా కోటను ముట్టడించారు. ప్రతిస్పందనగా, నిజాం-ఉల్-ముల్క్ కరాడ్ వద్ద మరాఠాలతో పోరాడి ఓడించాడు. 30 మరాఠాలను ఖైదీలుగా పట్టున్నాడు. [15] 1698 లో, ఔరంగజేబు నిజాం-ఉల్-ముల్క్‌ను బీజాపూర్ సమీపంలోని నాగోరి వద్ద తిరుగుబాటును అణచి చేయడానికి పంపాడు. చక్రవర్తి అతడి దండయాత్రతో సంతృప్తి చెందాడు. తరువాత కోతాలో పరిస్థితిని చక్కబరచడానికి పంపాడు. అక్కడ విజయం తరువాత, అతను 3,000 జాట్లు, 500 గుర్రాల ర్యాంకుకు ఎదిగాడు. 1699 లో ఔరంగజేబు అతన్ని 3,500 జాట్లు 3,000 గుర్రాలకు పదోన్నతి ఇచ్చాడు. నిజాం-ఉల్-ముల్క్ మరాఠాలు ఆక్రమించిన పన్హాలా కోటను విజయవంతంగా ముట్టడించి, అన్ని రహదారులను మూసివేసాడు. లోపలున్న వారికి ఎటువంటి సరఫరాలు చేరలేదు. [15] 1700 జూన్ 9 న ఈ కోట అతని బలగాలకు పడిపోయింది. అతని సేవలతో సంతృప్తి చెందిన ఔరంగజేబ్ అతన్ని బీజాపూర్ ఫౌజ్దార్ (గారిసన్ కమాండర్) గా చేసాడు. అతని ర్యాంకును 400 గుర్రాలతో పెంచాడు. [16] నిజాం-ఉల్-ముల్క్ 1702 లో బీజాపూర్ సుబాదార్ (గవర్నర్) అయ్యాడు. అదే సంవత్సరంలో, అతను ఆజంనగర్, బెల్గాంలకు కూడా పౌజుదారయ్యాడు. 1704 లో నుస్రతాబాద్, ముద్గల్ లకు ఫౌజ్దారయ్యాడు. [16]

1705 లో, నిజాం-ఉల్-ముల్క్ ఔరంగజేబుతో కలిసి వాకింఖెరా ముట్టడిలో పాల్గొన్నాడు. లాల్ టిక్రీ కొండపై నిజాం-ఉల్-ముల్క్ దాడికి నాయకత్వం వహించాడు. [17] లోపలున్న నివాసులకు సామాగ్రిని అందించడానికి ప్రయత్నిస్తున్న మరాఠాలపై దాడి చేశాడు. చివరికి మరాఠాలు ఓడిపోయారు. ముట్టడిలో అతని పోరాటానికి గాను నిజాం-ఉల్-ముల్క్ 5,000 జాట్లు 5,000 గుర్రాల ర్యాంకుకు ఎదిగాడు. ఒక రత్నఖచిత ఖడ్గాన్ని, ఒక ఏనుగునూ కానుకగా పొందాడు. [18]

ఔరంగజేబు తరువాత

మార్చు

ఔరంగజేబు మరణం తరువాత అతన్ని ఔధ్ గవర్నరు‌గా నియమించారు. బహదూర్ షా మరణం తరువాత అతను ఢిల్లీలో ఒక ప్రైవేట్ జీవితాన్ని ఎంచుకున్నాడు. 1712 లో ఔరంగజేబు వారసుల్లో ఆరవ వాడైనఫరుఖ్‌సియార్ కుమారుడు అజీముష్షాన్ డెక్కన్లో రాజప్రతినిధి పదవి చేపట్టేందుకు అతణ్ణి ఒప్పించాడు. అతడికి నిజాం ఉల్-ముల్క్ టైటిల్ ఫతే జంగ్ అనే బిరుదు ఇచ్చాడు.

ఢిల్లీ సింహాసనానికి విధేయుడై ఉంటూనే, వారికి నిరంతరం డబ్బు పంపిస్తూనే తాను స్వతంత్రంగా తన సొంత శక్తి-స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని నిజాం ఉల్-ముల్క్ పై అతడి శత్రువులు ఆరోపణలు చేస్తారు. తన దర్బారులోనే ఉన్న సయ్యద్ బ్రదర్స్ నుండి వచ్చిన ముప్పును తప్పించేందుకు సహాయం చేయమని అతన్ని ఫరూఖ్‌సియార్ పిలిచాడు. కానీ ఫరూఖ్‌సియార్ సయ్యద్ బ్రదర్స్ చేసిన కుట్రకు బలైపోయాడు.

తరువాతి కాలంలో మొగలు వారసుడైన 18 ఏళ్ల ముహమ్మద్ షా కాలంలో సయ్యిద్ సోదరులను హతం చేసినందుకు అతణ్ణి తన దర్బారులో వజీరు పదవిలో నియమించి సత్కరించాడు.

తిరిగి దక్కనుకు

మార్చు

1724 లో, మొగలు దర్బారు లోని అంతఃపుర రాజకీయాలకు, కుట్రలూ కూహకాలకూ విసుగెత్తిన నిజాం ఉల్-ముల్క్, తన వజీరు పదవికి రాజీనామా చేసి, దక్కనులో తన రాజప్రతినిధిత్వాన్ని తిరిగి స్థాపించడానికి దక్కనుకు బయలుదేరాడు. అయితే తొమ్మిది సంవత్సరాల క్రితం చక్రవర్తి ఫరూఖ్‌సియార్ చేత గవర్నరు‌గా నియమితుడైన ముబారిజ్ ఖాన్, ఈ పదవిని ఖాళీ చేయడానికి నిరాకరింఅచాడు.

ముబారిజ్ ఖాన్ దక్కన్లో శాంతిభద్రతలను విజయవంతంగా పునరుద్ధరించాడు. మొఘల్ సింహాసనాన్ని పేరుకు కొన్ని చెల్లింపులు చేసేవాడు. అతని కుమారులు, చుట్టాలు, అతని అభిమాన బానిస నపుంసకులకూ పాలనలో మంచిమంచి పదవులిచ్చుకున్నాడు. తన పదివిని ఆక్రమించిన ముబారిజ్ ఖాన్‌పై నిజాం ఉల్-ముల్క్ బలగాలను సేకరించుకుని శకర్వ ఖేడా వద్ద యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చిన్నదే గానీ, నిర్ణయాత్మకమైనది. ఒళ్ళంతా గాయాలతో, రక్తంతో తడిసిపోయిన శాలువా కప్పుకున్న ముబారిజ్ ఖాన్ తన యుద్ధ ఏనుగుపై యుద్ధ రంగం నుండి పారిపోయాడు. చనిపోయే వరకూ పారిపోయాడు. అతడి తల తీసి, నిజాం ఉల్-ముల్క్ ఢిల్లీకి పంపించాడు. తన దారికి అడ్డుగా వచ్చిన వారెవరికైనా అదేగతి పడుతుందనేది అతడి సందేశం.   

ఇప్పుడు చక్రవర్తి నుండి ఏనుగు, ఆభరణాలతో పటు అసఫ్ జా అనే బిరుదు వచ్చింది. దేశాన్ని స్థిరపరచమనీ, అల్లకల్లోలాలను అణచివేయమనీ, తిరుగుబాటుదారులను శిక్షించమనీ ప్రజలను ఆదరించమనీ ఆదేశాలు వచ్చాయి. అసఫ్ జా, మొఘల్ సామ్రాజ్యంలో ఇచ్చే అత్యున్నతమైన బిరుదు. 1724 లో అసఫ్ జాహి రాజవంశం స్థాపించబడిన సందర్భంలో విలాసవంతమైన వేడుకలేమీ జరగలేదు. కొత్త పాలకుడి సన్నిహిత సలహాదారులు మాత్రమే హాజరైన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, మూసిన తలుపుల వెనుక మొదటి నిజాం పట్టాభిషేకం జరిగింది. నిజాం ఉల్-ముల్క్ తన స్వాతంత్ర్యాన్ని అధికారికంగా ప్రకటించుకోలేదు. మొగల్ చక్రవర్తి తనపై ఉంచిన నమ్మకంపైననే తన పాలన పూర్తిగా ఆధారపడి ఉండాలని భావించాడు.

నిజాం ఉల్-ముల్క్ వ్యక్తిగత జీవితం కొన్ని రహస్యాలతో నిండి ఉంది. అతను ఒక నపుంసకుడు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

నిజాం ఉల్ ముల్క్ 76 సంవత్సరాల వయస్సులో, 1748 జూన్ 1 న బుర్హాన్‌పూర్‌లో మరణించాడు. అతని దేహాన్ని ఔరంగాబాదు వద్ద, ఔరంగజేబు సమాధికి దగ్గర్లోనే ఖననం చేశారు.

మూలాలు

మార్చు
  1. Usha R Bala Krishnan (2001). Jewels of the Nizams. pp. 14.
  2. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 193–194. ISBN 978-9-38060-734-4.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-04. Retrieved 2019-08-15.
  4. William Irvine (1922). Later Mughals . Vol. 2, 1719–1739. p. 271. OCLC 452940071.
  5. Jaswant Lal Mehta (2005). Advanced study in the history of modern India 1707–1813. Sterling. p. 143. ISBN 9781932705546.
  6. Rai, Raghunath. History. FK Publications. ISBN 9788187139690.
  7. Khan 1936, p. 1.
  8. Khan 1936, p. 2.
  9. Khan 1936, p. 4.
  10. Khan 1936, p. 8.
  11. Khan 1936, p. 11.
  12. Khan 1936, p. 12.
  13. Khan 1936, p. 41.
  14. 14.0 14.1 14.2 Khan 1936, p. 42.
  15. 15.0 15.1 Khan 1936, p. 44.
  16. 16.0 16.1 Khan 1936, p. 45.
  17. Khan 1936, p. 46.
  18. Khan 1936, p. 47.