వికీపీడియా:తెవికీ వార్త/2011-07-10/మాటామంతీ-సి.చంద్రకాంత రావు
మాటామంతీ-సి.చంద్రకాంత రావు
సి.చంద్రకాంత రావు , జులై 10, 2011
- వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
- తెవికీలో నా తొలి దిద్దుబాటు 21 సెప్టెంబరు, 2007 నాడు జరిగింది. కాని అంతకు క్రితమే నాకు తెవికీ గురించి తెలుసు. ఏదో యాదృచ్ఛికంగా తెవికీలో ప్రవేశించడం కాకుండా మొత్తం తెలుసుకొనే తెవికీలో సభ్యత్వం తీసుకున్నాను. నా "లక్ష ప్రశ్నల" జనరల్ నాలెడ్జి తయారీలో భాగంగా అంతర్జాలంలో పనిచేస్తున్నప్పుడు చాలా సార్లు తెవికీ తారసపడింది. అందులో నేనూ రచనలు చేయాలని, నా వంతు సహాయం చేయాలని అనుకోవడంతో తెవికీలో సభ్యత్వం తీసుకున్నాను. తెవికీలో చేరాను కదా అని రచనలు చేయడం కాకుండా రచనలు చేయడం కోసమే తెవికీలో ప్రవేశించాను.
- సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
- తెలుగు ప్రజానీకానికి ఉపయోగార్థమైన విజ్ఞానసర్వస్వంలో సంతోషంతో పనిచేయడాన్ని నేను "కృషి"గా భావించడం లేదు. సమయం దొరికినప్పుడు నా వంతు సహాయం చేస్తున్నాను అంతే. ఇక్కడ పనిచేస్తున్నది గుర్తింపు కొరకు కూడా కాదు. అయిననూ ప్రారంభంలో వైజాసత్య, కాసుబాబు, దేవా తదితర సభ్యులు నన్ను అభిమానించారు, ఉల్లాసపరిచారు, ఉత్తేజపరిచారు. వారందరికీ నా అభినందనలు.
- ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
- ప్రస్తుతం నాకు సమయం లభ్యం కావడం లేనందున కేవలం నిర్వహణ కార్యకలాపాలే చూస్తున్నాను. సభ్యుడిగా చేరిన తొలి ఏడాది వరకు తెవికీలో చురుకుగా ఉండి రోజూ నాలుగైదు గంటలు రచనలు చేసేవాడిని. వర్తమాన ఘటనలులో రోజూ వారి వార్తలను చేర్చడం, అన్ని కొత్త వ్యాసాలను పరిశీలించి ముఖ్యమైన విషయాలను నమోదుచేసుకొని ప్రతి ఆదివారం తప్పనిసరిగా "మీకు తెలుసా" శీర్షికను తాజాకరించడం, ఆర్థికశాస్త్ర వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు, క్రీడారంగ వ్యాసాలు, నియోజకవర్గ వ్యాసాలు వృద్ధిచేయడం, మూసలు తయారుచేయడం, వ్యాసాలు, వర్గాలకు వర్గీకరణ చేయడం లాంటి పనులు చేసేవాడిని.
- వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
- నా ఇల్లే ఒక గ్రంథాలయం. గత రెండున్నర దశాబ్దాలుగా నేను సేకరించిన పుస్తకాలు, దశాబ్దాల నుంచి భద్రపరుస్తున్న వార్తాపత్రికల క్లిప్పింగులు, విజ్ఞానసర్వస్వపు సీడీలు, జిల్లాలకు సంబంధించిన గణాంక పుస్తకాలు, అంతర్జాలంలో శోధించి భద్రపర్చిన విషయాలు, అన్నింటికి మించి దశాబ్దం క్రితం నుంచి నేనే స్వయంగా రూపొందించుకుంటున్న విజ్ఞాన"చంద్ర"స్వం తదితరాలు.
- వికీ కృషిలో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
- నచ్చినవి: ఎవరైనా రచనలు చేయడం వలన ప్రతిప్రాంతం విషయాలు, గ్రంథాలలో లేని కొత్తకొత్త సంగతులు తెలియడం,
- నచ్చనివి: తెవికీ వ్యాసాలను పత్రికలు, వెబ్‌సైట్లు కాపి చేసి తెవికీకి ఎలాంటి గుర్తింపు కల్పించకపోవడం, తెవికీలో స్పష్టమైన పాలసీలు లేకపోవడం, కొందరు సభ్యులు తమ సభ్యపేజీలలో తెవికీకి సంబంధంలేని స్వంతవిషయాలు వ్రాసుకొని వాటిని స్వంతడైరీల మాదిరిగా రూపొందించుకోవడం.
- వికీ ఉపయోగపడిన విధం
- ఆంగ్లవికీ నా "లక్ష"సాధనకు ఉపయోగపడుతున్నది. తెవికీ కూడా అందరికీ అలా ఉపయోగపడేవిధంగా తయారు కావాలని కోరుకుంటున్నాను.
- తెవికీ భవిష్యత్తుకి కలలు
- భవిష్యత్తులో తెవికీ ఒక బృహత్తర, ఉపయోగదాయక విజ్ఞానసర్వస్వం అవుతుందని భావిస్తున్నాను, ఆ విధంగా కావాలనీ మనసారా కోరుకుంటున్నాను.
- తోటి సభ్యులు నుండి మీ కోరికలు
- సభ్యులు చర్చా పేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యాసాల వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి, సభ్యులు వారి జిల్లాల, మండలాల, గ్రామాల వ్యాసాలు పరిపూర్ణం చేయడానికి పాటుపడాలి,
- భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
- తెవికీలోచురుకుగా ఉండే సమయంలో ప్రతిరోజూ రాత్రి 10.00 నుండి తెల్లవారుజామున 3.00 వరకు రచనలు చేసేవాడిని. ప్రస్తుతం అంత సమయం దొరకడం లేదు. అయిననూ రాత్రి 1-2 మధ్యన అరగంట వరకు సమయం కేటాయించి నిర్వహణ కార్యకలాపాలు చూస్తున్నాను. సెలవు రోజులలో సమయం దొరికినప్పుడు మధ్యాహ్నం లేదా సాయంత్రం తెవికీని సందర్శిస్తాను. తెవికీలో ప్రవేశించిన ప్రతీసారి గతంలో నా దిద్దుబాటు నుంచి ప్రస్తుతం వరకు, ముఖ్యంగా కొత్తవారి, ఐపీ అడ్రస్ రచనలు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలిగింపులు చేస్తాను.
- తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
- నా చర్చాపేజీ ఉపయోగిస్తే చాలు. సెలవులో ఉన్ననూ చర్చాపేజీ నుంచి ఈ-మెయిల్ (cckrao2000@yahoo.co.in) ఎలాగూ వస్తుంది.
- తెవికీ వార్త చదువరులకి సందేశం
- తెవికీ మీకు ఎలా తోడ్పడుతుంది అని కాకుండా మీరు తెవికీకి ఎలా తోడ్పడదలుచుకున్నారో ఆలోచించండి.
+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
వీటిలో మార్పులు గమనించాలంటే మీరు ఆర్ఎస్ఎస్ (RSS) ధార కి చందాదారుడవ్వండి లేక మీ వీక్షణ జాబితా లో చేర్చండి. మీ వ్యాఖ్య కనపడకపోతే .
- వీరు చేసిన సేవల వివరములు, గణాంకములు, ప్రస్తుతము వికీ సేవలు, ఇలా మరికొన్ని విషయములు ఇక్కడ ప్రస్తావిస్తే చదువరులు మరింత సమాచారము తెలుసుకొన వీలు కలుగుతుంది.
- అన్నగారి సేవలు మరువ లేనివి, మరపు రానివి అని, వారికి నా అభినందనలు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:00, 10 జూలై 2011 (UTC)