కుంటిమద్ది శేషశర్మ
శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన కుంటిమద్ది శేషశర్మ అనంతపురం జిల్లా కవులలో ఎన్నదగినవాడు. ఫిబ్రవరి 28 1913 లో జన్మించాడు.[1]
కుంటిమద్ది శేషశర్మ | |
---|---|
జననం | కుంటిమద్ది శేషాచార్యులు 1913 ఫిబ్రవరి 28 అనంతపురం |
మరణం | 1996 మే 4 | (వయసు 83)
వృత్తి | ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు |
ప్రసిద్ధి | సంస్కృతాంధ్ర కవి |
మతం | హిందూ |
భార్య / భర్త | జయలక్ష్మి |
పిల్లలు | మకరంద, సదానంద, శరదిందు, సుధాసింధు, రంగధామ, సౌదామిని, పద్మిని |
తండ్రి | కుంటిమద్ది వేంకటరంగాచార్యులు |
తల్లి | శేషమ్మ |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుకుంటిమద్ది శేషశర్మ తండ్రి వేంకటరంగాచార్యులు ఇతని బాల్యంలోనే మరణించడంతో ఇతడు తన తాత కుంటిమద్ది శేషాచార్యుల వద్ద బళ్ళారిలో పెరిగాడు. ఇంటి వద్దనే ప్రాథమిక విద్యనేర్చి వార్డ్‌లా స్కూలులో 3,4 తరగతులు, తర్వాత మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదివాడు. తన తాతగారైన కుంటిమద్ది శ్రీనివాసాచార్యుల వద్ద ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు. అక్కడ తిరుమల రామచంద్ర, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, రూపావతారం నారాయణ శర్మ, చెలమచర్ల రంగాచార్యులు మొదలైన వారు ఇతని సహాధ్యాయులు. 1938లో తెలుగు విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు.
ఉద్యోగం
మార్చు1937నుండి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పెనుకొండ హైస్కూళ్లలో ఆంధ్ర ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. చదివాడు.[1] 1959 నుండి 1971 వరకు ధర్మవరం జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు.
కుటుంబం
మార్చుఇతని భార్య జయలక్ష్మమ్మ. ఈ దంపతులకు మకరంద, సదానంద, శరదిందు, సుధాసింధు, రంగధామ అనే ఐదుగురు కుమారులు, సౌదామిని, పద్మిని అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు.[1] మకరంద బెంగళూరులో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశాడు. రెండవ కుమారుడు సదానంద వాషింగ్టన్ (అమెరికా)లో డిఫెన్స్ లాబొరేటరీలో సైంటిస్ట్‌గా పనిచేశాడు. అతని భార్య మృణాలిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి. అమెరికాలో కూచిపూడి నృత్యాన్నినేర్పించే కళామండపం అనే సంస్థను నడుపుతున్నది.[2] మూడవ కుమారుడు సహకార రంగంలోను, నాలుగవ కుమారుడు అమెరికాలో టెలికమ్యూనికేషన్ రంగంలోను, ఐదవ కుమారుడు వైద్యుడిగా పనిచేశారు. కుమార్తె సౌదామిని ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. రెండవ కుమార్తె గృహిణిగా అమెరికాలో ఉంటున్నది.
రచనలు
మార్చుఇతని రచనలు శ్రీసాధన పత్రిక, ఆంధ్రప్రదేశ్, భారతి, సప్తగిరి, నృసింహప్రియ మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి కడప, అనంతపురం కేంద్రాల నుండి ఇతని ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
తెలుగు రచనలు
- సుధాబిందువులు
- తెలుగుతల్లి
- శ్రీమద్రామాయణ పర్యావలోకనము
- విశిష్టాద్వైత సిద్ధాంత దర్పణము
- రామిరెడ్డి
- శ్రీ కేశవప్రపత్తి
- శ్రీ యతిరాజీయము - రామానుజాచార్యుల చరిత్ర (10 గుచ్ఛములు)
- శాంతి విలాసము - నీలకంఠదీక్షితుని 'ధర్మప్రబోధ' కావ్యానికి ఆంధ్రానువాదం. శ్రీసాధనపత్రికలో ధారావాహికగా వెలువడింది.
- రామానుజులు షడర్థములు
- అలంకార విచారము - పరిశోధన ద్వైమాస పత్రికలో ప్రచురింపబడింది.
- గీతామృతము - తమిళ తిరుప్పావై కావ్యానికి ఆంధ్రానువాదం
- గీతానవనీతము
- శ్రీ గోదాదేవి స్తుతి
- మేలినోము
- న్యాస మంజరి
- మిణుగురులు
- హంస సందేశము
- సంగ్రహ రామాయణము
- శ్రీ హనుమద్విలాసము
- శ్రీనివాస కుసుమాంజలి
- పరకాల మఠ వైభవము
- పరమార్థదీపిక
- హంపన్న చరితము (బుఱ్ఱకథ) - ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక జూన్,1964 సంచికలో ప్రచురింపబడింది.
