రామకృష్ణ మఠం, హైదరాబాదు

(రామకృష్ణ మఠము, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)

రామకృష్ణ మఠం, హైదరాబాదు బేలూర్ మఠం వద్దగల అంతర్జాతీయ రామకృష్ణ మఠం హైదరాబాదు శాఖ, దీన్ని 1973లో సికింద్రాబాదులో గల మహబూబా కళాశాలకు ఆనుకొని ఉన్న మార్కెట్ వీధిలో చిన్న భవనంలో ప్రారంభించడం జరిగింది.[1] దీనిలో చాలా విభాగాలు ఉన్నాయి. రామకృష్ణ యూనివర్సల్ టెంపుల్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సు, వివేకానంద ఆరోగ్యకేంద్రం, గీతా దర్శనం, వివేకానంద గ్రంథాయలయం, సంత్ దర్శన్, వివేకానంద మ్యూజియం, మొదలైనవి ప్రధానమైనవి.

హైదరాబాదులో గల రామక్రష్ణ మఠం

చరిత్ర మార్చు

అప్పట్లో జంట నగరాల్లో రెండు రామకృష్ణ మఠాలుండేవి. సికింద్రాబాద్ మహబూబా కళాశాలకు పక్కన ఒకటి, బేగంపేట్ పాత విమానాశ్రయం పరిసరాల్లో ఒకటి. బేగంపేట్ మఠం వ్యవహారాల్ని స్వామీ యోగేశ్వరానందజీ చూసే వారు. అతను కాలధర్మం చెందాక నగర ప్రముఖులతో ఒక మేనేజింగ్ కమిటీ ఏర్పడింది. సికింద్రాబాద్ రామకృష్ణ సేవాసమితి బాధ్యతలు కొంత మంది భక్తులు చూసేవారు. స్వామి యతీశ్వరానంద మహరాజ్ హైదరాబాద్ వచ్చినపుడు అతని సమక్షంలో రెండు సంస్థలూ ఒక్కటయ్యాయి. ఆ ఒక్కటి కూడా 1973లో బేలూరు రామకృష్ణ మఠం అనుబంధంగా మారింది. అప్పటి నుంచీ దాదాపు రెండు దశాబ్దాలపాటు స్వామి రంగనాధానంద అధ్యక్షులుగా ఉన్నారు. మఠం విస్తరణలో ఆతను చేసిన కృషి ఎనలేంది. 1979లో రాష్ట్ర ప్రభుత్వం లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో మఠానికి ఎనిమిది ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం రామకృష్ణ మఠం ఉన్న స్థలం అదే. మొదట్లో ముళ్ళ కంపలతో రాళ్ళు రప్పలతో భయంకరంగా ఉండేది. సన్యాసులు, భక్తులు, సిబ్బంది తలో చేయి వేసి దీని రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. రామకృష్ణ మఠానికి దేశ వ్యాప్తంగా నూట ఇరవై, విదేశాల్లో నలభై కేంద్రాలున్నాయి వీటికి తోడు భక్తులు ఏర్పాటు చేసుకున్న సేవా కేంద్రాలు, కర్ణాటకలోని బేలూరులో ప్రధాన మఠం ఉంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కడపలో శాఖలున్నాయి.

కార్యకలాపాలు మార్చు

దీని మాతృ సంస్థ బేలూర్ మఠ్ లో గల రామకృష్ణ మఠంలానే ఇది కూడా సమాజానికి భౌతికంగా, మానసికంగా, సాంప్రదాయకంగా, ఆధ్యాత్మికంగా వీలైనంత సహాయం చేస్తుంది. వివేకానందుడు ప్రవచించిన అన్నదానం, విద్యాదానం, జ్ఞాన దానం అనే వాటికి ప్రతిరూపాలే ఇవి.

వైద్య సేవలు మార్చు

వివేకానంద బోధనల్లో మూడు ముఖ్యమైన సూత్రాలు

  • దరిద్ర దేవోభవ
  • మూర్ఖ దేవోభవ
  • రోగి దేవోభవ

దరిద్రులను, మూర్ఖులను, రోగులను దైవంగా భావించి సేవ చేస్తే అవి భగవంతునికి చెందగలవని వీటి అర్థం. ఇక్కడ అల్లోపతీ, హోమియోపతీ విభాగాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యులు కొంతమంది వారానికి రెండు, మూడు సార్లు ఇక్కడకు విచ్చేసి సేవలు అందించి వెళుతుంటారు.

సహాయక చర్యలు మార్చు

ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచీ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా సహాయక చర్యల కోసం పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తుంది. ఉదాహరణకు 1977-79 లో దివిసీమలో తుఫాను చెలరేగినప్పుడు, 1993-96 లో లాతూర్ లో భూకంపం సంభవించినపుడు, 2004 లో సునామీ సంభవించినపుడు సంస్థ ఎనలేని సహాయం చేసింది. సంస్థకు కేవలం భారతదేశం నలుమూలల నుండే కాక విదేశాల నుంచి కూడా విరాళాలు అందుతాయి.

శ్రీరామకృష్ణ దేవాలయం మార్చు

రామకృష్ణ మఠం ఆవరణలోనికి ప్రవేశించగానే ఇక్కడి ప్రశాంతత, పవిత్రత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ఆవరణలోగల రామకృష్ణుని సార్వత్రిక దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి ధ్యానం చేసుకోవచ్చు. ఆలయం ప్రతి రోజూ ఉదయం 5 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రతి ఉదయం 9:30 నుంచి పూజలు నిర్వహించబడతాయి. సాయంత్రం 6:45 కు హారతి, భజనలు నిర్వహించబడతాయి. ఏకాదశి రోజున హారతి తర్వాత శ్రీరామకృష్ణ సంకీర్తలను భక్తులందరూ కలిసి బృందగానం చేస్తారు. ఆలయానికి ఎడమవైపున అందమైన శారదావనం, కుడివైపున వివేకానంద తపోవనం ఉన్నాయి. ఆలయ ప్రవేశానికి ముందు దారికి ఇరువైపులా ఉన్న పచ్చిక, పూల చెట్లు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి.

భాషా సంస్థ మార్చు

ఈ విభాగం 1981 లో ప్రారంభమైంది. దీనికి ఒక కారణం, వివిధ భాషలను బోధించడం ద్వారా ప్రజలకు జాతీయ సమైక్యతను కూడా చాటిచెప్పవచ్చునని. ప్రపంచీకరణ నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలలో భాషా నైపుణ్యం ఒకటి. అందులో ఆంగ్ల భాషణకు (స్పోకెన్ ఇంగ్లిష్) కు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భాషా విభాగం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. ఈ కోర్సుకు విద్యార్థుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. దీనివల్ల చాలా మంది ఔత్సాహికులను తిరస్కరించక తప్పడం లేదు. అంతేకాక ఈ విభాగం ఆధ్వర్యంలో సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఫ్రెంచి, జర్మన్, చైనీస్, జపనీస్, స్పానిష్ మొదలైన భాషలలో కోర్సులు నిర్వహించబడుతుంటాయి. ఈ సంస్థలో ఒక సెషనుకు 7000 మంది కూర్చొనగలిగే వీలుంది. ప్రతీ యేటా 21000 మంది ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటుంటారు. సంస్థలో 65 మంది ఉన్నత విద్యావంతులైన, అంకిత భావం కలిగిన, ఉత్సాహవంతులైన అధ్యాపకుల బృందం ఉంది. వీరు బోధన కేవలం వ్యాపారాత్మకంగా కాక దాన్ని ఒక తపస్సులా భావించి పనిచేస్తుంటారు. 25 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవంతో, సేవతో భాషా బోధనలో ఈ సంస్థ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొంది.

ప్రతి భాషకు సంబంధించిన కోర్సు నాలుగు దశల్లో ఉంటుంది. బేసిక్, జూనియర్, సీనియర్, డిప్లోమా . ఒక్కో దశ మూడు నెలలపాటు ఉంటుంది. కాబట్టి ఒక అభ్యర్థి ఒక సంవత్సర కాలంలో ఒక భాషలో డిప్లోమా పూర్తి చేయవచ్చు. ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12 వ తేదీన స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లోమా సర్టిఫికేట్లను ప్రధానం చేస్తారు.

గ్రంథాలయం మార్చు

ఆడిటోరియం ఎదురుగా ఉన్న ఇక్కడి గ్రంథాలయంలో పిల్లలకు, పెద్దలకు రెండు ప్రత్యేక విభాగాలుంటాయి. పిల్లల విభాగంలో చిన్న చిన్న కుర్చీలు, టేబుళ్ళు ఉంటాయి. విజ్ఞానదాయకమైన, వివరణాత్మకమైన అనేకమైన బొమ్మలు బాలలకు ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తాయి. పెద్దల విభాగంలో మామూలు గ్రంథాలయాల్లాగే, అనుభవజ్ఞులైన పండితులు ఎన్నుకొన్న అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఇది ఉచిత సేవలను అందిస్తుంది. పుస్తకాలను తమ ఇళ్ళకు తీసుకోదలచిన వారు 100 రూపాయలు డిపాజిట్ చెల్లించి సభ్యత్వాన్ని చేసుకోవచ్చు. ఈ డబ్బును సభ్యత్వాన్ని రద్దుచేసుకొనే సమయంలో తిరిగి ఇవ్వబడుతుంది. ఈ డిపాజిట్ పిల్లలకూ, పెద్దలకూ కూడా వర్తిస్తుంది. క్యాసెట్ల విభాగం నుంచి కూడా పుస్తకాలను తీసుకున్నట్లే క్యాసెట్లను తీసుకునివెళ్ళవచ్చు. ఈ క్యాసెట్లలో సాధారణంగా ఆడిటోరియంలో స్వామీజీలు ప్రతీవారం ఇచ్చే ఉపన్యాసాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విభాగం ఒక్క సోమవారం, సెలవు దినాల్లో తప్ప మిగతా అన్నిరోజుల్లో పనిచేస్తుంది.

హ్యూమన్ ఎక్సలెన్సు మార్చు

నేటి సమాజంలో నానాటికీ కనుమరుగవుతున్న నైతిక, ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించడానికి రామకృష్ణ మఠం, హైదరాబాదు ప్రాచీన ఆదర్శాలను విద్య ద్వారా మానవాళికి అందించవలసిన ఆవశ్యకతను గుర్తించింది. దాని ఫలితమే వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సు. దీన్ని సెప్టెంబర్ 10, 2000 సంవత్సరం స్వామి రంగనాథానంద ప్రారంభించారు.

సన్యాసం మార్చు

ఇక్కడ సన్యాస నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. అవివాహితులకే సన్యాసార్హత. చదువూ, వయసుకు సంబంధించిన నిబంధనలూ ఉంటాయి. వాటిని సంతృప్తి పరిస్తేనే శిష్యరికం. అది కూడా పూర్తి స్థాయి సన్యాసం కాదు. తెల్లటి వస్త్రాలు ధరించి కొన్ని ఏళ్ళ పాటు సేవ చేయాలి. దాదాపు పది సంవత్సరాలు పని చేస్తే గానీ కాషాయ వస్త్రాలు ధరించే వీలు లేదు. ఆ తర్వాత మఠం సంప్రదాయాలననుసరించి పేరు మారుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాల్లో సుమారు పదకొండు వందలమంది సన్యాసులు ఉన్నారు. అందులో చాలామంది ఉన్నత విద్యావంతులు. హోదాల్నీ, ఆస్తిపాస్తుల్నీ వదులుకుని వచ్చినవారే.[2]

స్వామి రంగనాథానంద మార్చు

అసలు పేరు శంకరన్ కుట్టి. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ గ్రామంలో 1908 డిసెంబరు 15న జన్మించారు. 18 ఏళ్ళ వయసులోనే శంకరన్ రామకృష్ణ సంఘంలో చేరారు. మొదటి మజిలీ మైసూరు. ఇక్కడ అతను అన్ని పనులూ చేసేవారు. పాత్రలు తోమటం, వంట చేయటం, బట్టలు ఉతకటం లాంటి పనులు చేసేవారు. లాంఛన ప్రాయమైన విద్య ఆయనకి 5, 6 తరగతులతోనే ఆగిపోయింది. కానీ చదువులలో సారం అంతా కాచి వడపోసారు: ఉపనిషత్తులు, గీత, ఇతిహాసాలు, భారతీయ సాంస్కృతిక చరిత్ర, సంస్కృత అధ్యయనం- ఇవే కాక శ్రీ రామకృష్ణ -వివేకానందుల సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ దశలో శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన శ్రీ శివానంద స్వామిజీ శంకరన్‌కి సన్యాస దీక్ష ఇచ్చారు. శంకరన్ రంగనాథస్వామి అయ్యారు. రంగూన్‌లోని రామకృష్ణ ఆశ్రమానికి 1933 నుంచి 1942 దాకా కార్యదర్శిగా ఉన్నారు. అవి రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు. దేశ విభజన రోజుల్లో రంగనాథానంద కరాచీలో ఉన్నారు (1942-48) తర్వాత రంగనాథానంద స్వామి ఢిల్లీ రామకృష్ణ మిషన్‌కి కార్యదర్శిగా ఉండి ఆ కేంద్రాన్ని అభివృద్ధి పరచారు. ఆ తర్వాత 1962 నుంచి 67 వరకు కలకత్తా లోని రామకృష్ణ మిషన్ సాంస్కృతిక అధ్యయనం కేంద్రం కార్యదర్శిగా వెళ్ళారు.1998లో అధ్యక్షులుగా కలకత్తాలోని బేలూరు మఠానికి వెళ్ళారు. ఇందిరాగాంధీ జాతీయ ఐక్యతా పురస్కారం (1986), గాంధీ శాంతి పురస్కారం (1999) పొందారు. స్వామీజీ ఆంగ్ల భాషలో ప్రతిభావంతుడు.-[3]

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-09-18. Retrieved 2008-10-10.
  2. 2008 డిసెంబరు 14, ఆదివారం అనుభంధం సంచిక ఆధారంగా
  3. ఆచార్య శివరామకృష్ణ ఆంధ్రజ్యోతి 14.12.2008 లో రాసిన వ్యాససారం