మొదటి సోమేశ్వరుడు
ఒకటవ సోమేశ్వరుడు (పాలన: 1042 - 1068) [1]పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన రాజు. ఇతనినే "ఆహవమల్ల" లేదా "త్రిలోకమల్ల" అని కూడా పిలుస్తారు. సోమేశ్వరుడు తన తండ్రి రెండవ జయసింహుడి తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు.
మధ్య భారతదేశంలో అతని అనేక సైనిక విజయాలు అతన్ని విస్తారమైన సామ్రాజ్యానికి బలీయమైన పాలకుడిగా మార్చాయి. అతని పాలనలో, చాళుక్యుల సామ్రాజ్యం ఉత్తరాన గుజరాత్ మరియు మధ్య భారతదేశం వరకు విస్తరించింది. మైసూరులోని మలెనాడు (కొండ) ప్రాంతాలకు చెందిన హోయసలులు దక్షిణాదిలో అతని సామంతులు. వినయాదిత్యుని కుమార్తె లేదా సోదరి హోయసల దేవి అతని రాణిలలో ఒకరు. పశ్చిమాన, సోమేశ్వరుడు కొంకణ్‌పై నియంత్రణను కలిగి ఉన్నాడు. తూర్పున అనంతపురం మరియు కర్నూలు వరకు తన ప్రభావాన్ని విస్తరించగలిగాడు. తంజావూరులోని చోళులతో తన యుద్ధాల సమయంలో అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను అనేక సందర్భాలలో వేంగిలో కీలకపాత్ర పోషించాడు.[2]
చరిత్రకారుడు గంగూలీ ప్రకారం, చోళులు "అతని నుండి అతని రాజ్యంలోని ఏ భాగాన్ని స్వాధీనం చేసుకోలేరు". చరిత్రకారుడు సేన్ ప్రకారం, పశ్చిమ చాళుక్యుల చరిత్రలో ఒకటవ సోమేశ్వరుని పాలన ఒక "అద్భుతమైన కాలం". ఇది నాలుగవ విక్రమాదిత్యుడు హయాంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది.[3] చరిత్రకారుడు త్రిపాఠి చాళుక్యుల ప్రభావం సుదూర తూర్పు భారతదేశంలో కూడా ఉందని పేర్కొన్నారు. అతను తన రాజధానిని మాన్యఖేటం నుండి కళ్యాణికి మార్చాడు (ప్రస్తుతం ఆధునిక బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్).[4] అతను కన్నడ భాషా పండితుడు శ్రీధరాచార్యను ఆదరించాడు. శ్రీధరాచార్య కన్నడ భాషలో జ్యోతిషశాస్త్రంపై అందుబాటులో ఉన్న తొలి రచన జాతకతిలక (c.1049) అనే గ్రంథాన్ని రచించాడు. ఇంకా ఇప్పుడు అంతరించిపోయిన చంద్రప్రభచరితె ను కూడా రచించాడు.[5]