యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ
యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురంజిల్లా హిందూపురం తాలూకా కొండాపురం గ్రామంలో 1886, జనవరి 25కు సరియైన పార్థివ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి నాడు శేషశాస్త్రి, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణకులంలో ములకనాడు శాఖకు చెందిన శర్మ శౌనకస గోత్రుడు. ఇతడు చిన్నతనంలో పల్లెటూరి బడిపంతుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఉపనయనమైన తరువాత చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకా చదుము గ్రామంలో శంకరావధాని వద్ద వేద విద్య చదువుకున్నాడు. కుందలగురికి వేంకటనారాయణకవి ఇతనికి ఛందో వ్యాకరణాలు నేర్పించాడు.
యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ | |
---|---|
జననం | యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ 1886 జనవరి 25 ![]() |
ప్రసిద్ధి | కవిచంద్ర |
మతం | హిందూ |
పిల్లలు | నాగేశ శర్మ |
తండ్రి | శేషశాస్త్రి |
తల్లి | వెంకమ్మ |
రచనలుసవరించు
- శ్రీ పులివెందల రంగనాయకశతకము
- శ్రీరుక్మిణీ కళ్యాణము
- వామన చరితము
- అనసూయ
- సావిత్రోపాఖ్యానము
- కర్ణాభ్యుదయము
- శ్రీ భక్తజన మనోభిరామము
బిరుదముసవరించు
గోరంట్ల గ్రామంలో జరిగిన పండితమండలి మహాసభలో చిలుకూరు నారాయణరావు ఇతనికి కవిచంద్ర అనే బిరుదును ప్రదానం చేసి సత్కరించాడు.
రచనల నుండి ఉదాహరణలుసవరించు
1.శ్రీకర్ణాభ్యుదయము కావ్యములోని పుత్రునికై కుంతీదేవి విలపించే ఘట్టం
హా!యను;ముద్దుగుల్కు తనయా!యను నిర్జితసుందరాస్య చం
ద్రా! యనుఁ దాపదుఃఖ రహితా!యను నిందిత శంబరారి రూ
పా! యను దివ్యధామ దినపా!యను బంధుర భర్మవర్మ దీ
ప్తా! యనుఁగార్యమింక గలదా!యనుఁదానెనలేని వంతచేన్
తదనంతరంబ నలుదెసలం బరికించి
పుత్రుఁడా!జితకాంతి మిత్రుడా! సౌవర్ణ
గాత్రుఁడా!నీకునే శత్రునైతిఁ
జూతునా! నిన్నింక నేతీరుగానైన
బ్రీతిచేఁగనులార భూతలమున
నందనా! నినుఁబాసి యుందునా మహియందు
మందునా! నేనింక గుందువదలి
కొమరుఁడా! నాపాలి యమరుఁడా! మాముద్దు
కొమరుఁడా! యనఁదగు కొమరువాఁడ
చేతులారంగఁజేసితి పాతకంబు
నీతిదప్పితి నే పుత్ర ఘాతినైతి
భూతలంబున సత్కీర్తి వొందనైతి
వేయు నేటికి నీకునే దాయనైతి
2.శ్రీ భక్త జన మనోభిరామము కావ్యం నుండి
మోకులం బిగగట్టి మోకరించుచు లాగి
వీకతోగేకలు వేయువారు,
గోవింద!గోవింద!గోవింద! యనుచును
తేరీడ్చుటకు ముందు దెరలువారు
తేరు చక్కియలందు జేరి బారులుదీరి
బూర గొమ్ములనూది పొనరువారు
జయ వేంకటాద్రీశ! జయ శేషశైలేశ!
జయదేవ సర్వేశ! జయతు యనుచు
సొరిది కరతాళములదట్టి తిరుగువారు
చెలఁగి హరినామకీర్తనల్ సేయువారు
గ్రక్కునను శౌరినటగాంచి మ్రొక్కువారు
మొట్ట మొదలున ముడుపులు గట్టువారు
వేత్ర హస్తుల పంక్తి వేంకటేశుని మ్రోల
వ్రాలి మున్నిడి బరాబరులు సలుప
భూమీసురోత్తముల్ వేమరుస్వామికి
వింజామరమ్ములు వేయుచుండ
సాధ్వీమణులు గూడి సాగు యరదముపై
మల్లియల్ మొల్లలు జల్లువారు
వేల్పు బానిసలెల్ల చాల్పుగా నిలుచుండి
నతులొనర్చుచు నర్తనములు సలుప
వేద నాదంబుచే ద్విజుల్ విల్లసిలగ
తూర్యనినదంబులమిత సంతోషమొసగ
హారతులనెత్తి రహిజెంది యబలలలర
వేంకటేశుండు రథమున వెలుగుచుండె
మూలాలుసవరించు
- ↑ కల్లూరు, అహోబలరావు (జూలై 1975). రాయలసీమ రచయితలచరిత్ర ప్రథమసంపుటి (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 19-23.