యవనిక (నాటక వ్యాసాలు)

పెద్ది రామారావు రాసిన నాటక వ్యాసాల సంకలనం


యవనిక అనేది నాటక వ్యాసాలతో కూడిన పుస్తకం. నాటకాలు, నాటకాల తీరుతెన్నులు, నటీనటుల గురించి డా. పెద్ది రామారావు రాసిన 34 వ్యాసాలతో ఈ పుస్తకం వెలువడింది.[1][2] ఇందులోని వ్యాసాలలో ఎక్కువభాగం ఆంధ్రజ్యోతి సహా అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని వ్యాసాలు రచయిత స్వయంగా నడుపుతున్న "యవనిక" పత్రికలో ప్రచురితమైనవి. నాటకాల పనిలో, బోధనలో అనుక్షణం నిమగ్నమై ఉన్న పెద్ది రామారావు సమకాలీన తెలుగు నాటక స్థితిగతులను అత్యంత విమర్శనాత్మకంగా ఈ పుస్తకంలో వ్రాసారు. నాటకాల గురించి, ఇప్పటి తరానికి తెలియచేసిన ఈ యవనిక నిజంగా గొప్ప ప్రయత్నం.[3]

యవనిక (నాటక వ్యాసాలు)
కృతికర్త: డా. పెద్ది రామారావు
ముఖచిత్ర కళాకారుడు: అనంత్ చింతపల్లి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటక వ్యాసాలతో కూడిన పుస్తకం.
విభాగం (కళా ప్రక్రియ): నాటకం
ప్రచురణ: ట్రస్ట్ ఫర్ ఎడ్యూకేషన్, ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ (టీట్)
విడుదల: 2015, డిసెంబరు 18
పేజీలు: 200

పుస్తక విశేషాలు

మార్చు

ఈ పుస్తకంలో మహానటుల జ్ఞాపకాల గురించి, నాటకాల దుస్థితుల గురించి రాసిన కొన్ని వ్యాసాలు బాధ కలిగిస్తాయి. నాటకాల ఇతివృత్తం, నాటక ప్రదర్శన, నటుల అనుభవాలు, ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాటు లోతైన, గాఢమైన అనుభవాల్ని మిగులుస్తాయి. హరిశ్చంద్ర, పడమటి గాలి వంటి సంప్రదాయిక నాటకాల గురించే కాదు, నాటక రంగంలో, అందులోనూ గ్రామీణ నాటకాల్లో చోటు చేసుకుంటున్న కొత్త పోకడల్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. సినిమా మాధ్యమంతో ప్రభావితమవుతున్న నాటక కళారూపాల గురించే రాశారు. కథ, కథనం, సంభాషణలు, పాత్రలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఉండే యుగళ గీతాలు, పోరాటాలు, ఇతర జిమ్మిక్స్ కూడా ఈ నాటకాల్లో ఉంటాయి. ఐటెం పాటలతో సహా ఎంత లేదన్నా పది పదిహేను పాటలుంటాయి. పైగా ఇవి సినిమా నిడివిని కూడా మించిపోతుంటాయి. దాదాపు పాతిక సంవత్సరాల క్రితమే గుంటూరు జిల్లాకి చెందిన బాషా అనే రచయిత సినిమాలను ఆధారం చేసుకుని ఈ నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పటి నుంచీ వీటికి విస్తృతి పెరిగి బాషా నాటకాలుగా స్థిరపడ్డ వైనం గురించీ వివరంగా రాశారు. యవనికలోని ఏ వ్యాసమూ వ్యాసంగా అనిపించదు. ప్రతిదీ ఓ మానవీయ కోణపు కథగా అనిపిస్తుంది.[4]

గురజాడ అప్పారావు దగ్గరినుంచి పాటిబండ్ల ఆనందరావు దాక ఆధునిక తెలుగు నాటకరంగంలో వచ్చిన మార్పులను తెలియజేస్తూ, మరి మనమేంటి ఇంకా ఆంధ్ర నాటక కళా పరిషత్ రోజులలోనే ఆగిపోయామనే సందేహాన్ని కలుగ చేస్తాయి. అలాగే, చీమకుర్తి నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావు, సంపత్ నగర్ లక్ష్మణరావు, షణ్ముఖి ఆంజనేయ రాజు గురించి రాసినవి చదువుతుంటే, దృశ్యం కళ్లకు కట్టినట్లు కనపడుతూ, కళ్ళ నీళ్ళు పెట్టించడం చూశాక, నాటకాన్ని సాహిత్యం నుంచి దూరం చేశారని బాధపడటం మానేసి, మీరెందుకు ఆ పని చెయ్యలేక పోతున్నారని అడగాలనిపించేంత అద్భుతమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.

ఒక వ్యాసంలో ఆయన చెప్పినట్లు, మొన్న సినిమా వచ్చింది, నాటకం ఉంది, నిన్న ఇంట్లోకి టీవీ వచ్చింది, నాటకం ఉంది. జేబుల్లోకి ఇంటర్నెట్ వచ్చింది, ఇంకా నాటకం ఉంది. రేపు ఏమొచ్చినా నాటకం ఉండాలి అని గట్టిగా నమ్ముతూ, ‘నేను నాటక కళాకారుణ్ని’ అని గర్వంగా తల ఎత్తుకు తిరిగే రోజులు రావాలన్న నిండు ఆశతో, ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా యువతరానికి సరైన సూచనలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.[5]

మూలాలు

మార్చు
  1. ఈనాడు. "జ్ఞాపకాల తెర..." భానుప్రసాద్‌. Archived from the original on 18 జూన్ 2016. Retrieved 6 January 2018.
  2. నవతెలంగాణ (26 March 2016). "గోల్డెన్‌ జ్ఞాపకాల త్రెషోల్డ్‌". www.navatelangana.com. ఎస్సార్కె. Archived from the original on 4 ఏప్రిల్ 2016. Retrieved 6 January 2018.
  3. తెలుగుమీడియా9, రివ్యూస్, సాహిత్యం. "`యవనిక` నిజంగా గొప్ప ప్రయత్నం…". www.telugumedia9.com. మోహన్ రావిపాటి. Retrieved 6 January 2018.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం తే.15.05.2016 - 30వ పుట - జి.రాజశుక సమీక్ష
  5. ఇండ్ల, చంద్రశేఖర్ (2016-04-04). "యవనికకు ఎంత ధైర్యం?". Sakshi. Archived from the original on 2021-04-19. Retrieved 2023-03-17.

ఇతర లింకులు

మార్చు