వైశాలిని
వైశాలిని నాటకాన్ని అభినవపోతన, విద్యావాచస్పతి బిరుదాంకితుడైన వానమామలై వరదాచార్యులు రచించాడు. తిరుమల శ్రీనివాసాచార్య దీనిని పరిష్కరించగా 1975లో మొదటి సారి ముద్రించబడింది. 2006లో రెండవ ముద్రణ గావించబడింది. ఈ నాటకానికి కేశవపంతుల నరసింహశాస్త్రి విపులమైన పీఠిక వ్రాశాడు. ఇంకా ఈ నాటకానికి పల్లా దుర్గయ్య,పాటిబండ మాధవశర్మ,దివాకర్ల వెంకటావధాని,దేవులపల్లి రామానుజరావు,పోణంగి శ్రీరామ అప్పారావు,దాశరథి రంగాచార్య,కె.రాజన్నశాస్త్రి,జి.వి.సుబ్రహ్మణ్యం మొదలైనవారు వ్రాసిన అభిప్రాయాలు ఉన్నాయి.
వైశాలిని | |
వైశాలిని | |
కృతికర్త: | వానమామలై వరదాచార్యులు |
---|---|
ముద్రణల సంఖ్య: | 2 |
అంకితం: | వైదేహి |
ముఖచిత్ర కళాకారుడు: | మడిపడగ బలరామాచార్య |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | మహా నాటకం |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | వానమామలై వైదేహి |
విడుదల: | 1975, 2008 |
పేజీలు: | 270 |
విశేషాలు
మార్చు- ఈ నాటకాన్ని వరదాచార్యులు తన అర్థాంగి వైదేహికి అంకితం చేశాడు.
- దీనిలో అన్ని నాటక లక్షణాలు ఉన్నాయి. ఇతివృత్తం మిశ్రం.
- శృంగార రసం అంగిరసము. వీర అద్భుత హాస్య రసములు అంగరసములు.
- ఈ నాటకంలో ప్రదర్శనకు అనర్హమైన అంశాలను వివరించడానికి శుద్ధ విష్కంభము, మిశ్రవిష్కంభము, ప్రవేశకాలు, చూళిక ఉన్నాయి.
- ఈ నాటకం ముఖ,ప్రతిముఖ,గర్భ, అవమర్శ,నిర్వహణాలనే పంచ సంధులతో పరిపుష్టమయ్యింది.
- ఈ నాటకము 250 పద్యములతో కొన్ని దీర్ఘవచనములతో కూడి ఉన్న 9 అంకముల పెద్ద నాటకము.
రచయిత పరిచయం
మార్చువానమామలై వరదాచార్యులు 1912, ఆగష్టు 16న మడికొండ గ్రామంలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించాడు. పోతన చరిత్రము, మణిమాల, ఆహ్వానము మొదలైన రచనలు 60కి పైగా రచించాడు. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసి ఆరు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు. గండపెండేర, స్వర్ణాభిషేకాది సత్కారాలు అనేకంగా పొందాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవికోకిల, ఉత్ప్రేక్షాకవిచక్రవర్తి, మహాకవిశిరోమణి, కవిశిరోవతంస ఇత్యాది బిరుదులను సంపాదించాడు. 1984, అక్టోబరు 31వతేదీన మరణించాడు.
పాత్రలు
మార్చుఈ నాటకంలో ఈ క్రింది పాత్రలు ఉన్నాయి.
- సూత్రధారుడు
- మారిషుడు
- చిత్రాంగదుడు
- మణికంధరుడు
- అవీక్షితుడు
- సూతుడు
- కణ్వపుత్రుడు
- విదూషకుడు
- సువ్రతుడు
- శ్యామల
- సరళ
- వైశాలిని
- బ్రహ్మ
- పార్వతి
- దృఢకేశి
- ద్విజిహ్వుడు
- కంచుకి
- వజ్రదంతుడు
- సోమదత్తుడు
- రవివర్మ
- కరంధముడు
- విశాలుడు
- భిల్లి
- దేవదూత
- వీరమాత
- అంశుమతి
- సునయుడు
- తుంబురుడు
- సుమాలిని
కథా సంగ్రహం
మార్చుమూల కథ మార్కాండేయ పురాణంలోనిది. దానికి కొంత కల్పన జోడించి విస్తరించి 9 అంకాలుగా ఈ నాటకం రచించబడింది. ఈ నాటకం శుద్ధ విష్కంభంతో ప్రారంభమౌతుంది. దీనిలో గంధర్వ రాజయిన సునయుడి కుమార్తెను అగస్త్యుడు శపిస్తాడు. తత్ఫలం వల్ల వైశాలినిగా జన్మిస్తుంది.
మొదటి అంకంలో నాయకుడైన అవీక్షితుడు జంట పాముల తలలను పువ్వులనుకొని కొట్టటం వల్ల శాపగ్రస్తుడవుతాడు. ఏడు గడియల పాటు నాగబంధనంలో ఉండడమే ఆ శాపం.
