వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 37వ వారం

ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి ఇప్పటివరకు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. పోటీచేసిన ప్రతీసారి విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయంసాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందినాడు. వెనువెంటనే ముఖ్యమంత్రులు మారినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఆ తరువాత చాలా కాలం పాటు అధికారం దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం వారి విజయానికి బాటలు పరిచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారికి దక్కింది. ఆయన సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో దుర్మరణం పాలయ్యారు.


వై.యస్.రాజశేఖర్ రెడ్డి జులై 8, 1949 లో పులివెందులకు దగ్గర్లోగల జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా అక్కడే సాగింది. గుల్బార్గా విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్ లో పట్టా పుచ్చుకున్నారు. స్విమ్స్ కళాశాల, తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందినారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి