ముద్దుల ప్రియుడు

1994 సినిమా

ముద్దుల ప్రియుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1994 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.[1] ఇందులో వెంకటేష్, రంభ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో[2] పాటలు వేటూరి, సీతారామ శాస్త్రి రాశారు.

ముద్దుల ప్రియుడు
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనపి. సత్యానంద్ (మాటలు)
నిర్మాతకె. కృష్ణమోహనరావు
తారాగణంవెంకటేష్,
రంభ,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జనవరి 1, 1994 (1994-01-01)
సినిమా నిడివి
132 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

కోటిపల్లి అనే ఊర్లో రాముడు తన తల్లి పార్వతమ్మ తో కలిసి జీవిస్తుంటాడు. అదే ఊళ్ళో ఉండే కొబ్బరికాయల సుబ్బయ్య రైతుల దగ్గర తక్కువ ధరకే కొబ్బరి కాయలు కొని పట్నంలో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. రాముడు అతని దుర్మార్గాలను అడ్డుకుంటూ ఉంటాడు. ఊరి సర్పంచి ధర్మయ్య కూతురు ఉష. రాముడు, ఉష ప్రేమించుకుంటారు. సుబ్బయ్య తన కొడుకు బుజ్జులు కి ఉషనిచ్చి పెళ్ళి చేసి ఊరిమీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటాడు. కానీ ధర్మయ్య అందుకు అంగీకరించడు. తనకు అడ్డు తగులుతున్న రాముడి మీద పగ తీర్చుకోవడానికి సుబ్బయ్య అతని మీద దేవుడి గుడిలో నగల దొంగతనం నేరం మోపి అతని తల్లి చేతనే కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. రాముడు తెలివిగా సుబ్బయ్య దుర్మార్గాలను ఎండగట్టి అతన్ని జైలుకు పంపిస్తాడు. రాముడికి ఉషకీ పెళ్ళి కుదురుస్తారు పెద్దలు. పెళ్ళి సామాగ్రి కోసం రాముడు పట్నం వెళ్ళి తిరిగి వస్తుండగా సుబ్బయ్య జైలు నుంచి నియమించిన గూండాలు అతని మీద దాడి చేసి చనిపోయాడని భావించి నదిలో పారేస్తారు. ఊర్లో వాళ్ళందరూ కూడా రాముడు చనిపోయాడనే అనుకుంటారు.

నీళ్ళలో తేలుతున్న రాముడిని చూసి కొంతమంది రక్షిస్తారు. కానీ అతను గతం మరిచి పోయి రాజు అనే పేరుతో మేజర్ నారాయణ మూర్తి ఇంట్లోకి చేరతాడు. ఆ ఇంట్లో పిల్లలందరూ గారబం వల్ల బాగా అల్లరి చేస్తుంటారు. రాజు తన యుక్తితో వారందరినీ క్రమశిక్షణలో పెడతాడు. వాళ్ళతోనే కలిసిపోయి ఉన్న సంధ్య రాజు ప్రేమలో పడుతుంది. గతం గుర్తు లేని రాజు కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఈ లోపు సుబ్బయ్య పంపించిన గూండాలు మళ్ళీ అతన్ని దాడి చేయడంతో రాజు ప్రస్తుతం జరిగిన కథ మరిచిపోయి మళ్ళీ పాత రాముడి జ్ఞాపకాలు గుర్తు వచ్చి తన ఊరు వెళతాడు. రాజు ఏమైనాడో తెలియక సంధ్య అతని కోసం అన్ని చోట్లా వెతికిస్తుంటుంది. వాళ్ళ దగ్గర పనిచేసే గుండు పక్క ఊరికి వెళ్ళి రాజును చూసి సంధ్యకు చెప్పడంతో ఆమె నారాయణ మూర్తితో కలిసి ఆ ఊరు వస్తుంది. నారాయణ మూర్తి, ధర్మయ్య చిన్ననాటి స్నేహితులని గుర్తిస్తారు. సుబ్బయ్య మనుషులు దాడి చేయడం వల్లే రాముడు గతం మరిచిపోయి సంధ్యను ప్రేమించినట్లు తెలుసుకుంటాడు ధర్మయ్య. అంతకు మునుపే అతనికి ఉషకి నిశ్చితార్థం జరిగినట్లు తెలుసుకుంటాడు నారాయణ మూర్తి. ఇద్దరిలో ఎవరికి పెళ్ళి చేసినా ఎవరో ఒకరికి అన్యాయం చేసినట్టవుతుందని స్నేహితులిద్దరూ మధన పడుతూ ఉంటారు. అప్పుడు నారాయణ మూర్తి సంధ్య జీవితంలో జరిగిన ఒక చేదు నిజాన్ని గురించి తెలియజేస్తాడు. ఇంతలో సుబ్బయ్య మనుషులు ఉష ని అపహరించి బుజ్జులుతో బలవంతంగా పెళ్ళి చేయాలని చూస్తారు. సంధ్య తన ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడుతుంది. చివరికి రాముడు, ఉష పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో[2] పాటలు వేటూరి, సీతారామ శాస్త్రి రాశారు. సుప్రీం ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాట పాడిన వారు రాసిన వారు
సిరిచందనపు చెక్క ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి
నాకే గనక నీతోనే గనక ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి
వసంతంలా వచ్చిపోవా ఇలా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి
జై జై మహాకాయ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఎవరో రావాలి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి
చిటపట ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి

మూలాలు

మార్చు
  1. "Muddula Priyudu (1994)". Indiancine.ma. Retrieved 2020-08-13.
  2. 2.0 2.1 "naasongs.com లో ముద్దుల ప్రియుడు". naasongs.com. Archived from the original on 21 నవంబరు 2016. Retrieved 29 August 2017.