వైశాలిని సువ్రతుడి ఆశ్రమంలో ఉంటుంది. ఆ విషయం అవీక్షితుడు తెలుసుకొంటాడు. విదూషకుడితో కలిసి వెళ్తాడు. సువ్రతుడే స్వయంగా వైశాలిని సౌందర్యం గురించి వర్ణిస్తూ అవీక్షితుడికి చెప్తాడు. ఈ కథలో ప్రతినాయకుడు దృఢకేశి. దృఢకేశిని చంపిన తర్వాతే వైశాలినిని పెళ్ళాడతానంటాడు అవీక్షితుడు.
రెండో అంకంలో వైశాలిని చెలికత్తెలు శ్యామలా సరళలు వాద్యసహకారం అందించగా, వైశాలిని పాడుతూ ఆడుతోంది. అది అవీక్షితుడు, విదూషకుడూ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి చూస్తారు. అవీక్షితుడు వైశాలినిని వర్ణిస్తూ రాసిన కవితా పత్రాన్ని ఆమెకే ఇస్తాడు. ఆ తరువాత అర్ఘ్యంకోసం వెళ్ళిన వైశాలినిని ఏనుగు తరుముకొస్తుంది. అవీక్షితుడు రక్షిస్తాడు.
మూడో అంకంలో వైశాలిని విరహం. శ్యామల ఓదార్పు. దృఢకేశి తన మిత్రుడయిన ద్విజిహ్వుడితో అవీక్షితుడి వధకై ఎత్తు వేస్తాడు.
నాలుగో అంకంలో అవీక్షితుడు వైశాలినిని రాక్షసబాధ నుండి రక్షిస్తాడు. వీరిరువురి సమాగమం. తరువాత వైశాలిని స్వయంవరం. అవీక్షితుడు వెళ్తాడు. అక్కడ నారాయణాస్త్రం ప్రయోగించి వజ్రదంతుడనే గంధర్వుడి భార్యను రాక్షస బాధనుండి రక్షిస్తాడు. తర్వాత శత్రుసైన్యాలు విదిశానగరాన్ని చుట్టుముడతాయి. అవీక్షితున్ని దృఢకేశి నాగపాశంతో బంధించి కారాగారంలో ఉంచుతాడు. అప్పుడు అవీక్షితుడి తండ్రి కరంధముడు ప్రవేశిస్తాడు. అతడి రాకతో శత్రువులు పారిపోతారు.
ఐదో అంకంలో వైశాలిని అవీక్షితుణ్ణి విడిపిస్తుంది. కరంధముడు, విశాలరాజు (వైశాలిని తండ్రి) పరస్పరం మాట్లాడుకొని వీరిద్దరికీ వివాహం చేయాలనుకొంటారు. కానీ అవీక్షితుడు దృఢకేశిని చంపడానికి వెళ్ళగా, వైశాలిని సువ్రతుడి ఆశ్రమానికి తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది.
ఆరో అంకంలో వైశాలినికి అడవిలో ఒక దేవదూత, భిల్లి తారసపడతారు.అవీక్షితున్ని పొందలేని వైశాలిని గంగలో దూకుతుంది. అవీక్షితుడి తల్లి కిమిచ్ఛకవ్రతం చేయాలని సంకల్పిస్తుంది.
ఏడో అంకంలో వైశాలిని భిల్లి ఆధీనంలో ఉంటుంది.దృఢకేశి భిల్లిని చంపే ప్రయత్నం చేస్తాడు. నాగపాశంలో ఉన్న అవీక్షితుడు అక్కడికి వచ్చి దృఢకేశిని చంపుతాడు. అయితే వైశాలిని అవీక్షితుణ్ణి గుర్తించలేకపోతుంది. అశరీరవాణి అతడు అవీక్షితుడేనని చెప్పడంతో నమ్ముతుంది.
ఎనిమిదో అంకంలో సునయుడు, తుంబురుడు, అంశుమతి, విశాలుడు విమానంలో వస్తారు. సునయుడు వైశాలిని పూర్వజన్మలో తన కూతురేనని శాపం వల్ల విశాల రాజుకు జన్మించిందని చెప్తాడు. వైశాలినికి, అవీక్షితునికి వివాహం జరుగుతుంది. తర్వాత గంధర్వలోకానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరకాలం ఉంటారు. వారికి మరుత్తు జన్మిస్తాడు.
తొమ్మిదో అంకంలో అవీక్షితుడి తల్లిదండ్రులనూ సునయుడు గంధర్వలోకానికి తీసుకువెళ్తాడు. తరువాత అవీక్షితుడు తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో తిరిగి రాజ్యానికి వస్తాడు. స్థూలంగా ఇదీ కథ.
మూలాలు
మార్చు- శతవసంత సౌరభాలు - శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల శతజయంతి ప్రత్యేక సంచిక - బేతవోలు రామబ్రహ్మం వ్యాసం - పేజీలు 202-213
- కేశవపంతుల నరసింహశాస్త్రి వ్రాసిన పీఠిక - వైశాలిని - నాటకము - పేజీలు 5-22
- జి.వి.సుబ్రహ్మణ్యం వ్రాసిన వైజయంతి - వైశాలిని - నాటకము - పేజీలు 45-63