సంస్కృత కావ్యాలు
- శ్రీ కేశవ సుప్రభాతమ్
- బాష్ప బిందవః
- సుమతి శతకము
- మను సంభవః
- ముకుంద విలాసః
- విష్ణుచిత్తీయము (ఆముక్త మాల్యదకు సంస్కృతానువాదం)
- రాఘవేంద్ర చరితమ్
- ఇందిరా వందనమ్
రచనల నుండి ఉదాహరణలు
మార్చు- నిలువు దోపు లిత్తు - నీరాజనము లిత్తు
- ముడుపు లిత్తు - కురుల ముడుల నిత్తు
- ఆర్తి బాపు మనగ - నారోగ్య మిమ్మన
- లంచ గొండి వని - తలచ లేదు
- కానుకలను జూపి - కైమోడ్పులర్పించి
- కావుమనెడి వారి - కామితముల
- దీర్చి, యన్యజనుల - ధికార మొనరించు
- నాశ పాతకుండ - వని తలంప
- కోరి కొందును గాని - కొమ్మన నేరను
- నీకు నిచ్చుటకును - నేనెవండ?
- ఇచ్చి పుచ్చుకొనుట - కీవు, విక్రేతవు
- గావు, బేరగాడ - గాను నేను.
- (సుధాబిందువులు కావ్యం నుండి)
- ఆసూగూసులతో (Ass-Goose) కమెన్సయిన, ఈ ఆంగ్లంపు
- మర్యాద, నభ్యాసంబే-గణనీయ మంచు నుడువన్, పాశ్చాత్య
- విద్యానిధుల్ - శాసింపన్‌దొరలట్ల నన్యగతికుల్, సాగించి
- రధ్యాపకుల్ - గ్రాసావాస విలోపలోల ధిషణాక్రాంతుల్ యథోక్తక్రముల్
- (తెలుగుతల్లి నుండి)
- చెందోవ నిగ్గుతో - జిలుగు - చేలపు టంచులు జిందులాడ - నం
- దందు బదంబు లందు; సరిగంచుల గుత్తపు నీలరైక - క
- న్విం దొనరింప నుజ్వల మణిమయ భూషలు దాల్చి, దేవతా
- మందిర మేగుచున్నది సుమా - అది కోమటి కోడలంటరా!
- ఒంటికి నంటు కొన్న, తెలియొల్లియ ప్రాయపుమేని పొంకమున్
- కంటికి విందు సేయ, కరకంజములన్ ధరియించి, పంచ పా
- ళింటికి నింటికిన్ వరుస - నిందు నిభానన గేస్త్రురాండ్ర, పే
- రంటము బిల్వ బోయెడినిరా - అది కోమటి కోడలంటరా!
- (రామిరెడ్డి కావ్యములో కోమటి కోడలి వర్ణన)
- నిన్నే - నే శరణంటి - నా యవనమున్ - నీభారమే యంటి, య
- న్యున్నే వేడను, నీకె సేవకుడ, నన్నున్‌బాలలో ముంచినా
- మున్నీటన్ బడద్రోసినా అది యశమ్మో,నిందయో, నీకె - ఆ
- పన్నానీక శరణ్య - కీర్తికి దగన్ వర్తింపుమో - కేశవా!
- (శ్రీకేశవ ప్రపత్తి నుండి)
- శంకర!చంద్రశేఖర!వృషధ్వజ!కృత్తివరాసి!మృత్యు నా
- శంకర!పార్వతీ రమణ!సర్పవిభూషణ!భూషణాయితై
- ణాంక కపాలమాల! నయనాయిత పావక! నీలకంఠ! నీ
- కింకరి లెంక దానఁ దిలకింపుము దీనిదయన్ మహేశ్వరా!
- (శ్రీయతిరాజీయములో కాళహస్తీశ్వరుని వర్ణన)
- ఎన్నిభవంబు లెత్తితినొ? ఎందఱు తల్లుల బిడ్డ నైతినో?
- ఎన్నిటి నీతి వాక్యముల - నెందఱు పెద్దలు సెప్పవింటినో?
- ఎన్నిటి దుఃఖముల్ సుఖము లెన్నిటి గంటినొ? నైననేమి? య
- న్నన్న! విరక్తి పుట్టదు గదా! విషయంబుల నించుకేనియున్
- (శాంతి విలాసము నుండి)
పండిత ప్రశంస
మార్చు"శేషశర్మ విద్వత్కవివర్యుడు. అలంకారశాస్త్ర పారంగతుడు. రసగంగాధర ఫక్కీలో ఈయన రచించిన 'అలంకార విచారము' విద్వాంసుల తలలూపేటట్టు చేసింది. ఈయన 'సుధాబిందువులు' సహృదయ సుధాబిందువులు. 'తెనుగుతల్లి' లోకవృత్తము పుణికి పుచ్చుకొన్న కవితామతల్లి." - తిరుమల రామచంద్ర
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 ఆర్.దేవన్న (2000). విద్వత్కవి కుంటిమద్ది శేషశర్మ రచనలు అనుశీలనము (PDF) (1 ed.). అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. Retrieved 6 July 2021.
- ↑ [1] Archived 2014-10-10 at the Wayback Machine కళామండపం
వెలుపలి లంకెలు
మార్చు- రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం