యం.వి.రమణారెడ్డి
యం.వి.రమణారెడ్డి పూర్తి పేరు మల్లెల వెంకట రమణారెడ్డి[1]. ఎమ్వీఆర్ పేరుతో కూడా ప్రసిద్ధుడైన ఇతడు కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, రచయిత, ప్రొద్దటూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు. ఇతడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. గుంటూరులో చదివే రోజుల్లో కవిత అనే మాసపత్రికను కొంతమంది మిత్రులతో కలిసి నడిపాడు. ప్రభంజనం అనే రాజకీయ పక్షపత్రికను కొంతకాలం వెలువరించాడు. రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ విమోచనా సమితిని స్థాపించినాడు[2]. ఇతడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతని రచనలు ఉదయం, జ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియాటుడే, ఈనాడు, సాక్షి, రచన, నవ్య, సీమ సాహితి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.[3]
సౌమ్యంగా, వినమ్రంగా, సంస్కారవంతంగా, స్నేహశీలిగా ఉంటూ బక్కపలచగా కనబడే ఎమ్వీఆర్ వ్యక్తిత్వంలోని విభిన్న పార్శ్వాలు: మెడికల్ డాక్టరు, క్రిమినల్ ఫాక్షనిస్టు, అదే క్రిమినల్ కేసులో తన కేసు తనే వాదించుకోవడం కోసం పట్టుబట్టి లా చదివిన లాయరు, హత్య కేసులో ఖైదీ, శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యమ నాయకుడు, కథారచయిత, అనువాదకుడు, రచయితగా రాయలసీమ సమస్యలు, వ్యాకరణం, చరిత్ర, సినిమాల మీద రాసిన పుస్తకాలు[2]. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, రాయలసీమ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఎమ్వీఆర్ రాసిన రాయలసీమ కన్నీటిగాథ పుస్తకం రాయలసీమ ఉద్యమాలకు ఊతమిచ్చింది.
రచనలు
మార్చు- తెలుగు సినిమా స్వర్ణయుగం (సమీక్షా వ్యాసాలు)
- చివరకు మిగిలింది? (అనువాదం, మూలం:గాన్ విత్ ది విండ్)
- ఆయుధం పట్టని యోధుడు (మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర)
- పరిష్కారం (కథలసంపుటి)
- రెక్కలు చాచిన పంజరం (అనువాదం, మూలం: పాపియాన్)
- మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది
- పురోగమనం (అనువాదం, మూలం: అవే విత్ ఆల్ పెస్ట్స్)
- రాయలసీమ కన్నీటిగాథ (రాయలసీమ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి)
- పెద్దపులి ఆత్మకథ (అనువాదం, మూలం: ఎ టైగర్ ఫర్ మాల్గుడి)
- మాటకారి (అనువాదం, మూలం: టాకటివ్ మ్యాన్)
- కడుపుతీపి (అనువాదం, మూలం: ద మదర్)
- ప్రపంచ చరిత్ర (నాలుగు సంపుటాలు)
- తెలుగింటి వ్యాకరణం
- శంఖారావం (వ్యాస సంపుటి)
మరణం
మార్చుడాక్టర్ ఎంవీ రమణారెడ్డి (78) 29 సెప్టెంబర్ 2021న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "మనకాలం వీరుడు ఎమ్వీఆర్".
- ↑ 2.0 2.1 "బహుముఖ యోధుడు".
- ↑ Andrajyothy (30 September 2021). "అరుదైన సాహితీ 'సీమ' కారుడు". Archived from the original on 30 సెప్టెంబరు 2021. Retrieved 30 September 2021.
- ↑ Sakshi (29 September 2021). "మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత". Archived from the original on 30 సెప్టెంబరు 2021. Retrieved 30 September 2021.