వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 20వ వారం
అడోబీ ఫోటోషాప్ లేక ఫోటోషాప్, ఛాయా చిత్రాలు మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. దీనిని ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ది చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్. ప్రపంచములో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్ మరియూ ఫోటోఎడిటర్లకు ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ది చెందింది. ఏప్రిల్ 16, 2007న విడుదల చేయబడిన అడోబీ ఫొటోషాప్ సిఎస్3, ప్రస్తుతం లభ్యమవుతున్న తాజా వెర్షను.
1987లో అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో థామస్ నోల్ అనే పరిశోధనా విద్యార్థి, తన మ్యాకింటాష్ ప్లస్ కంప్యూటరులో, గ్రే స్కేల్ చిత్రాలను మొనోక్రోం (నలుపు తెలుపు రంగులు మాత్రమే) తెరపై కనిపించేలా ఒక ప్రోగ్రాం వ్రాయటం మొదలు పెట్టాడు. "డిస్ప్లే" అనే ఈ ప్రోగ్రామును థామస్ నోల్, మరియు అతని తమ్ముడు జాన్ నోల్ పూర్తి స్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్టువేరుగా మార్చి 1988లో "ఇమేజ్ ప్రో" అనే మొదటి ఎడిటింగ్ సాఫ్టువేరును తయారు చేసారు. దానిని ఫోటోషాప్ గా పేరుమార్చి, స్కానర్లు తయారు చేసే ఒక కంపెనీతో వారి స్కానర్ పరికరంతో పాటుగా పంపిణి చేసేట్టు ఒప్పందం కుదుర్చుకుని 200 ఫోటోషాప్ కాపీలు అమ్మగలిగారు. సెప్టెంబరు, 1988లో అడోబీ సంస్థ, ఫోటోషాప్ పంపిణీ హక్కులను కొనుక్కుంది.
తరువాత కొన్ని సంవత్సరములపాటు ఫొటోషాప్ ప్రోగ్రాముకు పనితీరుకు మరిన్ని హంగులను జోడించి, దానిని అభివృద్ధి పరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను వుడుదల చేశారు. 2003 ఫిబ్రవరిలో, విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో, వాడుకరులు తమ డిజిటలు కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాన్ని కల్పించారు.
2004 అక్టోబరులో, ఈ ప్రోగ్రాముకు అడోబీ ఫొటోషాప్ CS అనే కొత్త పేరు పెట్టారు. అడోబీ సంస్థ విడుదల చేస్తున్న అడోబీ క్రియేటీవ్ స్యూట్‌లో ఫొటోషాప్ కూడా ఒక భాగం. ఫొటోషాప్‌ను సీ++ ప్రోగ్రామింగు భాషలో రూపొందించారు. అడోబి కంపెనీ వారు ఈ మధ్యనే ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్ పేరుతో ఆన్ లైన్ ఫోటో ఎడిటింగ్ సౌకర్యం కలిగించారు.
....పూర్తివ్యాసం: పాతవి