రాజా సోంభూపాల్
రాజా సోంభూపాల్ అమరచింత సంస్థానాధీశుడు, మాజీ శాసనసభ్యుడు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మూడు పార్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజా సోంభూపాల్, 1927 మార్చిలో హైదరాబాదులో జన్మించాడు.[1] ఈయన స్వగ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్. ఈయన అమ్మాపూర్ దొరగా కూడా ప్రసిద్ధుడు.[2] అమరచింత సంస్థానాధీశుడు, సవాయి రాజా శ్రీరాంభూపాల్, 1930 మేలో మరణించగా, ఆయన భార్య రాణీ భాగ్యలక్ష్మమ్మ, పాలనా అధికారం తనకు సంక్రమించాలని నిజాం ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని పాలనహక్కులను పొందింది. ఆ తర్వాత 1934లో సంతానాన్ని దత్తత తీసుకునేందుకు దరఖాస్తు పెట్టుకొని, అది మంజూరు అయిన తర్వాత, 1939 ఏప్రిల్ 24వ తేదీన, సోంభూపాల్‌ను దత్తత తీసుకున్నది.[3] రాణీ భాగ్యలక్ష్మమ్మ సంస్థానధీశురాలిగా కొనసాగిన అనంతరం[4] ఆమె దత్తపుత్రుడు, ముక్కెర వంశానికి చెందిన రాజా సోంభూపాల్ 1962లో అమరచింత సంస్థానానికి రాజుగా పట్టాభిషేకం జరుపుకున్నాడు.[1]
1962లో ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసి, కాంగ్రేసు అభ్యర్ధి జయలక్ష్మీ దేవమ్మను ఓడించి శాసనసభలో అడుగుపెట్టాడు. 1967లో ఆత్మకూరు నియోజకవర్గం రద్దై అమరచింత శాసనసభ నియోజకవర్గం ఏర్పడినప్పుడు, తిరిగి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి జయలక్ష్మీ దేవమ్మపై గెలిచాడు. 1972లో అదే నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్ధిగా ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత, 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రేస్ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డిలో ఓడిపోయాడు.[5] అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ కురుమూర్తి దేవస్థానం అభివృద్ధికి కృషి చేశాడు.[4]
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధిలో ముక్కెర వంశీయుల్లో ఒకరైన రాజా సోంభూపాల్ పాత్ర కీలకమైనదని చెప్పవచ్చు.[1]
రాజా సోంభూపాల్ కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 18, 2019న హైదరాబాద్‌లో మరణించాడు.[1] ఈయనకు ఒక కుమారుడు రాజా శ్రీరాంభూపాల్, కూతురు గౌరీదేవి సంతానం.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "సంస్థానాధీశుడు రాజా సోంభూపాల్ దొర మృతి". ఆంధ్రభూమి. 19 August 2019. Retrieved 21 August 2024.
- ↑ "శాసనసభ్యుల కోట.. చిన్న చింతకుంట". ఈనాడు. 14 November 2023. Retrieved 21 August 2024.
- ↑ "Rani Bhagya Laxmamma vs Commissioner Of Wealth-Tax, Andhra ... on 22 September, 1965". indiankanoon.org. Retrieved 21 August 2024.
- ↑ 4.0 4.1 "రాజా సోంభూపాల్ కన్నుమూత". సాక్షి. 19 August 2019. Retrieved 21 August 2024.
- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 201.