వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 44వ వారం

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్ఛమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ రామాయణము, మహాభారతం, శివ పురాణం మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఈజిప్టులో కైరో వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి