రాయచూరి యుద్ధము

రాయచూరు దక్షిణ భారతదేశమందలి కర్ణాటక రాష్ట్రములోని చిన్న పట్టణం. కృష్ణ తుంగభద్ర నదుల అంతర్వేదిలోనున్న ఈ పట్టణం చారిత్రకముగా ప్రసిద్ధి గాంచింది. విజయనగర రాజులకు, గుల్బర్గా, బిజాపూరు సుల్తానులకు మధ్య పెక్కు యుద్ధములకు కారణమైనది. శ్రీ కృష్ణదేవరాయలకు అహమ్మదు షాకు మధ్య 1520లో జరిగిన యుద్ధము దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి.

తొలిపలుకు మార్చు

కాకతీయ రాజు రుద్రుడు 1284లో రాయచూరు కోటను కట్టించెను. కాకతీయుల పతనము తరువాత రాయచూరు విజయనగర రాజుల ఆధీనములోనికి వచ్చింది. 1340లో ముసునూరి కమ్మ నాయకులు రాయచూరు కోటను బలోపేతం చేశారు. 1370లో కోటను బహమనీలు ఆక్రమించారు. అటు పిమ్మట రెండు శతాబ్దములు ఈ కోట కొరకు పెక్కుయుద్ధములు జరిగాయి. సాళువ నరసింహరాయలు మరణించునపుడు రాయచూరు కోటను తిరిగి సాధించవలెనను కోరిక వెలిబుచ్చెను. 1509లో శ్రీ కృష్ణదేవరాయలవారు సింహాసమెక్కినప్పటినుండి ఈకోరిక వారి మనస్సులో బలపడసాగినది.

1520లో రాయలవారు సయ్యదు మరైకారు అను ఒక మహమ్మదీయుని డబ్బు దస్కముతో గుర్రములు కొనుటకు గోవా పంపిరి. ఆతను దారిమధ్యలో డబ్బుతోసహా ఆదిల్ ఖాను చెంతచేరెను. మరైకారుని అప్పగించమని రాయలవారు ఆదిల్ ఖానునికి కబురంపారు. ఖాను ఈవార్తను పెడచెవిని పెట్టెను. ఆగ్రహించిన రాయలవారు యుద్ధమునకు తగు సన్నాహములు గావించిరి. అమరనాయకులందరికి ఆహ్వానములు వెళ్ళినవి. మంచి ముహూర్తమునకై పండితులను సంప్రదించిరి.

సైన్యము మార్చు

రాయలవారు విజయనగరములోని గుడులలో పూజలు చేసి సైన్యముతో వెడలారు. వారికి ముందు ఐదు కిలోమీటర్ల దూరములో యాభై వేల మంది గూఢచారులు తరలివెళ్ళారు. దారిలోని పరిస్థితులు సైన్యమునకు ఎప్పటికప్పుడు తెలిచేయుట వారి పని. చారులకు రక్షణగా రెండువేలమంది రౌతులు ధనుర్బాణాలతో వెళ్ళారు. సైన్యమునకు కావలిసిన వస్తువులు అమ్ముటకు వేలమంది వర్తకులు కూడా ఉన్నారు. అందరితో కలుపుకొని 7,36,000 మంది సైన్యము, 32,600 గుర్రాలు, 550 ఏనుగులు ఉన్నాయి. ఆ కోలాహలము చూస్తుంటే ఒక పట్టణమే తరలివెళ్ళుతున్నదా అన్న అనుమానము వస్తుంది.

అందరికీ ముందుగా పెమ్మసాని రామలింగ నాయుడు అను ముఖ్యసేనాధిపతి ఉండెను. ఈతనికి కమ్మ నాయకుడను పేరుకూడ గలదు. రామలింగనితోబాటు 30,000 కాల్బలము (ధనస్సులు, ఈటెలు, బల్లెములు, కత్తులు, డాలులు, తుపాకులతో), వేయి గుర్రములు, ఏనుగులు గలవు. రామలింగని వెనుక తమతమ బలగములతో తిమ్మప్ప నాయకుడు, అడపా నాయకుడు, కుమార వీరయ్య, గండ రాయలు (విజయనగర పట్టణ రక్షకుడు) గలరు. వీరితోబాటు మహావీరులగు రాణా జగదేవు, రాచూరి రామినాయుడు, హండె మల్లరాయ, బోయ రామప్ప, సాళువ నాయుడు, తిప్పరసు, అయ్యప్ప నాయుడు, కొటికము విశ్వనాథ నాయుడు, చెవ్వప్ప నాయుడు, అక్కప్ప నాయుడు, కృష్ణప్ప నాయుడు, వెలిగోటి యాచమ నాయుడు, కన్నడ బసవప్ప నాయుడు, సాళువ మేకరాజు, మట్ల అనంత రాజు, బొమ్మిరెడ్డి నాగరెడ్డి, బసవ రెడ్డి, విఠలప్ప నాయుడు, వీరమ రాజు ఉన్నరు.

సైనికులందరివద్ద తగు ఆయుధములున్నాయి. డాలులు ఎంతపెద్దవంటే ఒంటిని కాపాడుకొనుటకు వేరే కవచము అవసరము లేదు. గుర్రాలకు, ఏనుగులకు రంగురంగుల గుడ్డలు తొడిగారు. ఏనుగులపైనున్న హౌడాలు ఏంతపెద్దవంటే వాటిలో నలుగురు సైనికులు చొప్పున రెండువైపుల యుద్ధము చేయవచ్చు. ఏనుగుల దంతాలకు పొడవాటి కత్తులు వేలాడదీశారు. పలు ఫిరంగులుకూడ ఉన్నాయి. ఇరవైవేలమంది చాకలివారు, వేశ్యలుకూడ తరలివెళ్ళారు. రాయలవారి దగ్గరలో ముందువైపున, నీరునింపిన తోలుతిత్తులతో పన్నెండు వేలమంది సేవకులు సైనికులకు నీరందించుటకు ఉన్నారు. ఈవిధముగా రాయలవారు మల్లయ్యబండ (ప్రస్తుత మలియాబాదు) అను ఊరు చేరి గుడారము వేసిరి. ఇది రాయచూరికి 5 కి.మీ. దూరములో ఉంది. రాజుగారి గుడారము చుట్టూ ముళ్ళతోకూడిన కంప వేసిరి. సైన్యము విశ్రాంతి తీసుకొనుటకు ఆదేశములిచ్చిరి.

తదుపరి సైన్యము రాయచూరి కోట దగ్గరకు చేరెను. కోట తూర్పువైపున గుడారాలు వేసి ముట్టడి మొదలుపెట్టారు. కొంతసేపటికి 1,40,000 సైన్యముతో (రౌతులు, కాల్బలము) ఆదిల్ షా కృష్ణా నది ఉత్తరపు ఒడ్డుకి వచ్చాడని రాయలవారికి వార్త అందింది. కొద్దిరోజుల విరామము తర్వాత షా నదిని దాటి రాయచూరి కోటకు తొమ్మిది మైళ్ళ దూరములో గుడారము వేశాడు. ఇది నదికి ఇదు మైళ్ళ దూరము.

పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రాయలవారి శిబిరాన్ని ఇలా వర్ణించాడు.

"యుద్ధశిబిరములో ఏవస్తువుకూ కొదవలేదు. ఏదికావాలన్నా దొరుకుతుంది. కళాకారులు, స్వర్ణకారులు నగరములోనున్నంత హడావిడిగా ఉన్నారు. అన్నిరకముల రత్నాలు, వజ్రములు, ఆభరణాలు వగైరా అమ్మకానికి ఉన్నాయి. తెలియనివారు అచట యుద్ధము జరగబోతున్నదని ఊహించలేరు. సంపదతో అలరారుతున్న పెద్ద నగరములో ఉన్నారని అనుకుంటారు".

పోరు మార్చు

 
పోర్చుగీసు సైన్యం

1520 మే నెల పంధొమ్మిదవ తేదీ శనివారము తెల్లవారగనే రెండు సేనలు పోరుకు తలపడ్డాయి. రాయలవారి సేన యుద్ధభేరీని మోగించింది. భేరీలు, నగారాలు, కేకలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆ భయంకరమైన శబ్దానికి గాలిలో విహరిస్తున్న పిట్టలు తొట్రుపడి సైనికుల చేతుల్లోకి వచ్చి పడ్డాయి. మాటలు వినపడక సైగలతోనే సరిపెట్టుకోవాల్సిన స్థితి.

రాయలవారు రెండు పటాలములతో ముందుకేగి దాడిచేశారు. వారి ధాటికి తురుష్క సేనలు పారిపోయి కందకాలలో దాగారు. అపుడు సుల్తాను ఫిరంగులుపయోగించి హిందూ సేనలకు అపార నష్టము కలిగించాడు. దీంతో తురుష్క సేన విజృంభించి హిందువులను దునుమాడుతూ ఒక మైలు దూరము తరిమారు. ఆ సందర్భములో రాయలవారు తమ సహజసిద్ధమైన శౌర్యపటిమతో సేనలనుత్తేజపరిచారు. గుర్రమునెక్కి తురుష్కసేనలోకి సూటిగా దూసుకెళ్ళారు. వారితోబాటు సేనాధిపతి రామలింగ నాయుడు ఆతనివెంటనున్న యోధులు అసమాన శౌర్యప్రతాపాలు ప్రదర్శించారు.

రామలింగ మార్చు

రాయవాచక కర్త విశ్వనాథ స్థానాపతి, రామలింగని శౌర్యాన్నిలా వర్ణించాడు.

"...... ఆయన సంతరించిన ఎనభైవేల చివ్వలవారున్నూ రణపెండ్లికొడుకులై ఇక్కడి ఆశపాశలు విడిచి కయ్యమందేదీ వియ్యమందేదిగా ఎంచి అని మీది దృష్టిచే రామలింగనాయని వెంబడిని నడువంగా తురకలు ఈ వార్తలువిని డేరిజావద్ద జీరాసంజోగంతో విచ్చుకత్తుల రౌతులు అరవైవేలున్నూ వారిని చుట్టుక నిండు సంజోకం గుర్రాలు పదివేలకున్నూ వార్లను అనుభవించుకయుండె మదహత్తులు వెయ్యికిన్ని ఈరీతిన డేరిజావద్ద ఉంచి మూడుతెగల తురకలున్నూ తమతమ పాళ్యములో ఆయత్తపాటుతో జాగ్రత్తకలిగియుండగా రామలింగనాయడు తురకల పాళ్యంవారి సమీపానికిపోగానే గుర్రాన్ని కత్తికేడం తీసుకొని ఏనుగుల బారుమీద శైలతటానికి సింహపుపిల్లల చందాన తొక్కినడచి మదహత్తీల తొండాలు ఖండాలుగా నరికి మావటీలను ఈటెల చేత కుమ్మి తోయగా ఏనుగులవారి మీదికి నడవగలవారు గుర్రాల పక్కరలెత్తి కురుచ ఈటెలతోనున్నూ, పిడిఈటెలతోనున్నూ, పందిబల్లెములతోనున్నూ గుచ్చితోసెదిన్ని దోసకాయల చందాన వేటారు తునకలుగా నరికేదిన్ని ఈరీతి నొప్పించగా గుర్రాలవారు వెనకా ముందై పారసాగారు. అప్పుడు నాలుగువేల గుర్రం చాపకట్టుగా పడగా అటువెనుక విచ్చుకత్తుల రవుతులమీద నడచి జగడం ఇయ్యగా సరిచావులుగా ఆరువేలకు నాలుగు వేల రవుతులు పడ్డారు. అంతట రామలింగమనాయడు డేరీజు తాళ్ళు తెగకోయించగా, డేరీజా నేలకూలిన క్షణాన కృష్ణరాయలవారు భేరీతాడనము చేయించి మదహత్తిని ఎక్కుకొని ఉభయఛత్రాలొ మకర టెక్కెలతో నూట ఇరువై ఘట్టాలు ఏనుగులున్నూ అరవైవేల గుర్రాలున్నూ ఐదు లక్షల పాయదళమున్నూ పొట్లంగా నడిచారు. కనుక ఆక్షణాన కృష్ణవేణి ఉభయతీరాలున్న ప్రవాహం నిండి రాసాగింది".

తురుష్క సైన్యము నది దాటడానికి ప్రయత్నించింది. రామలింగని యోధులు వారిని వెంబడించి ప్రవాహములోనే వేలమందిని వధించారు. రాయలవారు కృష్ణానది దాటి అహమ్మదు షా వెంటబడగా ఆతడు అసదు ఖాను సాయముతో ఏనుగునెక్కి పారిపోయాడు. సలాబతు ఖాను అను తురుష్క సేనాని ధైర్యము వీడక చివరివరకు పోరాడి రాయలవారికి బందీగా చిక్కాడు.

రాయలవారు విజయోత్సాహముతో రాయచూరు కోటకి తిరిగివచ్చి దాడికొనసాగించారు. ఈ కోట ముట్టడిలో క్రిస్టొవావ్ డి ఫిగరెడొ అను పోర్చుగీసు శూరుడు ఎంతోసాయమందించెను. ఆతని సైనికులు కోట మీదనున్న తురుష్క సేనలను తుపాకులతో కాల్చి ఏరివేశారు. కోట స్వాధీనమయింది.

పోరుపిదప మార్చు

యుద్ధము తరువాత సుల్తానులు రాయల వారి వద్దకు రాయబారాలు పంపారు కాని వారికి సరైన సమాధానము లభించలేదు. రాయలవారు విజయనగరము తిరిగివచ్చి పెద్దఎత్తున సంబరాలు చేశారు. ఓడిపొయిన అదిల్ షా రాయబారి రాయలవారి దర్శనముకై నెలరోజులు వేచియున్నాడు. సుల్తాను వచ్చి రాయలవారి పాదములకు మొక్కినచో గెలిచిన భూభాగము తిరిగి ఇవ్వబడునని రాయబారికి చెప్పబడింది. దీనికి షా నుండి సమాధానము లేదు. రాయలవారు బిజాపూరు పై దండెత్తి అచట బందీలుగా ఉన్న పూర్వపు బహమనీ సుల్తాను ముగ్గురు కొడుకులను విముక్తులను చేశారు. పెద్దకొడుకును దక్కను సుల్తానుగా ప్రకటించారు. అటుపిమ్మట అదిల్ షా స్వాధీనములోనున్న బెళగాం పై దండయాత్రకు సన్నాహములు చేయుచుండగా రాయలవారి ఆరోగ్యము క్షీణించి 45ఏండ్లకు 1530లో స్వర్గస్థులైయ్యారు. అచ్యుత దేవరాయలు పట్టాభిషిక్తులయ్యారు.

రాజకీయ పరిణామం మార్చు

రాయచూరు యుద్ధమువల్ల దక్షిణభారత చరిత్ర ఒకవిధముగా పెద్దమలుపు తిరిగింది. ఓడిపోయి బలహీనపడిన అదిల్ షా మిగతా సుల్తానులకు స్నేహహస్తమందించాడు. వారందరూ ఏకమై విజయనగరసామ్రాజ్యాన్ని నాశనము గావించుటకు కంకణబద్ధులయ్యారు. విజయమువల్ల హిందువులకు చేకూరిన గర్వము, అసహనము సుల్తానులకు కంటకమై తళ్ళికోట యుద్ధానికి, విజయనగర విధ్వంసానికి దారి తీసింది. ఒక మహానగరము మృతనగరమయ్యింది. హిందువుల పరాజయమువల్ల దక్కనులో పోర్చుగీసువారి ప్రాభవము కూడా తగ్గిపోయింది. పరదేశీయుల వ్యాపారాలన్నీ తగ్గిపోయాయి.

వనరులు మార్చు