మెర్సీ మార్గరెట్
'మెర్సీ మార్గరెట్' వర్థమాన తెలుగు కవయిత్రి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన యువకవయిత్రి.[1]. సామాజిక ఉద్యమకర్త. సామాజిక మాధ్యమాల ద్వారా, మరి ముఖ్యంగా ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం ద్వారా విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. తాను రాసిన కవిత్వాన్ని 2014లో మాటల మడుగు పేరుతో కవితా సంకలనంగా వెలువరించింది. ఆమె వెలువరించిన ఈ తొలి సంకలనానికే ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి గానూ 'యువపురస్కారానికి ఎంపిక చేసింది.[2]
మెర్సీ మార్గరెట్ | |
---|---|
జననం | ఆగస్టు 23, 1983 |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
వృత్తి | అసిస్టెంట్ ప్రొఫెసర్ |
ప్రసిద్ధి | కవయిత్రి |
జీవిత విశేషాలు
మార్చురంగానగర్.. సికింద్రాబాద్ భోలక్‌పూర్ ప్రాంతంలోని మురికివాడల్లో ఒకటి. రజాకార్ల ఉద్యమమప్పుడే ఈ ప్రాంతానికి వచ్చిన కుటుంబం మెర్సీది. తండ్రి ఓ బ్యాంకులో చిరుద్యోగి. తల్లి గృహిణి. ముగ్గురుపిల్లల్లో మెర్సీ పెద్ద. ఒకరి జీతంతో అన్నింటా పొదుపు పాటిస్తూ సాగే కుటుంబమైనా..చదువుకి పెద్ద పీట వేశారు. పాఠ్యపుస్తకాలకి అతీతంగా పత్రికలూ, సాహిత్యాన్నీ విరివిగా చదివించారు! కాకపోతే మెర్సీ ఇంటర్ ముగించేటప్పటికి ఆమె తండ్రి అస్వస్థత కారణంగా స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అప్పటి నుంచే మెర్సీ చదువుకుంటూనే ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కాలేజీ తర్వాత ప్లాస్టిక్ సీసాలు తయారుచేసే పనికి కూలీగానూ వెళ్లారు. అదయ్యాక సాయంత్రాల్లో ‘అక్షరజ్యోతి’ కార్యక్రమంలో వయోజనులకు విద్య నేర్పించేవారు. డిగ్రీ ముగించాక.. పీజీ చేయాలనే కోరిక! ఎంకామ్ సీటొచ్చింది. కానీ డబ్బుల్లేవు. ఆమెకి బాగా సన్నిహితులైన నలుగురు స్నేహితుల తల్లిదండ్రులని అప్పు అడిగితే వాళ్లే వచ్చి ఫీజులు కట్టారు. పీజీలో చేరినప్పటి నుంచే మరో కాలేజీలో బీకామ్ విద్యార్థులకి అధ్యాపకురాలిగా చేరిపోయారు మెర్సీ! వీటితోపాటే సాయంత్రం ఇంటికొచ్చాక ట్యూషన్‌లు. రెండేళ్లపాటు ఇదే శ్రమ. అదంతా వృథాపోలేదు. పీజీ ముగించగానే ఓ ప్రయివేటు బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం. 2007లోనే ముప్పైవేల రూపాయల జీతం! రెండేళ్లలో కష్టాలన్నీ గట్టెక్కాయి. కానీ 2008లో మొదలైన ఆర్థికమాంద్యం ప్రభావం ఆ సంస్థపైనా పడింది. దాంతోపాటూ ఎంబీఏ చదవాలనే కలతో రాజీనామా చేశారు. మళ్లీ విద్యార్థిగా మారారు. ఓ సంస్థలో లెక్చరర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ ముగించారు. తర్వాత ‘కాగ్నిజెంట్’ సంస్థలో కుదురుకున్నారు. ఆ తర్వాత ప్రేమ వివాహం. ఆయనతో కలిసి సొంతంగా గ్రాఫిక్స్ సంస్థ ఏర్పాటుచేశారు. తర్వాత భారత్ మహిళా కళాశాలలో ఎంబీఏ సహాయ ఆచార్యురాలిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు.
సాహితీ ప్రస్థానం
మార్చుమెర్సీ 2009 నుంచి ఫేస్‌బుక్‌లో కవితలు రాస్తున్నారు. 2011లో తనలాంటి యువకవుల కోసం ‘కవిత్వశాల’ అనే బృందం ఏర్పాటుచేశారు. ప్రముఖ కవులూ, విమర్శకులు వాడ్రేవు చినవీరుభద్రుడు, రాళ్లబండి కవితాప్రసాద్, ముక్తేశ్వరరావు వంటివారిచేత కవితా కార్యశాలలు ఏర్పాటుచేయించారు. అవి ఎంత విజయం సాధించాయంటే.. అమెరికాలోనూ ఇలాంటి కార్యశాలలని పోలిన కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు! ఇప్పుడీ బృందంలో సుమారు రెండు వేలమంది సభ్యులున్నారు. ఆ కార్యశాలల తర్వాతే 2015లో ‘మాటల మడుగు’ పుస్తకాన్ని తీసుకొచ్చారు మెర్సీ! ఈ కవితలు తెలుగులోనే కాదు.. కన్నడ, హిందీలోనూ అనువాదమయ్యాయి. కేరళలో ప్రతి సంవత్సరం జరిగే తుంజన్ కవితోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే "దక్షిణ భారత కవుల సదస్సు "లో 2016 ఫిబ్రవరి లో తెలుగు కవిగా పాల్గొన్నది. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో డిల్లీ లో ప్రతి సంవత్సరం జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో 2016 ఫిబ్రవరి నాడు తెలుగు భాష నుండి యువ కవయిత్రిగా పాల్గొనే అవకాశాన్ని పొందింది. మాటల మడుగు పుస్తకం 2017 లో కేంద్రసాహిత్య అకాడమీ గుర్తింపుని సాధించింది.
రచించిన పుస్తకాలు
మార్చు- మాటల మడుగు (వచన కవితా సంపుటి) 2014[3]
- కాలం వాలిపోతున్న వైపు (వచన కవితా సంపుటి) 2019[4]
- అసమర్ధుడు
పురస్కారాలు
మార్చు- 2012లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 'కవితా పురస్కారం'
- "మాటల మడుగు " కవితా సంపుటికి గాను పెన్నా సాహిత్య పురస్కారం 2015[5]
- అనంతపురం కవుల వేదిక నుంచి "చంస్పందన " ఆత్మీయ పురస్కారం 2016
- "మాటల మడుగు " కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2017[6][7]
ఎన్నికల్లో పోటీ
మార్చుమెర్సీ మార్గరెట్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[8][9]
చిత్రమాలిక
మార్చు-
"స్వతంత్ర భారత అమృతోత్సవాలు" కార్యక్రమంలో తన కవిత్వాన్ని చదువుతూ
-
"స్వతంత్ర భారత అమృతోత్సవాలు" కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సన్మానం అందుకుంటూ..
-
2016 హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో సాహిత్య సభలో ప్రసంగిస్తూ..
-
2016 హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో సన్మానం అందుకుంటూ..
-
మెర్సీ మార్గరెట్ అసమర్ధుడు పుస్తకావిష్కరణ
మూలాలు
మార్చు- ↑ తొలి సంకలనంతోనే మెర్సిన మెర్సీ- నమస్తే తెలంగాణ, దినపత్రిక, తేది:23.06.2017 [permanent dead link]
- ↑ https://www.hydlitfest.org/speaker/mercy-margaret-boda/[permanent dead link]
- ↑ "మాటల మడుగు", వికీపీడియా, 2017-07-25, retrieved 2021-04-05
- ↑ EENADU. "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన". EENADU. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ "Hyderabad Literary Festival 2019: Ninth edition to feature Shabana Azmi, Shashi Deshpande, Sahitya Academy winners from Telangana". Firstpost. Retrieved 2021-04-05.
- ↑ Nadadhur, Srivathsan (2017-06-26). "I feel suffocated, can't sleep when I don't write, says Mercy Margaret". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-04-05.
- ↑ "Writing for kids & poetry earn Sahitya Akademi honours for duo from Telangana - Times of India". The Times of India. Retrieved 2021-04-05.
- ↑ Zee News Telugu (16 November 2018). "తెలంగాణ ఎన్నికలు: స్వతంత్ర అభ్యర్థిగా సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (15 November 2018). "రచనల నుంచి రాజకీయాల్లోకి: బరిలో ప్రముఖ రచయిత్రి". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.