వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 26వ వారం

గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. పట్టణం నడిబొడ్డున సంస్థానాధీశుల కాలం నాటి పూర్తిగా మట్టితో నిర్మించిన కోట కలదు. గద్వాల సమీపంలో ఆత్మకూరు వెళ్ళు రహదారిలో "ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు" ఉంది. 7వ నెంబరు జాతీయ రహదారి నుండి 18 కిలోమీటర్లు లోపలికి ఉన్న గద్వాల పట్టణానికి రైలు మార్గం ఉంది. గద్వాల సమీపంలోని పలు గ్రామాలు కూడా చారిత్రక ప్రాశస్త్యం కలవి. అయిజా, రాజోలి, వేణిసోంపూర్, ఆలంపూర్ తదితర గ్రామాలు కూడా చారిత్రకంగా, పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచినవి. ఇది గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా ఉంది. పట్టణ జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601. ఇందులో పురుషులు 51% మరియు మహిళలు 49%. ఇక్కడి సగటు అక్షరాస్యత 57%.

1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెదసోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనేవారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను కోటలోపల ఏర్పాటు చేసారు. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్)డిగ్రీ కళాశాలగా పెట్టబడింది.


చేనేత పరిశ్రమలో ముఖ్యంగా చీరల తయారీలో గద్వాల పట్టణం రాష్ట్రంలోనే ప్రముఖ పేరు సంపాదించింది. సుమారు నాలుగు శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది.

పూర్తి వ్యాసము, పాతవి