కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

తెలుగు పండితుడు
(కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు నుండి దారిమార్పు చెందింది)

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (మే 18, 1877 - జూలై 12, 1923) తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త,విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
జననంమే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణంజూలై 12, 1923
మద్రాసు
మరణ కారణంఅనారోగ్యం
వృత్తిదివాన్, రచయిత
ప్రసిద్ధిచారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్య / భర్తకోటమాంబ
పిల్లలువినాయకరావు
తండ్రివెంకటప్పయ్య
తల్లిగంగమ్మ

సమకాలీన సాహితీ విప్లవం

మార్చు

"తెలుగు పలుకుల చరితల తెలివి దేర్చి

చదువు సర్వస్వమున వన్నె సంతరియ
మెరపువలె దోచి యక్కటా మింట దాగి
రా కొమర్రాజు లక్ష్మణ రాయ వరులు"

ఉమర్ అలీషా

ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు.[1][2][3]

  • కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919): సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు.
  • గురజాడ అప్పారావు (1861-1915): చిన్నకథకు, వచన వ్యావహారిక నాటకానికి ప్రాణంపోసి, దేశమును ప్రేమించమని, మంచిని పెంచమని బోధించిన వెలుగుజాడ.
  • గిడుగు రామమూర్తి పంతులు (1877-1923): తెలుగు వ్రాతలోనే విప్లవం తెచ్చి, వ్యావహారిక భాషకి సాహిత్యంలో పట్టం కట్టిన వాడు. ఈనాడు సర్వసాధారణంగా మనం వ్రాసే భాషకు ఆ హోదా కల్పించడానికి ఆయన పడ్డ శ్రమ అపూర్వం.

జీవితం

మార్చు

1877 మే 18కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తిచేశాడు.

లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరులో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమే కాక సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.

మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.లక్ష్మణరావు గారు మహారాష్టృలో ఉన్నప్పుడే అనేకమంది విద్వాంసులతో పరిచయం కలిగినది. సా.శ. 1899 సం.లో బాలగంగాధర తిలక్ "రామాయణము"లో చెప్పబడిన పర్ణశాల మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద కలదన్న వాదమును లక్ష్మణరావు తోసిపుచ్చారు. అప్పటికే పర్ణశాల నాసిక దగ్గరకలదను వాదము ఆకాలపు మరాఠి పత్రికలలో ప్రచురితం ఐనను లక్ష్మణరావు దానిని తప్పు అని నిరూపించి, పర్ణశాల గోదావరి సమీపప్రాంతమని మూలమును బట్టి నిరూపించారు. దీనితో మహారాష్ట్ర విద్యాలోకం ఆశ్చర్య చకితమైనది. ముఖ్యముగా తిలక్ గారికి లక్ష్మణరావుతో పరిచయం కలిగించినదీ పర్ణశాల వివాదమే. నాటినుంచి వారిరువురకు గాఢ మైత్రి కుదిరినది. లక్ష్మణరావు తిలక్ గారికి అనుయాయి అయినాడు. అప్పటికి లక్ష్మణరావు వయస్సు 22 సం. మాత్రమే.

1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం', 1906 లో 'విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.

ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బ తిన్నది. 1923 జూలై 12 న, 46 యేళ్ళ వయసులోనే కొమర్రాజు లక్ష్మణరావు మరణించాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణరావు కూడా మరణించాడు.

రచనారంభం

మార్చు

మహారాష్ట్రదేశంలో సమాచార్, వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది.

అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో బెజవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వేంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తికోసం నడిపే "తెలుగు జనానా" పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. "శివాజీ చరిత్రము" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరాయ వ్యాసావళి"[4] పేరుతో ప్రచురితమైనాయి.

శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం

మార్చు

కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలసి హైదరాబాదు లోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో 1901 సెప్టెంబర్ 1శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయమును స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగింది. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు.

విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి

మార్చు

సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి, లక్ష్మణరావు, నాయని వేంకటరంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి వోటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం.....పంచముల అస్పృశ్యత రూపుమాపనిది స్వరాజ్యము రానేరదు. .... ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధియైన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకము.

విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "అబ్రహాం లింకన్". దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు.

మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని ఈ పట్టికలో చూడొచ్చు:[5]

ప్రచురణ కాలం గ్రంథం పేరు రచయిత పేరు
చరిత్రలు
1907 అబ్రహాంలింకను చరిత్ర గాడిచర్ల హరిసర్వోత్తమరావు
1907 హిందూ మహాయుగం (క్రీ,శ.1000 వరకు) కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
1908 మహమ్మదీయమహాయుగం (సా.శ.1000 నుండి 1560 వరకు) కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
1910 ఆంధ్రదేశ చరిత్ర
(సా.శ. 1100 వరకు)
చిలుకూరి వీరభద్రరావు
1910 ఆంధ్రదేశ చరిత్ర
(సా.శ. 1100 నుండి సా.శ. 1323 వరకు)
చిలుకూరి వీరభద్రరావు
1911 స్వీయచరిత్ర
1-2 భాగములు
చిలుకూరి వీరభద్రరావు
-- చంద్రగుప్త చక్రవర్తి ?
-- మహాపురుషుల జీవితచరిత్రలు కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
-- రావిచెట్టురంగారావు జీవితచరిత్ర కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
శాస్త్ర గ్రంథములు
-- జీవశాస్త్రము ఆచంట లక్ష్మీపతి
-- పదార్థ విజ్ఞాన శాస్త్రము మంత్రిప్రగడ సాంబశివరావు
-- రసాయన శాస్త్రము వేమూరి విశ్వనాధ శర్మ
-- వృక్ష శాస్త్రము శీతారామయ్య
-- వ్యవసాయ శాస్త్రము (2 భాగములు) గోవేటి జోగిరాజు
-- అర్థ శాస్త్రము (2 భాగములు) కట్టమంచి రామలింగారెడ్డి
-- జంతుశాస్త్రము --
-- జంతుశాస్త్రము --
-- శారీరకశాస్త్రము --
-- భౌతికశాస్త్రపాఠములు --
-- కలరా ఆచంట లక్ష్మీపతి
-- చలిజ్వరము ఆచంట లక్ష్మీపతి
నవలలు
-- రాణిసంయుక్త వేలాల సుబ్బారావు
-- విమలాదేవి భోగరాజు నారాయణ మూర్తి
పోటీ నవలలు
-- విజయనగర సామ్రాజ్యము దుగ్గిరాల రాఘవచంద్ర్యచౌదరి
-- రాయచూరి యుద్ధము కేతవరపువేంకటశాస్త్రి
-- అస్తమయము భోగరాజు నారాయణ మూర్తి
-- అల్లాహాఅక్బర్ భోగరాజు నారాయణ మూర్తి
-- ప్రళయభైరము ఎ.వి. నరసింహ పంతులు
  • లక్ష్మణరావు స్వయంగా రచించిన హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం
  • డాక్టర్ ఆచంట లక్ష్మీపతి - జీవశాస్త్రం (3,000 ప్రతులు అమ్ముడు పోయాయి), కలరా, మలేరియా (ఇవి రెండూ అనతికాలంలోనే 8,000 ప్రతులు అమ్ముడు పోయాయి)
  • మంత్రిప్రగడ సాంబశివరావు - పదార్థ విజ్ఞాన శాస్త్రం
  • వేమూరి విశ్వనాథ శర్మ - రసాయన శాస్త్రం
  • చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము
  • మైనంపాటి నరసింహం - భౌతిక శాస్త్రం
  • కట్టమంచి రామలింగారెడ్డి - అర్ధ శాస్త్రం
  • దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి - విజయనగర సామ్రాజ్యం
  • వేలాల సుబ్బారావు - రాణీ సంయుక్త
  • భోగరాజు నారాయణ మూర్తి - విమలాదేవి
  • కందుకూరి వీరేశలింగం - స్వీయచరిత్ర
  • వి. శ్రీనివాసరావు - వృక్షశాస్త్రము

1906 - 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 1908 లో ఈ సంస్థను మద్రాసుకు మార్చారు.

1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తును స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం పరిషత్తు లక్ష్యం. అనేక కేంద్రాలలో సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం వంటి రంగాలలో పోటీలు పెట్టి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చేవారు.

ఆంధ్ర పరిశోధక మండలి

మార్చు

1922 డిసెంబర్ 27 న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణా శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది.

ఆంధ్ర సారస్వత పరిషత్తు

మార్చు

1916 లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించినవారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటినుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా, కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం

మార్చు
 
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 2 ముఖచిత్రం. (తొలిముద్రణ)
 
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1 (కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ)ముఖచిత్రం

లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు వ్రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ వ్రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.

అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో విజ్ఞానశాస్త్రము, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు వ్రాశాడు.

ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు.

"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12 న లక్ష్మణరావు మరణించాడు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు.[6] తరువాత డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఏర్పడిన తెలుగు భాషా సమితి ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక, విషయానుక్రమంగా పద్నాలుగు సంపుటాలు ప్రచురించింది. ఈ సంస్థ 1986 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో విలీనమైంది. ఆ తరువాత ఉర్లాం జమీందారు అయిదు సంపుటాలలో "ఆంధ్ర విజ్ఞానం" అని 1938-1941 కాలంలో ప్రచురించాడు.

సాంప్రదాయక పద్దతిలో విజ్ఞానసర్వస్వం కృషి కొనసాగిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం తో పోల్చితే, ప్రపంచం నలుమూలలనుండి ఆధునిక అంతర్జాల సౌలభ్యంతో వందల మంది సాధారణ తెలుగు భాషాభిమానులు 2003 లో మొదలుకొని నిర్మిస్తున్న తెలుగు వికిపీడియా విలక్షణమైనదని చెప్పవచ్చు.

సంఘ సంస్కరణ, స్వాతంత్ర్యోద్యమం

మార్చు

లక్ష్మణరావు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకపోయినా, ఉద్యమానికి పలువిధాలుగా సంఘీభావం ప్రకటించాడు. ఆయన రచనలలో దేశాభిమానాన్ని ప్రోత్సహించాడు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. 1907 కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా ప్రముఖులను సభకు పిలిపించాడు. 1908 లో ఆయన సహచరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అరెస్టు కాగా వారి కుటుంబాన్ని లక్ష్మణరావు ఆదుకున్నాడు.

లక్ష్మణరావు సంఘసంస్కరణా కార్యక్రమాలకు తోడు నిలచాడు. బాల్యవివాహాలను గట్టిగా వ్యతిరేకించాడు. వితంతు వివాహం, రజస్వలానంతర వివాహం, భోగం మేళాల నిషేధం, అస్పశ్యతా నివారణ, సముద్రయానం, అంతశ్శాఖా వివాహం వంటి వాటిని ప్రోత్సహించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అచ్చమాంబతో కలసి ప్రయత్నించాడు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొనేవాడు.

దేశభాషలలో శాస్త్ర పఠనం

మార్చు

లక్ష్మణరావు రచనలలో దేశభాషలలో శాస్త్ర పఠనం అనే వ్యాసాన్ని ప్రత్యేకంగా పేర్కోవాలి. ఈనాటి పరిస్థితులకు కూడా ఈ వ్యాసం నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. శాస్త్రపఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు అన్నాడు. "ఆంగ్లభాషపై అభిమానమున్నయెడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును, కాని కమ్మరము, కుమ్మరమును అదేభాషలో చదువవలసిన అవుసరమేమున్నది?" అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు.

అలాగే ఔరంగజేబు తన గురువునకు ఉపయోగకరమైన విద్యావసరాల గురించీ, అదీ స్వభాషలోనే జరగాలనీ వ్రాసిన ఉత్తరాన్ని లక్ష్మణరావు పారశీక భాషనుండి తెలుగులోకి అనువదించాడు. ఆ అనువాదానికి అనుబంధంగా లక్ష్మణరావు వ్రాసిన వ్యాఖ్యలు గమనించదగినవి:

బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి, గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రథము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆ భాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటినుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును.... కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.... ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు. [7]

వ్యక్తి కాదు, సంస్థ

మార్చు

లక్ష్మణరావు పంతులు ఒక వ్యక్తికాదు, ఒక సంస్థ అని కురుగంటి సీతారామయ్య తన వ్యాసంలో అన్నాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధశాస్త్రవేత్తలు ఆయనద్వారా ఆకర్షితులై 'విజ్ఞానచంద్రికా గ్రంథమండలి' ద్వారా దేశానికి పరిచితులయ్యారు. ప్రథమాంధ్ర చరిత్ర నిర్మాత చిలుకూరి వీరభద్రరావు, రసాయనశాస్త్రవేత్త మంత్రిప్రగడ నరసింహారావు, జీవజంతు వైద్యాలలో నిష్ణాతుడై ఆయుర్వేదానికి అఖిలభారత ప్రచారం కలుగజేసినవారిలో ఒకరైన ఆచంట లక్ష్మీపతి, లక్ష్మణరావు చేత ప్రోత్సాహితులైనవారే.

మొదట రాజకీయోద్యమాలలోను, తరువాత గ్రంథాలయోద్యమంలోనూ జీవితాన్నర్పించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు, తెలంగాణా నాయకుడు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు, అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవచేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావు సహచరులు.

లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణంలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవాడు. ఆర్థిక శాస్త్రవేత్తగా కట్టమంచి రామలింగారెడ్డి విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ద్వారా తెలుగుదేశానికి పరిచయమయ్యాడు.

సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగు లోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రథమాచార్యులుగా పనిచేశాడు.

ఇతర విశేషాలు

మార్చు
  • లక్ష్మణరావు, ఆయన (సవతి) అక్క బండారు అచ్చమాంబ ల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు. అచ్చమాంబ 18-1-1905 లో మరణించింది.
  • ఇంతటి ఆధునికతను సంతరించుకొన్న లక్ష్మణరావు అభిప్రాయాలు వ్యావహారికభాష వాడకం విషయంలో మాత్రం సంప్రదాయంవైపు మొగ్గు చూపాయి. వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి జీవితాన్ని ధారపోసిన ఆయన, విజ్ఞానాన్ని అందరికీ పంచడానికి వ్యావహారికభాష వాడాలని గుర్తించలేకపోయాడు. రచనలలో గ్రాంధిక భాషనే వాడాలని ఆయన అనేకమార్లు నొక్కి వక్కాణించాడు.
  • లక్ష్మణరావు కుటుంబం కృష్ణా జిల్లాకు చెందినది. ప్రాథమిక విద్య తెలంగాణాలో జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివాడు. తెలంగాణా పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారంభించిన సంస్థలవలన ఆధునిక తెలుగు భాష వికాసానికి తెలంగాణా ప్రాంతంలో పునాదులు పడ్డాయి. పోతన నివాసస్థలం అయిన ఏకశిలానగరం, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్లు అని సహేతుకంగా నిరూపించాడు. త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశైలం లతోబాటు మూడవది శ్రీకాళహస్తి కాదని, మంథని దగ్గర ఉన్న కాళేశ్వరమని మొదటిసారి చెప్పినది ఈయనే. ఒక సందర్భంలో ఈయన ఇలా అన్నాడు - ఆంధ్ర దేశమును గురించియు, ఆంధ్ర రాజులను గురించియు, ఆంధ్ర వాఙ్మయమును గురించియును ఎక్కుడు పరిశోధనలను జేసి, క్రొత్తవింతలను కనుగొనదలచినవాఱికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగు భాగమొక బంగారపు గని
  • మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు లక్ష్మణరావుకు బాగా అలవాటయ్యాయి. ఆయన తలగుడ్డ, పొడుగుకోటు, ఉత్తరీయం వేసుకొనే విధానం అలాగే ఉండేవి. తన కుమారునకు వినాయకరావు అని పేరు పెట్టాడు. ఆయన మొదటి గ్రంథం శివాజీ మహారాజు చరిత్ర. - ఒకసారి ఆయన - ఈ మరాఠీవారెప్పుడును ఇట్టి పట్టుదలయు, దేశాభిమానము గలవారు అని వ్రాసాడు.
  • లక్ష్మణరావు ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో క్రొత్తగా వాడాడు. వీటిలో చాలావరకు మరాఠీ వాడకంనుండి గ్రహించినవి - విశ్వ విద్యాలయం, సంపాదకుడు, శిక్షణ, రాష్ట్రీయ అటువంటి కొన్ని పదాలు.
  • 46 ఏండ్ల వయసులో, ఆంధ్రసంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే, కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో, అదే గదిలో, లక్ష్మణరావు మరణించాడు.
  • భారత భాషలలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమైంది తెలుగు లోనే. తర్వాత 1915 లో మరాఠీలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమై 21 సంపుటాలలో 1927నాటికి పూర్తి అయ్యింది. బెంగాలీలో విశ్వకోశం అనే పేరిట విజ్ఞాన సర్వస్వం తర్వాత ప్రచురితమైంది. మిగతా అనేక భాషలలో ఆ ప్రయత్నం అలా కొనసాగడానికి మునుముందే తెలుగులో ఆ బృహత్కార్యాన్ని లక్ష్మణరావు ఆరంభించాడు.
  • తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి తెలుగు వికీపీడియా కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆయన చేసిన సేవ స్మరణీయము.
  • క.రామానుజరావు అనే కలంపేరు కథానికలు రాశారని తెలుగులో మారు పేరురచయితలు -కె.సి అశోక్ కుమార్, ప్రొఎ.ఎ.ఎన్ రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె.కె.రంగనాథాచార్యులు పేర్కొన్నాడు.[8]

ప్రాచుర్యం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20), కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం. (పేజీలు21-32)
  2. Komarraju Venkata Lakshmana Rao: G.Krishna, Life and Mission in Life Series, International Telugu Institute, Hyderabad, 1984.
  3. Komarraju Venkata lakṣmaṇaravu by Akkiraju Ramapatiravu,Visalandhra Publishing house, Vijayawada 1978
  4. భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణరాయ వ్యాసావళి పుస్తకం.
  5. అజ్మీరు వీరభద్రయ్య. తెలుగు భాష, చరిత్రల పరిశోధనా పితామహుడు శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు జీవిత చరిత్ర. అజ్మీరు వీరభద్రయ్య.
  6. "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటాలు (DLI పుస్తకాల ఆర్కైవ్ నకలు)".
  7. "ఈ మాట" పత్రికనుండి Archived 2008-01-06 at the Wayback Machine ఇది ముందుగా "1910 - భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచిక"లో ప్రచురితమయ్యింది.
  8. "తెలుగులో మారు పేరురచయితలు -కె.సి అశోక్ కుమార్, ప్రొఎ.ఎ.ఎన్ రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె.కె.రంగనాథాచార్యులు". Archived from the original on 2014-09-01. Retrieved 2013-12-04.

బయటి లింకులు

మార్చు