శీరిపి ఆంజనేయులు

శీరిపి ఆంజనేయులు (జూన్ 1, 1890 - నవంబర్ 27, 1974) [1][2] కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా అనంతపురం జిల్లాకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టాడు.

శీరిపి ఆంజనేయులు
Siripi anjaneayulu.jpg
జననంశీరిపి ఆంజనేయులు
జూన్ 1, 1890
అనంతపురం జిల్లా ధర్మవరం
మరణంనవంబర్ 27, 1974
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి, పత్రికాసంపాదకుడు
మతంహిందూ
భార్య / భర్తసావిత్రమ్మ
తండ్రిరామన్న
తల్లినారమ్మ

జీవిత విశేషాలుసవరించు

ధర్మవరం వీధిబడులలోను, మిషన్ స్కూలులోను ఇతని ప్రాథమిక విద్య సాగింది. కలకత్తాలోని అఖిల భారత విద్యాపీఠం నుండి ఉత్తమశ్రేణిలో పట్టపరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. తాను చదివిన మిషన్ స్కూలులోనే ఉపాధ్యాయుడిగా పదేండ్లు పనిచేశాడు. జిల్లాపరిషత్ హైస్కూలులో ఐదేళ్లు, అనంతపురం లోని గర్ల్స్ ట్రైనింగ్ స్కూలులో 22 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ధర్మవరంలో విజ్ఞానవల్లికా గ్రంథమాలను స్థాపించి తన రచనలనే కాకుండా నారు నాగ నార్య, వేదం వెంకటకృష్ణశర్మ, కుంటిమద్ది శేషశర్మ, కలుగోడు అశ్వత్థరావు, విద్వాన్ విశ్వం మొదలైన ప్రముఖ రాయలసీమ కవిపుంగవుల పుస్తకాలను ముద్రించాడు. విజ్ఞానవల్లి, ప్రకృతిమాత, విద్యార్థి మొదలైన పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి సమర్థవంతంగా వాటిని నడిపాడు.

ఇతడు సాహిత్య పోషణ మాత్రమే కాకుండా భూరిదానములు చేశాడు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ భూదాన సమితికి 72 ఎకరాల నేలను దానం చేశాడు. 1949లో ధర్మవరం రైల్వేజంక్షన్ పడమరవైపు 120 ఎకరాల సొంతనేలలో ఆంజనేయపురం అనే పేటను నెలకొల్పాడు. ధర్మవరంలో కళాశాల భవన నిర్మాణానికి 24 ఎకరాల భూమిని దానం చేశాడు. భారత రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా 1116/- రూ.లు విరాళం ఇచ్చాడు. ఇతడికి ప్రకృతి వైద్యం అంటే నమ్మకముండేది. ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేశాడు. గాంధీకంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టినవాడు శీరిపి ఆంజనేయులు.

ధర్మవరం చెరువును శ్రీ క్రియాశక్తి యొడయరు నిర్మించి తన తల్లి ధర్మాంబ జ్ఞాపకార్థం గ్రామ నిర్మాణం చేసి ధర్మవరం అను పేరుపెట్టాడు. ప్రజలలో విద్యా విజ్ఞాన వికాసానికి పాటుపడవలెనను సంకల్పంతో తన కుటీరంలోనే "శ్రీ క్రియాశక్తి యొడయరు" పేరిట ఒక గ్రంథాలయమును స్థాపించాడు శీరిపి ఆంజనేయులు. పట్టణంలోని దాతల సహాయంతో 1915 డిసెంబరు 1 తేదీన శ్రీ క్రియాశక్తి యొడయరు సమాజాన్ని ఏర్పాటుచేసి గ్రంథాలయాన్ని అక్కడికి తరలించాడు. దాదాపు పదేళ్ళు ఈ గ్రంథాలయానికి కార్యదర్శిగా నిస్వార్థసేవ చేశాడు. ఈ గ్రంథాలయం 1960 వరకు స్వచ్ఛంద సేవా కార్యకర్తల నిర్వహణలోనే అభివృద్ధి గాంచింది. 1960లో జిల్లాగ్రంథాలయసంస్థ ధర్మవరంలో శాఖా గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసినపుడు దీనిని ఆ సంస్థకు అప్పగించాడు.

రచనలుసవరించు

ఇతని రచనలు ఆంధ్రపత్రిక దిన వార పత్రికలలోను, ఉగాది సంచికలలోను, శారద, భారతి, గృహలక్ష్మి, చంద్రిక, శ్రీ సాధనపత్రిక మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. సుమారు 40 పుస్తకాలను రచించాడు. కొన్ని పుస్తకాల జాబితా ఇలా ఉంది.

 1. విద్యానగర చరిత్రము
 2. విద్యానగర వీరులు[3]
 3. ధర్మవర చరిత్రము
 4. అనంతపుర మండల ఆదివాసుల చరిత్ర
 5. చిక్కప్ప యొడయరు లేక చిక్కన్న మంత్రి
 6. ముసలమ్మ ముక్త్రి
 7. శారద (డిటెక్టివ్ నవల)
 8. కుముదవల్లి (నాటకము)
 9. వీరవిలాసము (నాటకము)
 10. గౌతమ బుద్ధ చరిత్ర
 11. సీతారామావధూత చరిత్ర
 12. అన్యాపదేశము
 13. కరుణగీత
 14. జీర్ణవిజయనగర దర్శిని
 15. హనుమప్ప నాయుడు
 16. ప్రహ్లాదచరిత్ర
 17. కవి పరిచయం
 18. ప్రకృతివైద్యము

రచనలనుండి ఉదాహరణలుసవరించు

దిష్టిబొమ్మ వర్ణన

కాయమా వట్టి కఱ్ఱ; కన్గవయుఁ దొఱ్ఱ;
మస్తకము మట్టి బుఱ్ఱ; జన్మమ్మె పఱ్ఱ;
బూటకపు గాపువై పొలములను నిల్చి,
జంతు సంతానముం జడిపింతు వౌర!
గుట్టు సాగిన దాక నీ కొలువు సాగు
నో బెదురు బొమ్మ! గుట్టు రట్టొందె నేని
యెవడు నిన్నొక మనిసిగా నెన్నువాడు?
వేస మెన్నాళ్ళు మూసి దాపెట్టఁ గలము?
(అన్యాపదేశము నుండి)

బిరుదముసవరించు

ఇతనికి సాహిత్యసరస్వతి అనే బిరుదు ఉంది.

మూలాలుసవరించు

 1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
 2. వార్త అనంతపురంజిల్లా ప్రత్యేకసంచిక అనంతనేత్రం
 3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో