రౌండు టేబులు సమావేశాలు

(మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నుండి దారిమార్పు చెందింది)

భారతదేశ స్వపరిపాలనా విషయాలను చర్చింటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నుండి 1932 వరకు లండన్ లో నిర్వహించిన మూడు అఖిల పక్ష సమావేశాలను రౌండు టేబులు సమావేశాలు (ఆంగ్లం: Round Table Conferences) అంటారు.

89 మంది సదస్యులు హాజరైన తొలి రౌండు టేబులు సమావేశం

భారత స్వపరిపాలనపై సైమన్ కమిషను ఇచ్చిన నివేదిక పర్యవసానంగా 1930-32లలో బ్రిటిషు ప్రభుత్వం రౌండు టేబులు సమావేశాలను ఏర్పాటు చేసింది.[1] స్వపరిపాలన కోరిక దేశంలో క్రమేణా బలపడుతూ వస్తోంది. భారత్ డొమినియను ప్రతిపత్తి దిశగా సాగాలసిన అవసరం ఉందని 1930ల నాటికి, బ్రిటిషు రాజకీయనాయకులనేకులు భావించారు. అయితే, సమావేశాలు పరిష్కరించజాలని అభిప్రాయ భేదాలు భారత, బ్రిటిషు రాజకీయనాయకుల మధ్య ఉన్నాయి.

1927లో బ్రిటీషు ప్రభుత్వం 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల అమలును పరిశీలించటానికి, పరిస్థితిని గమనించి మార్పులు సూచించటానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమీషన్ను నియమించింది.సైమన్ కమీషను సూచించిన సంస్కరణలను ప్రవేశపెట్టే విషయం పరిశీలించటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నవంబరులో లండనులో అఖిలపక్ష సమావేశం (రౌండ్ టేబుల్ సమావేశం) ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, అన్ని స్వదేశ సంస్థానాల పాలకులు సమావేశమై సమస్యలు చర్చిస్తారు. అయితే కాంగ్రేసు పార్టీ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతున్నందున సమావేశాన్ని బహిష్కరించి హాజరు కాలేదు. మొదటి అఖిలపక్ష సమావేశంలో హిందూ మహాసభ, ముస్లిం లీగు, సంస్థానాధీశులు హాజరైనారు. దేశములో బలమైన పార్టీ కాంగ్రేసు హాజరు కాకపోవడముతో బ్రిటీషు వారు ఏవిధమైన రాజ్యాంగ మార్పులు చేయలేకపోయారు. మొదటి అఖిలపక్ష సమావేశం విఫలమయ్యింది.

మొదటి రౌండు టేబులు సమావేశం (నవంబర్ 1930 – జనవరి 1931)సవరించు

 
తొలి రౌండు టేబులు సమావేశానికి హాజరైన ముస్లిం ప్రతినిధులు

మొదటి రౌండు టేబులు సమావేశాన్ని 1930, నవంబర్ 13 (గురువారము) రోజున ఐదవ జార్జి చక్రవర్తి లాంఛనంగా ప్రారంభించాడు. ఈ సమావేశానికి అప్పటి బ్రిటీషు ప్రధానమంత్రి రాంసే మెక్‌డోనాల్డ్ అధ్యక్షత వహించాడు. భారత జాతీయ కాంగ్రేసు దేశములోని వ్యాపారవేత్తలతో పాటు సమావేశాలను బహిష్కరించింది. చాలామంది కాంగ్రేసు నేతలు అప్పటికే సహాయనిరాకరణోద్యమములో పాల్గొని జైళ్లలో ఉన్నారు.

 
దినపత్రికలో మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి ప్రారంభించిన వార్త

89మంది సదస్యులు పాల్గొన్న ఈ సమావేశంలో 58మందిని బ్రిటీషు ఇండియాలోని వివిధ వర్గాలు, పార్టీలనుండి ఎంపికచేశారు. మిగిలిన 31మంది వివిధ సంస్థానాల పాలకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు. సమావేశానికి హాజరైన వారిలో ముస్లిం నాయకులు మౌలానా మహమ్మద్ అలీ జౌహర్, మహమ్మద్ షఫీ, మౌల్వీ ఫజల్-ఇ-హక్, ఆగాఖాన్, ముహమ్మద్ అలీ జిన్నా, హిందూ మహాసభ నాయకులు బి.ఎస్.మూంజే, జయకర్, ఉదారవాదులు తేజ్ బహదూర్ సప్రూ, సి.వై.చింతామణి, శ్రీనివాస శాస్త్రి ప్రభతులతో పాటు అనేకమంది సంస్థానాధీశులు పాల్గొన్నారు.

సమావేశంలో హిందువుల, ముస్లింల మధ్య విభేదాలు పొడచూపాయి. హిందువులు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే, ముస్లింలు పూర్తి స్వయంప్రతిపత్తి గల ప్రాంతాల యొక్క సమాఖ్యను కోరారు. ముస్లింలు ప్రత్యేక నియోజకవర్గాలను కొనసాగించాలని, హిందువులు వాటిని రద్దు చేయాలని కోరారు. ముస్లింలు పంజాబ్, బెంగాల్ మొత్తం తమ ఆధిక్యతా ప్రాంతాలుగా ప్రకటించుకున్నారు. కానీ హిందువులు ఆ వాదనకు అంగీకరించలేదు. పంజాబ్లో సిక్కులు కూడా ఆధిక్యతను ప్రకటించుకోవటంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది.

మరింత క్షుణ్ణంగా వివిధ ముఖ్య విషయాలను పరిశీలించటానికి ఎనిమిది ఉపసంఘాలను యేర్పాటు చేశారు. ఈ సంఘాలు ఒక్కొక్కటి సమాఖ్య యొక్క స్వరూపం, తాత్కాలిక రాజ్యాంగము, ఓటుహక్కులు, సింధ్ ప్రాంతం, వాయువ్య సరిహద్దు ప్రాంతం, రక్షణ సేవలు, అల్పసంఖ్యాక వర్గాలు అను విషయాలను పరిశీలించాయి.

సమావేశాలలో అఖిల భారత సమాఖ్య యేర్పడాలన్న ఆలోచన ముందుకొచ్చింది. సమావేశానికి హాజరైన అన్ని పక్షాలవారు ఈ ఆలోచనకు మద్దతునిచ్చారు. కార్యాచరణ విభాగము న్యాయవ్యవస్థకు జవాబుదారీ కావటాన్ని చర్చించారు. బి.ఆర్.అంబేద్కర్ ఈ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కోరాడు. మొదటి రౌండు టేబులు సమావేశాన్ని 1931, జనవరి 19న ముగించారు.

రెండవ రౌండు టేబులు సమావేశం (సెప్టెంబర్ – డిసెంబర్ 1931)సవరించు

 
రౌండు టేబులు సమావేశంలో మహాత్మా గాంధీ

1931వ సంవత్సరంలో అప్పటి భారత వైస్త్రాయి ఇర్విన్ను బ్రిటీషు ప్రభుత్వం కాంగ్రేసు వారిని ఎలాగైనా ఒప్పించి రెండవ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆజ్ఞాపించింది.

రెండవ రౌండు టేబులు సమావేశం లండన్లో సెప్టెంబర్ 7, 1931న ప్రారంభమయ్యింది. రెండవ సమావేశము యొక్క ప్రధాన కార్యమంతా సమాఖ్య స్వరూపం, అల్పసంఖ్యాక వర్గాల పై నియమించిన రెండు కమిటీలు నిర్వర్తించాయి. మహాత్మా గాంధీ ఈ రెండు కమిటీలలో సభ్యుడు.

 
రెండవ సమావేశం జరిగిన సెయింట్ జాన్ ప్యాలెస్

మొదటి, రెండవ రౌండు టేబులు సమావేశాల మధ్య మూడు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. రెండవ సమావేశం నాటికి:

  • కాంగ్రేసు ప్రాతినిధ్యం — సమావేశంలో కాంగ్రెసు పాల్గొనేందుకు గాంధీ ఇర్విన్ ఒప్పందం మార్గం ఏర్పరచింది. కాంగ్రెసు తరపున ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. సమావేశాల్లో గాంధీ ఇలా అన్నాడు:
    • భారత రాజకీయాలకు కాంగ్రెసు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది
    • అంటరానివారు హిందువులే, వారిని మైనారిటీలుగా పరిగణించరాదు
    • ముస్లిములకు గానీ, ఇతర మైనారిటీలకు గాని ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండరాదు. ఈ వాదనలను ఇతర భారతీయ సదస్యులు వ్యతిరేకించారు
 
రెండవ రౌండు టేబులు సమావేశంలో పాల్గొన్న సదస్యులు
  • జాతీయ ప్రభుత్వం — సమావేశాలకు రెండు వారాల ముందే బ్రిటనులో లేబరు పార్టీ ప్రభుత్వం పడిపోయింది. కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు రామ్సే మెక్డొనాల్డ్ నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం ఏర్పడింది.
  • ఆర్ధిక సంక్షోభం – సమావేశాలు జరుగుతున్న సమయంలో, బ్రిటను బంగారపు నిల్వలు పడిపోయాయి. పౌండును రూపాయితో ముడిపెట్టి భారత బంగారం సాయంతో బ్రిటను ద్రవ్యం విలువ మరింత పడిపోకుండా ఉంచే ప్రయత్నం చేసింది.[ఆధారం చూపాలి]

ముస్లిముల ప్రాతినిధ్యం, వారి రక్షణలకు సంబంధించి సమావేశాల్లో గాంధీ ముస్లిము నాయకులతో ఒక అంగీకారానికి రాలేకపోయాడు. సమావేశాల చివర్లో మైనారిటీల ప్రాతినిధ్యం కోసం కమ్యూనల్ ఎవార్డ్ ను రామ్సే మెక్డొనాల్డ్ రూపొందించాడు. వివిధ పార్టీల మధ్య ఏదైనా అంగీకారం కుదిరితే ఈ ఎవార్డు స్థానంలో ఆ ఎవార్డును అమలు జరిపే వీలు కలిగించారు.

అంటరానివారిని కూడా హిందూ మతం నుండి వేరుచేసి ప్రత్యేకంగా మైనారిటీ వర్గంగా చూపించడాన్ని గాంధీ ప్రత్యేకించి వ్యతిరేకించాడు. అంటరానివారి నాయకుడు బి.ఆర్.అంబేద్కర్తో ఈ విషయమై ఘర్షణ పడ్డాడు. తదనంతరం, 1932 లో పూనా ఒడంబడిక ద్వారా వీరిరువురూ ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.

మూడవ రౌండు టేబులు సమావేశం (నవంబర్ – డిసెంబర్ 1932)సవరించు

మూడవ రౌండు టేబులు సమావేశం నవంబర్ 17, 1932న ప్రారంభమైంది. ఇది చిన్నది, అంత ప్రధానమైనది కాదు. మూడవ రౌండు టేబులు సమావేశంలో కాంగ్రేసు నాయకులుగానీ ఇతర ప్రధాన రాజకీయనాయకులెవ్వరూ హాజరుకాలేదు. బ్రిటీషు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన లేబరు పార్టీ కూడా హాజరుకాలేదు. ఈ సమావేశంలో అనేక కమిటీలు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. మూడవ రౌండు టేబులు సమావేశం డిసెంబర్ 25, 1932న ముగిసినది.

ఈ సమావేశంలోనే చౌదరీ రహమత్ అలీ అనే లండన్లో చదువుతున్న ముస్లిం విద్యార్థిపాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించాడు. పాకిస్తాన్ అంటే ఉర్దూలో పవిత్ర భూమి అని అర్ధం. ఆంగ్లములో దీని స్పెల్లింగు (PAKISTAN) లో P పంజాబు నుండి, A ఆఫ్ఘాన్ KI-కాశ్మీర్, S- సింధ్, బలూచీస్తాన్ నుండి TAN తీసుకొని పాకిస్తాన్ తయారుచేశాడు.[ఆధారం చూపాలి]

పర్యవసానంసవరించు

1931 సెప్టెంబరు నుండి 1933 మార్చి వరకు, బ్రిటన్ మంత్రివర్గములో భారత వ్యవహారాల మంత్రి అయిన శామ్యూల్ హోర్ నేతృత్వములో రౌండు టేబులు సమావేశాల యొక్క సిఫారుసులను, ప్రతిపాదించిన సంస్కరణలను పొందుపరచి 1933 మార్చిలో ఒక శ్వేత పత్రమును విడుదల చేశారు. ఆ తరువాత నేరుగా దీనిపై బ్రిటీషు పార్లమెంటులో చర్చ జరిగింది. పార్లమెంటు సంయుక్త కమిటీ విశ్లేషించి తుది ప్రతిని తయారుచేసి, పార్లమెంటు ఆ తుది ప్రతిని చదివి ఆమోదము తెలియజేసిన తర్వాత ఆ బిల్లు 1935 జూలై 24న భారత ప్రభుత్వ చట్టం 1935గా రూపొందినది.

మూలాలుసవరించు

  1. Legg, Stephen (2020). "Imperial Internationalism: The Round Table Conference and the Making of India in London, 1930–1932". Humanity. 11 (1): 32–53. doi:10.1353/hum.2020.0006. ISSN 2151-4372.

వెలుపలి లంకెలుసవరించు