వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 49వ వారం

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. 1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు. ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్టగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడినది. ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు.

నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథ ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్భలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది. మొదటిది రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది. కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి