శ్రీరాం వీరబ్రహ్మకవి

తెలుగు రచయిత

19వ శతాబ్దం మలి దినాలలో దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో విశ్వకర్మ వంశీయుల దుస్థితిని గుర్తించి, వారిలో చైతన్యం తీసుకుని రావటానికి నిశ్శబ్ద ఉద్యమం తీసుకుని వచ్చిన తొలితరం విశ్వకర్మ ప్రముఖుల్లో శ్రీరాం వీరబ్రహ్మాచార్యులు అగ్రగణ్యుడు. అవగాహన కల్పించకుండా ఉద్యమం నడిపించి రెచ్చగొడితే, బడుగుజీవుల జీవితాల్లో మార్పు రాకపోగా పెడదారి పట్టే ప్రమాదం వుంటుందని నమ్మిన మేధావి శ్రీరాం వీరబ్రహ్మకవి.

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1885, ఆగష్టు 23వ తేదీకి సరియైన తారణ నామ సంవత్సం భాద్రపద శుద్ధ తదియ శుక్రవారం నాడు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో సుబ్బమ్మ, గంగయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు బాల్యంలో మచిలీపట్నంలో థర్డ్ ఫారం వరకు విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలోనే సంస్కృతాంధ్రాలలో కావ్యాలు, నాటకాలు, శబ్దశాస్త్రం అధ్యయనం చేశాడు. ఇతడు కొంతకాలం గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు లోను, దోనేపూడి లోను స్వర్ణకారవృత్తిని నిర్వహించాడు. తరువాత 1912 నుండి 1922 వరకు బందరు లోని నోబుల్ కళాశాలలో పండితుడిగా పనిచేశాడు. 1922-24 మధ్య షార్క్ స్కూలులో ఉపాధ్యాయుడిగా, 1947-58 మధ్యకాలంలో హిందూ ప్రెస్‌లో పనిచేశాడు.[1]

రచనలుసవరించు

ఇతడు 1907 నుండి రచనలు చేయడం ప్రారంభించి అనేక పద్యకావ్యాలు, గేయకావ్యాలు, నాటకాలు, నవలలూ, శతకాలు, హరికథలు, జీవితచరిత్రలు వ్రాశాడు. ఇతడు వెలువరించిన గ్రంథాలలో కొన్ని:

 1. కొండవీటి విజయము (పద్యకావ్యము)
 2. శ్రీకాళహస్తీశ్వరవిలాసము (పద్యకావ్యము)
 3. తుక్కారామ్‌ (పద్యకావ్యము)
 4. భక్తామృతము
 5. అన్యాపదేశము
 6. నానా రాజన్య చరిత్రము
 7. శ్రీపీఠికాపుర సంస్థాన చరిత్రము
 8. వినోదిని
 9. వాసంతిక
 10. చంద్రకాంత
 11. జపానీయము
 12. సంసారశోభ
 13. చైనీయము
 14. ప్రియదర్శిక
 15. రుచీదేవి
 16. శ్రీ విరాట్‌ప్రభు శతకము
 17. శివకేశవాభేద స్తుతి
 18. భ్రమరాంబా స్తోత్రము
 19. మార్కాండేయ విలాసము (హరికథ)
 20. పాదుకా పట్టాభిషేకము (హరికథ)
 21. పంచవర్ష ప్రణాళికా ప్రచారిణి (హరికథ)
 22. ప్రపంచపౌరుడు (సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితచరిత్ర)
 23. గిల్టు శాస్త్రము
 24. సమస్యావళి మొదలైనవి.

అవధానాలుసవరించు

ఇతడు అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు అనేకం చేశాడు. ఇతడి సహస్రావధానం ఈ విధంగా ఉండేది. ఒకటి నుండి వెయ్యి కార్డులపై భాగాన అంకెలను వేస్తారు. ఒక్కో కార్డులో పద్యాలు, రంగు రంగుల బొమ్మలు, ఒకటి నుండి వంద వరకు అంకెలకు వర్గమూలాలు, ఘనమూలాలు, సమస్యలు, వర్ణనలు, కల్పనలు మొదలైనవి ఉంటాయి. వాటిని కంఠస్తం చేసుకొని రోజుకు రెండువందల చొప్పున 5రోజులు ధారణచేస్తాడు. తరువాత ఒక రోజు విశ్రాంతి తీసుకుని తరువాత రెండు రోజులు అవధానం నిర్వహిస్తాడు. ఆ సమయంలో కార్డు సంఖ్య అడగగానే ఆ కార్డుపై ఉన్న సంగతులకు అవధాని పద్యరూపంలో సమాధానమిస్తాడు.

అవధానాలలో కొన్ని పూరణలుసవరించు

 • సమస్య: యమునకు తప్పదుగ భస్మమగు టెపుడైనన్

పూరణ:

విమలాంబర, రత్నాభర
ణముల నలంకృతము గాంచి నవ షడ్ర్రసభో
జ్యములన్ బెఱిగిన యీ కా
యమునకు తప్పదుగ భస్మమగు టెపుడైనన్

 • సమస్య: కాముడు దున్నపోతు, గణనాథుడు మర్కటమూర్తి యారయన్

పూరణ:

 హైమవతీసతీశునయనాగ్ని నశించె నెవండు? సుంతయున్
బ్రేముడిలేని కాలుడు చరించుటకెయ్యది వాహనంబు? దై
త్యామర మానవాళి తొలియర్చనలందెడి వేల్పెవండు? శ్రీ
రామ పదాబ్జసేవల విరాజిలు నెవ్వడనన్ గ్రమంబునన్
కాముడు, దున్నపోతు, గణనాథుడు, మర్కటమూర్తి యారయన్

 • సమస్య: దాతయనబడు ధాత దాతగాడు

పూరణ:

అడిగినది యెల్లనిచ్చువాడగుట విశ్వ
దాతయయ్యె నాగేశ్వర ధన్యతముడు
అమరులకు జ్యేష్ఠుడౌట లోకములకెల్ల
దాతయనబడు ధాత దాతగాడు

 • సమస్య:మానహీనునకు నమస్కరింతు

పూరణ:

ఈషణ త్రయమును ద్వేహించి కామాది
శత్రు షట్కమున వశంబుగాక
సోహమని జపింప నర్హుడౌ దేహాభి
మానహీనునకు నమస్కరింతు

 • సమస్య: శిరము నందైదు పశువులఁజేర్చి కొంటి

పూరణ:

నాదు పశు సంపదను బెంపొనర్పఁదలఁచి
వ్యయ భరంబుకై వెనుకాడబోక
ఆశ్వయుజ కార్తీకములఁ బదారు, మార్గ
శిరము నందైదు పశువులఁజేర్చి కొంటి

సన్మానాలు,సత్కారాలుసవరించు

మరణముసవరించు

ఇతడు 1970, జనవరి 20వ తేదీన మచిలీపట్టణంలో మరణించాడు.

మూలాలుసవరించు

 1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 141–147.