యాదాటి కాశీపతి

యాదాటి కాశీపతి అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, రచయిత.

విశేషాలుసవరించు

ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (జర్నలిజం) చదివాడు. ఎం.ఎ.లో బంగారుపతకం సాధించాడు. చదువు పూర్తి అయిన తరువాత ఇతనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే చండ్ర పుల్లారెడ్డి సలహాతో ఆ ఉద్యోగాన్ని త్యజించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యాడు[1].

రాజకీయ జీవితంసవరించు

ఇతడు తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పనిచేశాడు. సి.పి.ఐ. (ఎం.ఎల్.) ఏర్పడక ముందు కో-ఆర్టినేషన్ కమిటీలో, ఆ తర్వాత చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సి.పి.ఐ. (ఎం.ఎల్.)లో చురుకైన పాత్ర పోషించాడు. 1972లో గుంటూరు లో జరిగిన విరసం మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత చైనా మిత్రమండలి, ఎ.పి.సి.ఎల్.సి వ్యవస్థాపకులలో ఇతడు కూడా ఉన్నాడు. వేలాదిమందికి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా రాజకీయ అర్థశాస్త్రాన్ని బోధించడంలో ఇతడికి ఇతడే సాటి. చండ్ర పుల్లారెడ్డి తరిమెల నాగిరెడ్డి, రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో కలిసి పనిచేసిన అనుభవం ఇతడికి ఉంది. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలల పాటు ముషీరాబాద్‌ లో జైలు జీవితం గడిపాడు. జైల్లో ఈయనతో పాటు ఉన్న వరవరరావు, ఇతర ముఖ్యనేతలెందరికో రాజకీయ తరగతులను బోధించాడు. సీపీఐ (ఎంఎల్) పార్టీ తరపున సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో అక్కడే పాటలు పాడే ఓ గిరిజన యువతిని పెళ్ళి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు.

పాత్రికేయ జీవితంసవరించు

ఇతడు సి.పి.ఐ. (ఎం.ఎల్.) పార్టీ పత్రిక విమోచన"కు 1977 నుండి 1979 వరకు సంపాదకుడిగా పనిచేశాడు. జనశక్తి, ప్రజాపంథా పత్రిక సంపాదకమండలిలో సభ్యుడు. సంఘర్షణ అనే పత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు. తరువాతి కాలంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, వార్త లలో 20 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశాడు. కలర్ చిప్స్ అనే సంస్థలో కొంత కాలం పనిచేశాడు.

రచయితగాసవరించు

రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లను బూటకపు ఎన్కౌంటర్‌లో పోలీసులు చంపినప్పడు ఇతడు వ్రాసిన 'ఉయ్యాలో... జంపాలో' అనే పాట ప్రజల నోళ్లలో నానింది. అంతే కాకుండా పి.డి.ఎస్.యు సంస్థ గీతం 'బిగించిన పిడికిలి -పీడీఎస్‌యూ చిహ్నం' పాటను కూడా వ్రాశాడు. తెలుగు సమాజానికి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ విప్లవ బుద్ధిజీవులను పరిచయం చేసిన ఘనత ఇతనిది. 1980 దశకంలో ఉన్నపుడు విప్లవ నాయకుడు సత్యనారాయణ సింగ్ ఉపాన్యాసాన్ని ఇతడు తెలుగులో తర్జుమా చేసేవాడు. ఇతడు శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు. శ్రీశ్రీ కవిత్వం ఎప్పడూ ఇతడి పెదాలపై ఆడుతూ ఉండేది. ఇతడు చివరిదశలో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ కూడా 'మధ్యతరగతి మందు హాసం' అనే పేరుతో శ్రీశ్రీ సాహిత్యంపై విమర్శనాత్మక గ్రంథాన్ని వెలువరించాడు.

మరణంసవరించు

ఇతడు అనారోగ్యం కారణంగా 2016, ఆగస్టు 11వ తేదీన హైదరాబాదులో మరణించాడు.

మూలాలుసవరించు

  1. విలేకరి, ముషీరాబాద్ (12 August 2016). "అక్షర మేస్త్రి... విప్లవ దళపతి కాశీపతి". సాక్షి. Retrieved 12 August 2016.