జనాభా

ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు.

సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడుతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్థంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్థంలో జనాభా అన్న పదం వాడబడింది.

వివిధ దేశాల జనాభాను సూచించే చిత్రపటం
భారతదేశ జనాభా 1960లో 44.3 కోట్లు ఉండగా 2000నాటికి 100కోట్లు దాటింది.
దస్త్రం:Mahakumbh.jpg
భూమి మీద ఒక మతోత్సవానికి జమకూడిన అతిపెద్ద జన సమూహం. [2] Archived 2008-10-04 at the Wayback Machine[3] [4] Archived 2010-10-19 at the Wayback Machine 2001 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు సుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.

నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం (Atecology) లేదా జనాభా జీవావరణ శాస్త్రం (Population Biology) అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజ శీలం (Population Dynamics)

జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి అధ్యయనం చేస్తాయి.

జనాభా గురించి కొన్ని సాంకేతిక విషయాలు

మార్చు

జనాభాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి జనన, మరణ రేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభా నియంత్రణ[1]

  • జనన, మరణ రేటు - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభా పరిమాణం పెరుగుతుంది.
  • వలసలు - జనాభాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు (రావడం, పోవడం) అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
  • జన సాంద్రత - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివసించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
  • జీవ సామర్థ్యం (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివసించే జనాభా జీవ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
  • వయో వ్యాప్తి - జనాభా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
  • భార శక్తి - ఒక ఆవాసం భరించగల గరిష్ఠ స్థాయి జనాభాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.

ప్రపంచ జనాభా

మార్చు
 
ప్రపంచ జనాభా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.

2006 ఫిబ్రవరి 25 నాటికి [2] ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. 2012 నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా.[ఆధారం చూపాలి]. ఐక్యరాజ సమితి జనాభా నిధి వారు అక్టోబరు 12 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభా విభాగం వారి అంచనా.[3] గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది[4][5] ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం, ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.

జనాభా తరుగుదల

మార్చు

ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాల వలన జనాభా తరగవచ్చును. గతకాలంలో (ప్లేగు, కలరా వంటి) వ్యాధుల వలన ఒకో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు వెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభా' లేదా 'అల్ప జనాభా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం. జపాన్‌, కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ, ఇటలీ జర్మనీ, గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్, జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు బిడ్డలను కంటే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి: జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా సింగపూర్ : బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా 4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు . బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు రష్యా : రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు (మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు). బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు. జర్మనీ : తండ్రికి కూడా ఏడాది సెలవులు, 75 శాతం జీతం. ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు 1000 డాలర్లు. బిడ్డకి మూడేళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం స్పెయిన్‌:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు. ప్రజా రవాణాలో రాయితీ

జనాభా నియంత్రణ

మార్చు
 
భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.

జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాలను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదాహరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉంది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా ప్రస్తావించబడే ఆన్స్‌లీ కోలే (Ansley Coale) విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'యాదృచ్ఛికం' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం. (3) నియంత్రణకు అవసరమైన విధానాల గురించి మరింత అవగాహన.[6] కేవలం ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్థిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.[7] వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైంది.[8][9] ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.

జనాభా నియంత్రణకు మార్గం

మార్చు

"జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి. నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ"—గులాంనబీ అజాద్

అధిక జనాభా

మార్చు

ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది. ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద సుమారు వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు. ఏటా కోటి మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 683 కోట్లు. ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది. ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అవుతోంది. 2015 ముగిసేసరికి మన దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందట. వీరిలో 60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట. 2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది. అత్యధిక జనాభా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. 2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.

భారతదేశ జనాభా

మార్చు
 
భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభాను సూచించే చిత్రపటం.

భారతదేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడూ ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), చెన్నై (వెనుకటి మద్రాసు ). భారతదేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు (0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారతదేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారు.

భారతదేశంలో జనాభా ప్రకారం 10 పెద్ద నగరాలు

మార్చు

ముంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు, పూణే, కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లు పెరిగింది. 2050కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా. 13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయి. పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువ. దక్షిణాదిలో కూలీల కొరత వలనవలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్ళి చేసుకోవడం, విడాకులు, పెళ్ళికి ముందు కలిసి ఉండటం పెరిగాయి. కుటుంబ నియంత్రణకు లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.

ఆంధ్రప్రదేశ్ జనాభా - 2001

మార్చు

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. 2009 మార్చి 1 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే దేశ జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19%, షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారతదేశం అక్షరాస్యత 64.84%తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.[10] జనాభా వల్ల నష్టాలు‍‍ భారతదేశంలో జనాభా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనాభా ఎక్కువ. కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే ప్రపన్ఛ్

ఆంధ్రప్రదేశ్ జనాభా - 2011

మార్చు

గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభా పెరుగుదల 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది మొదటి స్థానంలో ఉంది. జనాభాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు చేరింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం
  2. papers published by the United States Census Bureau
  3. "World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion" (Press release). United Nations Population Division. March 13, 2007. Retrieved 2007-03-14. The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050.
  4. BBC NEWS | The end of India's green revolution?
  5. "Food First/Institute for Food and Development Policy". Archived from the original on 2009-07-14. Retrieved 2007-12-01.
  6. Ansley J. Coale, "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.
  7. For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," Demography 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," Population Studies 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” Population Index 40 (1974): 185 – 258.
  8. For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," Population Council, Policy Research Division, Working Paper No. 173 (2003)[1] Archived 2009-10-01 at the Wayback Machine.
  9. Charlotte Höhn, "Population policies in advanced societies: Pronatalist and migration strategies," European Journal of Population/Revue européenne de Démographie 3, Nos. 3-4 (July, 1988): 459-481.
  10. ఈనాడు ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం

ఇతర వనరులు

మార్చు
  • ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 2009 ఫిబ్రవరి 20 - ఎం.బి.తిలక్ వ్యాసం

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జనాభా&oldid=4195194" నుండి వెలికితీశారు