ముద్ద మందారం (సినిమా)

ముద్ద మందారం జంధ్యాల దర్శకునిగా, ప్రదీప్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన ప్రేమకథాచిత్రం. రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్, పూర్ణిమలు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. చక్కటి సంగీతం (రమేష్ నాయుడు), సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది. సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ముద్ద మందారం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం ప్రదీప్,
పూర్ణిమ,
సుత్తివేలు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ నటనాలయా
భాష తెలుగు

చిత్ర కథ

మార్చు

ప్రదీప్ (ప్రదీప్) సంపన్న కుటుంబంలో జన్మించి, విదేశాల్లో చదువుకుని భారతదేశం తిరగివచ్చిన కుర్రాడు. దేవాలయం వద్ద పూలమ్ముకునే పేద పిల్ల దుర్గ (పూర్ణిమ), ప్రదీప్ గాఢంగా ప్రేమించుకుంటారు. తండ్రి కుదిర్చిన ఇందూతో పెళ్ళిని తెలివిగా తప్పించుకుంటాడు ప్రదీప్. వీళ్ళిద్దరి ప్రేమను అంగీకరించని ప్రదీప్ తండ్రి రావు ఇందు ప్రేమను ఖరీదుకట్టే ప్రయత్నం చేస్తాడు. దాంతో ప్రదీప్, దుర్గ పారిపోయి పెళ్ళిచేసుకుంటారు. ఇద్దరూ చిన్న చిన్న పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తూంటారు. దుర్గ గర్భవతి అవుతుంది. ఈ విషయం దుర్గ తాతయ్యకి ప్రదీప్ ఉత్తరం రాస్తాడు. దుర్గ, ప్రదీప్ ఎక్కడ బ్రతుకుతున్నారో తెలుసుకున్న దుర్గ సవతి తమ్ముడు కొండడు గర్భవతిగా ఉన్న దుర్గను బలవంతంగా ఈడ్చుకుపోతూండగా, ప్రదీప్ అడ్డుపడతాడు. దుర్గ ఓ మగబిడ్డను ప్రసవిస్తుంది. రావు, దుర్గ పిన్ని మాలక్ష్మి కలసి తమదగ్గరికి రావడం చూసిన ప్రదీప్, దుర్గలు వారిద్దరూ తమను విడదీయడానికే వస్తున్నారన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకోబోతారు. చివరికి పెద్దలు వారిద్దరికీ మళ్ళీ పెళ్ళి జరిపించడంతో సినిమా సుఖాంతమవుతుంది.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

విజయవంతుడైన సినీ రచయితగా తెలుగు పరిశ్రమలో పనిచేస్తున్న జంధ్యాల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కొన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రాలను చూసి వాటి వాస్తవికతకు ముచ్చటపడ్డారు. అలాంటి వాస్తవికమైన సినిమా తీయాలన్న ఆలోచనతో దర్శకుడయ్యారు. ఆ క్రమంలోనే ఈ సినిమాకు ప్రారంభమైంది. టీనేజ్ ప్రేమకథతో నిర్మించబోయే చిత్రానికి "ముద్దమందారం", "సన్నజాజి" అనే పేర్లలోంచి ముద్దమందారమనే పేరును ఎంచుకున్నారు.[1]

తారాగణం ఎంపిక

మార్చు

జంధ్యాలకు విన్నకోట రామన్నపంతులు గురుతుల్యులు. చిన్నతనంలో వాళ్లింట్లోనే ఎక్కువగా పెరిగారు, ఆయన కొడుకు విన్నకోట విజయరామ్ మంచి స్నేహితులు. విజయరామ్ మేనల్లుడు, రామన్నపంతులు మనవడు అయిన ప్రదీప్ అప్పుడు డిగ్రీ చదువుతుండేవాడు. అతను నటించిన ఓ నాటికను చూసిన జంధ్యాల అతనితో "నిన్ను సినిమా హీరోని చేస్తాను రా" అని ఈ సినిమాలోకి తీసుకున్నారు. మద్రాసులో జంధ్యాల తన ఇంట్లోనే ఉంచుకుని ప్రదీప్ కి డ్యాన్సులు, ఫైట్లు, గుర్రపుస్వారీలు, కార్ డ్రైవింగ్ లాంటివన్నీ నేర్పించారు. కొత్త తెలుగు సినిమాలు చూసి, వాటిలో హీరోలు ఎలా చేస్తున్నారో చూడమని సూచించారు.

కథానాయిక పాత్రకు కూడా కొత్త నటినే తీసుకోవాలని భావించి, అందుకు వందలాది ఫోటోలు చూశారు. వరలక్ష్మి, డబ్బింగ్ జానకి చెల్లెలు లక్ష్మి వంటివారెందరో ఆ క్రమంలో ఆడిషన్ అయి నిరాకరింపబడ్డారు. అయితే అప్పటికి "హరిశ్చంద్రుడు" సినిమాలో చిన్న పాత్రలో నటించిన పూర్ణిమకు ఆ అవకాశం దక్కింది. అయితే ఆమె సినిమాల్లో గాయని కావాలనుకోవడమే తప్ప నటి కావాలనుకోకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు సినిమాల్లో నటి కావడంపై సదుద్దేశం లేకపోవడం వల్ల వారు మొదట ఈ అవకాశాన్ని నిరాకరించారు. జంధ్యాల పూర్ణిమ తండ్రికి తాను విశ్వనాథ్ శిష్యుణ్ణనీ, తమ చిత్రాల్లో అసభ్యతకు తావుండదనీ చెప్పి ఒప్పించారు.

ప్రదీప్ తాత విన్నకోట రామన్నపంతులు కథానాయకి తాతగానూ, ప్రదీప్ మేనమామ విన్నకోట విజయరామ్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. ప్రదీప్-దుర్గలు చేరిన హోటల్ మేనేజర్ పాత్రలో తర్వాత్తర్వాత హాస్యనటునిగా ప్రఖ్యాతి పొందిన సుత్తివేలు నటించారు. టవల్ కట్టుకుని, ఒంటికి నూనె రాసుకుని నత్తినత్తిగా మాట్లాడే పాత్రలో ఏవీఎస్ నటించారు, తర్వాతి కాలంలో ఆయన కూడా మంచి హాస్యనటుడు అయ్యారు.[1]

చిత్రీకరణ

మార్చు

ఫిబ్రవరి 23, 1981లో చిత్రీకరణ చెన్నైలోని గిరి హౌస్ లో తన భవంతికి దుర్గని ప్రదీప్ తీసుకునివెళ్ళి దేవుని గది చూపించడంతో ప్రారంభించారు. సినిమాలో కొద్ది సన్నివేశాలు మినహా మిగతా అంతా విశాఖపట్నంలోనే జరిగింది. అప్పటికి విశాఖపట్టణంలో కొన్ని తెలుగు చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నా, అరకులోయను వెండితెరపై అందంగా చూపించిన చిత్రంగా ఘనత ముద్ద మందారానికి దక్కుతుంది. చిత్ర యూనిట్ మొత్తం విశాఖపట్టణంలోని ఎం.వి.పి.కాలనీలో దాదాపుగా 30, 40 ఇళ్ళను అద్దెకు తీసుకుని బసచేసింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డికి ఇది రెండవ సినిమా. మొదటి సినిమా సంధ్యతో ఎ.కోదండరామిరెడ్డి దర్శకునిగా పరిచయం కాగా, ఈ రెండో సినిమాకి జంధ్యాల దర్శకునిగా పరిచయమయ్యారు. ముద్దమందారం సినిమాలో పాటల చిత్రీకరణకు లొకేషన్లను ముందుగా ఎంపికచేయలేదు. జంధ్యాల, ఎస్.గోపాలరెడ్డి, ప్రదీప్, పూర్ణిమలు కారులో ప్రయాణిస్తూ దారిలో ఎక్కడ ఏ లొకేషన్ అందంగా కనిపిస్తే అక్కడ ఆగి చిత్రీకరించారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, అరకులోయ, కోటపాడు, శృంగవరపుకోట, భీమిలి వంటి ప్రాంతాల్లో చిత్రీరణ జరిగింది. సినిమా నిర్మించడానికి దాదాపుగా 17 లక్షల రూపాయలు ఖర్చైతే, 60 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.[1]

విడుదల, స్పందన

మార్చు

వేటూరి పాట రాయడం, దాన్ని రమేశ్ నాయుడు ట్యూన్ కట్టడం, బాలు ఆలపించడం, రిహార్సల్స్ చేయడం, పల్లెటూళ్ళో పాటను చిత్రీకరించడంతో ప్రారంభించి అలివేణీ ఆణిముత్యమా పాటను ట్రైలర్ గా తయారుచేసి థియేటర్లలో ప్రదర్శించారు. ఇది టీనేజ్ ప్రేమకథ కావడం, దాని చిత్రీకరణ వంటి కారణాలతో అప్పటి నిబంధనల మేరకు సినిమాకు సెన్సార్ వారు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది ప్రేక్షకులకు అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. సెప్టెంబరు 11, 1981లో సినిమా విడుదలై విజయవంతమైంది. ఈ సినిమా వల్ల యువతలో ప్రదీప్‌కి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాతో జంధ్యాల దర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నారు. సినిమా శతదితనోత్సవ వేడుకలు చెన్నై పామ్ గ్రోవ్ హోటల్లో జరిగింది. తమ ఊళ్ళోనే చిత్రీకరణ చేసుకున్న సినిమా విజయవంతం కావడంతో కె.కోటపాడు గ్రామప్రజలు జనవరి 22, 1982న జంధ్యాలకు సన్మానం చేశారు.[1]

పాటలు

మార్చు

పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

  1. అలివేణీ ఆణిముత్యమా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  2. నీలాలు కారేనా, గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
  3. ముద్దుకే ముద్దొచ్చే మందారం, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. శ్రీరస్తు శుభమస్తు, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
  5. కలకంఠి కొలుకుల్లో, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  6. నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి, గానం. జిత్ మోహన్ మిత్ర
  7. ఆ రెండు దొండపండు పెదవుల్లో, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  8. జొన్నచేలో జున్ను అన్నులమిన్న, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
  9. జో.. లాలీ.. జోలాలీ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 పులగం, చిన్నారాయణ (ఏప్రిల్ 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.