వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 03వ వారం
దక్కన్ పీఠభూమి |
---|
దక్కన్ పీఠభూమి భారతదేశంలోని దక్షిణభాగాన్ని ఆవరించి ఉన్న పెద్ద పీఠభూమి. దీన్నే ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఎక్కువభాగం రాళ్ళతో కూడుకున్న ఈ పీఠభూమి ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు, సగటున సుమారు 600 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, భారత ఉపఖండంలోని దక్షిణ, మధ్య భాగాల్లో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. దీనికి పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగమే ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరాన గల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన భాగాలున్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగిన, అధిక విస్తీర్ణంగల, అనేక పెద్ద నదులు గల ప్రాంతం. ఈ పీఠభూముల్లో భారత చరిత్రలో పేర్కొన్న పల్లవులు, శాతవాహనలు, వాకాటక వంశం, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాదంబ వంశం, కాకతీయులు, ముసునూరి నాయకులు, విజయనగర రాజులు, మరాఠా సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, దక్కన్ సుల్తానులు, హైదరాబాదు నిజాములు రాజ్యాలు ఏర్పాటు చేసుకుని పరిపాలించారు.
|