రామాయణం సర్వేశ్వర శాస్త్రి
రామాయణం సర్వేశ్వర శాస్త్రి (1889 - 1962) ప్రముఖ రంగస్థల నటులు.[1]
వీరు విజయనగరం జిల్లాలో కోరుకొండ సమీపంలోని భీమసింగి గ్రామంలో లక్ష్మీనరసింహ శాస్త్రి, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి గొప్ప పండితుడిగా "అభినవ భీమకవి" అని పేరు పొందారు. వీరి తాత ముత్తాతలు భీమసింగి గ్రామంలో రామాయణం పురాణ పఠన కాలక్షేపం చేయడం వలన వీరి ఇంటి పేరు "రామాయణం" వారని మారిందని ప్రతీతి.
వీరు విజయనగరంలోని రిప్పన్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదివారు. వీరికి చిన్నతనం నుండే నాటకాలంటే ఇష్టం. వీరు కొంతకాలం కళాశాల ఉపాధ్యాయులుగా పనిచేసి 1947లో పదవీ విరమణ చేశారు. వీరు అనేక నాటక సంస్థలలో చేరి నాటకాలు ప్రదర్శించారు. వీరు విజయరామ డ్రమెటిక్ అకాడమీకి వెన్నుపూస. వీరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రదర్శించని నాటకాలంటూ లేవంటే అతిశయోక్రి కాదు. వీరు ధరించిన పాత్రలలో ముఖ్యమైనవి: "రసపుత్ర విజయం"లో రాజసింహుడు, "రామదాసు"లో రామదాసు, "ప్రసన్న యాదవం", "పాండవోద్యోగం", "పద్మవ్యూహం"లలో శ్రీకృష్ణుడు, "గయోపాఖ్యానం"లో గయుడు, "విజయనగర సామ్రాజ్య పతనం"లో రుస్తుమ్, "హరిశ్చంద్ర"లో హరిశ్చంద్రుడు, "భక్త శిరియాళ"లో శిరియాళుడు, "కృష్ణరాయభారం"లో అర్జునుడు, "చిత్రనళీయం"లో నలుడు, "చింతామణి"లో బిల్వమంగళుడు, చెకుముకిశాస్త్రి. వీరు సంభాషణల ఉచ్ఛారణలోనూ, పద్యపఠనంలోనూ ప్రత్యేకతమైన ప్రతిభావంతులు.
వీరు 1928 ప్రాంతంలో మద్రాసు, మచిలీపట్నం నగరాలలో ప్రదర్శించిన రామదాసు, హరిశ్చంద్ర పాత్రలు బహుళ ప్రశంసలు అందుకున్నాయి.
వీరు 1962 సంవత్సరంలో అనకాపల్లిలో పరమపదించారు.
మూలాలు
మార్చు- ↑ సర్వేశ్వరశాస్త్రి, రామాయణం, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 918-9.